Skip to main content

విద్యాసంస్కరణలతో సత్ఫలితాలు

రాష్ట్రంలోని విద్యారంగంలో సీఎం వైఎస్‌ జగన్ తీసుకొచ్చిన వినూత్న సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. ప్రభుత్వం విద్యాపరమైన అంశాల్లోనే కాకుండా, పరిపాలన పరమైన సంస్కరణలు కూడా చేపట్టడం సత్ఫలితాలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ఆర్థిక సర్వే–2021లో ఈ అంశాలు ప్రస్ఫుటమయ్యాయి.
Good results with educational reforms
అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల్లో విప్లవాత్మక మార్పులు

పటిష్ట పునాదులకు ఆరంచెల విధానం

ఇప్పటివరకు ప్రాథమిక (1–5 తరగతులు), ప్రాథమికోన్నత (1–7) ఉన్నత (6–10 తరగతులు) విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. పాఠశాలల్లో చేరకముందు పిల్లలకు పూర్వప్రాథమిక విద్య లేదు. ప్రైవేటు స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ స్కూళ్లలో ఆ ఏర్పాట్లు ఆదినుంచి లేవు. ఫలితంగా ఈ స్కూళ్లలో చేరే అత్యధిక శాతం మంది పేద విద్యార్థులకు చదువుల పునాదులు పటిష్టంగా ఉండడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఆరంచెల స్కూళ్ల విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రీస్కూల్‌ స్థాయి నుంచి సెకండరీ స్థాయి వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యం (సస్టయినబుల్‌ డెవలప్‌మెంటు గోల్‌–ఎస్‌డీజీ)ని పెట్టుకుని ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేపట్టింది. క్వాలిటేటివ్‌ (వాసి), క్వాంటిటేటివ్‌ (రాశి) నాణ్యతా ప్రమాణాలు, అభివృద్ధికి మార్గాలు ఏర్పాటు చేసింది. అంగన్ వాడీ కేంద్రాలను పాఠశాలలకు అనుసంధానం చేయడం, వీలు లేనిచోట యథాతథంగా కొనసాగిస్తూ పీపీ–1, పీపీ–2తో ఫౌండేషనల్‌ విద్యకు శ్రీకారం చుట్టింది. శాటిలైట్‌ ఫౌండేషనల్, ఫౌండేషనల్, ఫౌండేషనల్‌ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌ అనే ఆరంచెల విధానంతో ప్రతి విద్యార్థికి స్కూళ్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. దీనిద్వారా 3వ తరగతి నుంచే విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధన అందుబాటులోకి వస్తోంది. లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఆటస్థలంతో కూడిన హైస్కూళ్లలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది. వీటిని సింగిల్‌ మీడియం చేస్తూ విద్యార్థులకు సమగ్రమైన బోధన అందేలా చేస్తోంది. జూనియర్‌ కాలేజీలు లేని 202 మండలాల్లో కొన్ని హైస్కూళ్లను హైస్కూల్‌ ప్లస్‌గా మార్చి ఇంటర్‌ తరగతులను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 61,655 స్కూళ్లలో 72,48,518 మంది విద్యార్థులున్నారు.

చదవండి: 

Governor: నూతన విద్యా విధానంతో నవశకానికి నాంది

విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌తో అప్‌స్కిల్లింగ్‌ కార్యక్రమం

మేలు చేస్తున్న అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాకానుక

ఆరంచెల విధానంలో ప్రభుత్వ స్కూళ్లను అందుబాటులోకి తేవడంతోపాటు సబ్జెక్టు టీచర్లతో బోధన వల్ల మేలు కలుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంతో స్కూళ్లు వివిధ వసతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. తరగతి గదులు, ఫర్నిచర్, తాగునీటి వసతి, బాలికలకు మరుగుదొడ్ల వసతి కల్పించారు. పాఠశాలలు ఆహ్లాదకరంగా మారాయి. ఆంగ్ల మీడియంతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆదరణ మరింత పెరిగింది. వీటికి తోడు ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఒడి, గోరుముద్ద, జగనన్న విద్యాకానుక కార్యక్రమాలు కూడా పాఠశాలలను మరింత బలోపేతం చేశాయని సామాజిక ఆర్థిక సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వ స్కూళ్లలో 2021–22లో చేరికలు 72.49 లక్షలు. వీరిలో ప్రైమరీలో 35.95 శాతం, అప్పర్‌ ప్రైమరీలో 13.75 శాతం, హైస్కూళ్లలో 50.30 శాతం మంది ఉన్నారు. 2019–20లో చేరికలు 83.23 లక్షలు, 2020–21లో చేరికలు 83.76 లక్షలుగా నమోదైంది. 2021–22లో చేరికలు 72.49 లక్షలుగా పేర్కొన్నా నివేదికలో ప్రైమరీ, 11, 12 తరగతుల చేరికల గణాంకాలు చేరలేవు. వాటినీ కలుపుకొంటే చేరికల సంఖ్య 10 లక్షల నుంచి 12 లక్షల వరకు అదనంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి పథకాలతో పాటు నాడు–నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతుండడంతో చేరికలు మరింత పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కరోనా సమయంలో ఈ పథకాలు పేద తల్లిదండ్రులు, విద్యార్థులను ఎంతో ఆదుకున్నాయి.

చదవండి: 

​​​​​​​Department of Education: ఇతర రాష్ట్రాలకు మన ‘పాఠాలు’

‘ఫీజు’పై దుష్ప్రచారం దారుణం: ఉన్నత విద్యా మండలి చైర్మన్

కరోనాతో స్కూళ్లకు దూరమైన విద్యార్థులు

కరోనా వల్ల స్కూళ్లు మూతపడడంతోపాటు ఉపాధి అవకాశాలు కోల్పోయిన అనేక కుటుంబాల ఆర్థికస్థితి ఛిన్నాభిన్నమైంది. ఈ తరుణంలో స్కూళ్లు తెరుచుకున్న అనంతరం విద్యార్థుల చదువులకు అనేక ఆటంకాలు తప్పలేదు. ఫలితంగా గతంలో కన్నా డ్రాపవుట్ల సంఖ్య కొంత పెరిగింది. జగనన్న అమ్మ ఒడితో పాటు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక కార్యక్రమాలు విద్యార్థులను తిరిగి స్కూళ్లబాట పట్టించేందుకు తోడ్పాటునందిస్తున్నాయని సామాజిక ఆర్థిక సర్వే తేల్చింది. 2020–21లో డ్రాపవుట్లు ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో పూర్తిగా తగ్గాయి. సెకండరీ స్థాయిలో మాత్రం 1.99 శాతంగా ఉంది. కరోనా సమయంలో పెద్ద పిల్లలు తల్లిదండ్రులకు సాయంగా ఆయా పనుల్లో భాగస్వాములవడమే దీనికి కారణం. హైస్కూళ్లలో డ్రాపవుట్ల రేట్‌ 2018–19లో 4.29 కాగా 2019–20లో 3.82కి తగ్గింది. 2020–21లో 4.38%గా నమోదైంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం డ్రాపవుట్ల సగటును పరిగణనలోకి తీసుకున్నట్లు సర్వే నివేదికలో పేర్కొన్నారు. 

Published date : 14 Mar 2022 12:39PM

Photo Stories