NMC: గ్రామాలకు ఎంబీబీఎస్ విద్యార్థులు!.. ప్రతి వైద్య విద్యార్థికి ఇన్ని కుటుంబాల దత్తత..
Sakshi Education
వైద్య విద్యార్థులు గ్రామాలకు వెళ్లి కుటుంబాలను దత్తత తీసుకోవాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఫ్యామిలీ డాక్టర్‌లా వ్యవహరించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) సూచించింది.
క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య పరిస్థితులపై అవగాహన, వైద్య విద్యను పూర్తిచేసే లోగానే తగిన అనుభవం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కుటుంబాల దత్తతను ఇప్పటికే ఎంబీబీఎస్ పాఠ్య ప్రణాళికలో చేర్చినా.. తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీచేసింది. దీని ప్రకారం.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలోనే కుటుంబాల దత్తత ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఒక్కో వైద్య విద్యార్థికి కనీసం 5 కుటుంబాలను కేటాయిస్తారు.
ఒక ఫ్యామిలీ డాక్టర్‌లా..
- దత్తత తీసుకున్న కుటుంబాల వివరాలన్నీ నమోదు చేసేందుకు లాగ్ బుక్‌ను నిర్వహించాలి. ఒక్కో కుటుంబానికి ప్రత్యేకంగా కొన్ని పేజీలు కేటాయించి.. వారి పేర్లు, వయసు, నివసించే ఇల్లు, పరిసర ప్రాంతాల పరిస్థితి, వారి ఆరోగ్యం, వైద్య పరీక్షల ఫలితాలు, అవసరమైన చికిత్సలు వంటివన్నీ నమోదు చేయాలి. తమకు కేటాయించిన కుటుంబాలకు ఒక ఫ్యామిలీ డాక్టర్ తరహాలో వ్యవహరించాలి. వ్యక్తులందరి ఆరోగ్యాన్ని తరచూ పరిశీలించాలి. వైద్య పరీక్షలు చేయించాలి.
- కుటుంబంలోని వారికి రక్తహీనత, పిల్లల్లో పోషకాహార లోపం, బీపీ, మధుమేహం, మూత్రపిండ వ్యాధులు, ఇతర ఏవైనా స్థానిక వ్యాధులుంటే గుర్తించి తగిన వైద్యం అందించాలి. రోగనిరోధకశక్తి పెంపొందించుకునే మార్గాలను, వ్యాయామం, యోగా వంటివి సూచించాలి. పరిశుభ్రత ప్రాధాన్యాన్ని వివరించాలి. ఏవైనా వ్యసనాలు ఉంటే వాటి నుంచి బయటపడేలా అవగాహన కల్పించాలి.
- కుటుంబంలోని వారికి ఏదైనా అత్యవసర వైద్య సాయం అవసరమైతే వెంటనే తనను సంప్రదించేలా ఫోన్ నంబర్ ఇవ్వాలి. వారికి వైద్య సాయం చేయాలి. పైస్థాయి వైద్యాధికారులకు సమాచారమిచ్చి తదుపరి వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా సదరు కుటుంబాలకు అవసరమైన వైద్యం అందించేలా చూడాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనైతే అక్కడున్న రాయితీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
- ఆరో సెమిస్టర్ నాటికి ఎంబీబీఎస్ విద్యార్థులు ఆయా కుటుంబాలకు సంబంధించిన పూర్తి హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయాలి.
- గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. వాటిని డాక్యుమెంటేషన్ చేయాలి. అందుకు సంబంధించిన ఫొటోలను తీయాలి. అవసరమైతే ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల సహకారం తీసుకోవాలి.
- ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ విద్యార్థులకు దత్తత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు.
Published date : 17 Jun 2023 03:11PM