NIRF 2023: జాతీయ ర్యాంకుల్లో మెరిసిన ఏపీ వర్సిటీలు
ఎన్‌ఐఆర్‌ఎఫ్–2023 ర్యాంకుల్లో 25 రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థలు సత్తాచాటాయి. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలు, పరిశోధనా సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మేనేజ్‌మెంటు, ఫార్మసీ, మెడికల్, దంత వైద్యం, న్యాయ విద్యాసంస్థలు, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఇన్నోవేషన్, వ్యవసాయ తదితర 13 విభాగాల్లో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఈ ర్యాంకులను ప్రకటించింది. 2022 వరకు 12 విభాగాల్లోనే ర్యాంకులను ప్రకటిస్తూ రాగా ఈసారి కొత్తగా ఇన్నోవేషన్ కార్యక్రమాలకూ ర్యాంకులను ఇచ్చారు. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో కేఎల్ యూనివర్సిటీ 50వ ర్యాంకులో, ఆంధ్రా యూనివర్సిటీ–విశాఖ 76వ ర్యాంకులో నిలిచాయి. యూనివర్సిటీల కేటగిరీలో ఎస్వీ యూనివర్సిటీ 60వ ర్యాంకు దక్కించుకుంది. ఇంజనీరింగ్ కాలేజీల కేటగిరీలో ఐఐటీ తిరుపతి 59వ ర్యాంకులో, విజ్ఞాన్ యూనివర్సిటీ 85వ ర్యాంకు, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 94వ ర్యాంకులో ఉన్నాయి. ఇక మేనేజ్‌మెంట్ కేటగిరీలో ఐఐఎం విశాఖ పట్నం 29వ ర్యాంకు, క్రియా యూనివర్సిటీ – శ్రీ సిటీ 74వ ర్యాంకు దక్కించుకున్నాయి.
చదవండి: NIRF: దేశంలో నంబర్ 1 ఐఐటీ ఇదే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్–2023 ర్యాంకింగ్ నివేదిక విడుదల..
మెరుగుపడ్డ వెటర్నరీ వర్సిటీ ర్యాంక్
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ గత ర్యాంకును మెరుగుపర్చుకుంది. వ్యవసాయ అనుబంధ విభాగంలో గతేడాది 57వ స్థానంలో ఉన్న వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ ఈ ఏడాది ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో 31వ స్థానానికి ఎగబాకింది. అలాగే ఇక వెటర్నరీ యూనివర్సిటీల్లో చూస్తే 7వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుంది. పరిశోధన, విస్తరణ కార్యకలాపాల్లో వర్సిటీ గత మూడేళ్లుగా అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తోందని వీసీ వీ.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.
చదవండి: NIRF Top 10 Rankings 2023 : దేశంలో టాప్-10 విద్యాసంస్థలు ఇవే.. ఈ సారి కూడా..
ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో రెండు సంస్థలు
ఓవరాల్ విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) చోటు సంపాదించాయి. యూనివర్సిటీల విభాగంలో 4 సంస్థలకు ర్యాంకులు వచ్చాయి. డిగ్రీ కాలేజీల విభాగంలో రాష్ట్రంలోని సంస్థలకు ర్యాంకులు దక్కలేదు. ఇక ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో 4 విద్యాసంస్థలు ర్యాంకులను దక్కించుకున్నాయి.
మేనేజ్‌మెంటు విభాగంలో మూడు సంస్థలు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. 2022 ర్యాంకింగ్స్‌లో 33వ స్థానంలో ఉన్న ఐఐఎం విశాఖపట్నం నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని ఈ ఏడాది 29వ ర్యాంకుకు ఎగబాకింది. న్యూజెనరేషన్ ఐఐఎంలలో మాత్రం విశాఖపట్నం టాప్‌లో నిలిచిందని డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలో టాప్–20లో చోటు సాధించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఫార్మసీ విభాగంలో గత ఏడాదిలో మాదిరిగానే ఈసారి కూడా 9 విద్యా సంస్థలకు జాతీయర్యాంకులు దక్కాయి. డెంటల్‌కాలేజీల విభాగంలో విష్ణు డెంటల్ కాలేజ్– భీమవరం కాలేజీ ర్యాంకును సాధించింది. ఆర్కిటెక్చర్ ప్లానింగ్ విభాగంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా)– విజయవాడ ర్యాంకును కైవసం చేసుకుంది. అగ్రికల్చర్ విభాగంలో ఎన్జీ రంగా వర్సిటీ 20వ ర్యాంకులో నిలిచింది.