Skip to main content

NIRF: దేశంలో నంబర్‌ 1 ఐఐటీ ఇదే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌–2023 ర్యాంకింగ్‌ నివేదిక విడుదల..

సాక్షి, న్యూఢిల్లీ/రాయదుర్గం: దేశంలోని విద్యాసంస్థల్లో అన్ని విభాగాల్లో కలిపి ఐఐటీ–మద్రాస్‌ అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది.
IITM
దేశంలో నంబర్‌ 1 ఐఐటీ ఇదే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌–2023 ర్యాంకింగ్‌ నివేదిక విడుదల..

మొత్తం విభాగాల్లో ఐఐటీ–మద్రాస్‌కు మొదటిస్థానం దక్కడం ఇది ఐదోసారి కాగా, ఇంజనీరింగ్‌ విభాగంలోనూ వరుసగా ఎనిమిదోసారి నంబర్‌వన్‌ స్థానాన్ని నిలుపుకోవడం విశేషం. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌–2023) నివేదికను విద్య, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ జూన్‌ 5న విడుదల చేశారు. బోధనా అభ్యాసం, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్‌ ఫలితం, విద్యార్థులు పొందే ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, లా, మెడికల్‌ కాలేజీలకు ర్యాంకులను ప్రకటించారు.

చదవండి: IIT Recruitment: ఐఐటీ, మద్రాస్‌లో టీచింగ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

వీటిలో అన్ని కేటగిరీల్లో ఐఐటీ–మద్రాస్‌ తొలిస్థానంలో ఉండగా, ఐఐఎస్సీ–బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ–ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐఐటీ–హైదరాబాద్‌ 14వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ) 20వ స్థానం, నిట్‌–వరంగల్‌ 53, ఉస్మానియా యూనివర్సిటీ 64, వడ్డేశ్వరంలోని కేఎల్‌ కాలేజ్‌ ఎడ్యుకేషనల్‌ యూనివర్సిటీ 50, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ 76వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్స్‌ కోసం 200కు పైగా యూనివర్సిటీలను సర్వేచేశారు. దరఖాస్తు చేసిన దాదాపు 8వేల సంస్థల నుంచి 2023 ర్యాంకులను ప్రకటించారు.  

చదవండి: IITH: ఐఐటీహెచ్‌లో నేవీ ఇన్నోవేషన్‌ సెంటర్‌

అత్యుత్తమ వర్సిటీల విభాగంలో... 

ఇక అత్యుత్తమ వర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ–బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 10వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 36, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 84వ స్థానంలో నిలిచింది. ఏపీలోని ఆంధ్రా‡ యూనివర్సిటీ 43, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ 60వ స్థానం దక్కించుకున్నాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్‌ 8వ, నిట్‌–వరంగల్‌ 21వ స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్‌ 14వ స్థానంలో, హెచ్‌సీయూ 25వ స్థానంలో నిలిచాయి. మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎం–వైజాగ్‌ 29వ, ఐసీఎఫ్‌ఏఐ–హైదరాబాద్‌ 40వ స్థానంలో ఉన్నాయి. ఫార్మసీలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌–హైదరాబాద్‌ తొలి స్థానంలో ఉండగా, న్యాయ విభాగంలో నల్సార్‌ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉంది. ఇన్నోవేషన్‌ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్‌ 3వ స్థానంలో నిలిచింది.  

చదవండి: ‘World Quantum Day’కు ట్రిపుల్‌ ఐటీ శాస్త్రవేత్తలు

వ్యవసాయ విభాగంలో.. 

ఇక వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల్లో గుంటూరులోని ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 20వ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 31వ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌–హైదరాబాద్‌ 32వ స్థానంలో ఉన్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌ కోసం   https://www.nirfindia.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

సమష్టి కృషితోనే సాధ్యం
జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపే లక్ష్యం. సమష్టి కృషితోనే సాధ్యం. దేశంలో టాప్‌– 10 విశ్వవిద్యాలయాల్లో హెచ్‌సీయూకు మళ్లీ ర్యాంక్‌ను పొందడం ఆనందంగా ఉంది. ఉత్తమ పద్ధతులు, నాణ్యతతో కూడిన బోధన, పరిశోధనల కారణంగా ఈ ర్యాంకు సాధ్యమైంది. భవి ష్యత్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం.   

 – ప్రొ. బీజే రావు, వైస్‌చాన్స్‌లర్‌ హెచ్‌సీయూ  

మానవాళి కోసం టెక్నాలజీ
ఈ విజయంలో విద్యార్థులు, అధ్యాపకులతోపాటు, పూర్వ విద్యార్థుల కృషి కూడా ఉంది. మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానం అనే నినాదంతో ఐఐటీహెచ్‌ ముందుకెళ్తోంది.      

– ప్రొ. బీఎస్‌ మూర్తి, ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌  

Published date : 06 Jun 2023 02:34PM

Photo Stories