Governor: నూతన విద్యా విధానంతో నవశకానికి నాంది
మార్చి 10న అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్, మంత్రి ఆదిమూలపు సురేష్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి విద్యా సంస్థలతో పోటీ పడుతూ మన వర్సిటీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయని ప్రశంసించారు. కోవిడ్ సమయంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరముందన్నారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. పేదరికంతో ఏ ఒక్కరూ ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. నాడు–నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా అనేక కార్యక్రమాల ద్వారా విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఎందరో విద్యార్థులు సమాజాభివృది్ధకి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం యోగివేమన విశ్వవిద్యాలయం మాజీ వీసీ అర్జుల రామచంద్రారెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. రూరల్ డెవలప్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసిన ఎంపీ తలారి రంగయ్య, ఎంబీఏ విభాగంలో పీహెచ్‌డీ చేసిన ఏపీపీఎస్సీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి డాక్టరేట్లు అందుకున్నారు. 110 మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలు, 13,705 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్కేయూ వైస్ చాన్సలర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.