Skip to main content

Medical Education: జనరల్‌ మెడిసిన్‌కు డిమాండ్‌!

పీజీ వైద్య విద్యలో 2022 జనరల్‌ మెడిసిన్‌ సీట్లకు ఎక్కువ డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది.
Medical Education
జనరల్‌ మెడిసిన్‌కు డిమాండ్‌!

గత మూడు, నాలుగేళ్లుగా సీట్ల భర్తీ తీరును పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. జనరల్‌ మెడిసిన్‌ చేస్తే సూపర్‌ స్పెషాలిటీలో మంచి కోర్సులు చేసేందుకు అవకాశాలుంటాయి. General Medicine(MD) పూర్తయ్యాక గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, మెడికల్‌ అంకాలజీ, కార్డియాలజీ, వంటి Super Specialty(DM) కోర్సులు చేసేందుకు వీలుంటుంది. ఈ క్రమంలో తొలి కౌన్సెలింగ్‌లోనే జనరల్‌ మెడిసిన్‌ సీట్లు భర్తీ అవుతున్నాయి. వైద్య విద్యార్థుల రెండో ప్రాధాన్యంలో రేడియాలజీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి, గైనకాలజీ(ఓబీజీ), పీడియాట్రిక్స్, జనరల్‌ సర్జరీ కోర్సులుంటున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. నెలాఖరులోగా ప్రవేశ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇప్పటికే ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాష్ట్రం నుంచి నీట్‌ పీజీ–2022లో 8,636 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 13 ప్రైవేట్, ఒక మైనారిటీ వైద్య కళాశాలలున్నాయి. వీటిలో 2,207 పీజీ ఎండీ/ఎంఎస్‌ సీట్లున్నాయి. వీటిలో ఆలిండియా కోటా కింద 475 సీట్లు భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలో 1,138 సీట్లు కన్వీనర్‌ కోటాలో, 594 సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విశాఖలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, గుంటూరు వైద్య కళాశాల, కాకినాడలోని రంగరాయ వంటి కాలేజీల్లో పీజీ వైద్య సీటు కోసం అభ్యర్థులు తీవ్రంగా పోటీపడతారు. మరో వైపు రాష్ట్రం నుంచి నీట్‌ ఎండీఎస్‌–2022లో 896 మంది అర్హత సాధించారు. ప్రభుత్వ పరిధిలో విజయవాడ, కడపలలో రెండు డెంటల్‌ కళాశాలలున్నాయి. ఈ రెండు కళాశాలలు, ప్రైవేట్‌ డెంటల్‌ కళాశాలల్లో 400 వరకూ ఎండీఎస్‌ సీట్లున్నాయి.

చదవండి: సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాల‌నుకుంటున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

ఇన్‌ సర్వీస్‌ సీట్ల భర్తీ ఇలా..

రాష్ట్ర ప్రభుత్వ కోటాలోని 50 శాతం సీట్లలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్‌ క్లినికల్‌ సీట్లను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించిన ఇన్‌–సర్వీస్‌ అభ్యర్థులకు కేటాయించారు. మరో వైపు ఇన్‌–సర్వీస్‌ కోటా నిబంధనల్లో ప్రభుత్వం 2022లో మార్పులు చేసింది. గిరిజన ప్రాంతాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం గుర్తించిన సంస్థల్లో రెండేళ్లు పనిచేసిన వైద్యులకు ఇన్‌ సర్వీస్‌ కోటా కింద ప్రవేశాలకు అవకాశం కల్పించింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, ఏపీ వైద్య, ఆరోగ్య సేవలు, ఏపీవీవీపీ, ఏపీ ఇన్‌స్రూ?న్స్‌ మెడికల్‌ సర్వీసెస్, యూనివర్సిటీల్లో నిరంతరాయంగా ఆరేళ్లు సేవలందించిన వారికి ఇన్‌ సర్వీస్‌ కోటాలో ప్రవేశాలు కల్పించనున్నారు. స్పెషలైజేషన్‌ పూర్తయ్యాక ఇన్‌సర్వీస్‌ కోటా కోసం పని చేసినట్టు చూపిన ప్రాంతంలోనే ఆరేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది.

చదవండి: ఏపీలో ప్రైవేట్‌ ఆస్పత్రులూ ప్రభుత్వ పరిధిలోకి

పీజీ ఎండీ/ఎంస్‌ సీట్ల వివరాలిలా.. 

(నోట్: 2022–23 సీట్ మ్యాట్రిక్స్ ఇంకా ప్రకటించలేదు. గడిచిన ఏడాది మ్యాట్రిక్స్ ప్రకారం ఈ వివరాలు)

ప్రభుత్వ పరిధిలో
కన్వీనర్‌ కోటా–509
ఆలిండియా కోటా–475

ప్రైవేట్‌లో..
కన్వీనర్‌ కోటా–618
మేనేజ్‌మెంట్‌ కోటా–580

ఎఫ్‌ఐఎంఎస్‌ కడప
కన్వీనర్‌ కోటా–11
మేనేజ్‌మెంట్‌ కోటా–14 

చదవండి: అమ్మానాన్నను చూసే...డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నా

Published date : 22 Aug 2022 01:16PM

Photo Stories