Education Schemes in Andhra Pradesh: అమ్మఒడి, విద్యాకానుక, నాడు–నేడు కార్యక్రమాలతో పేదల చదువుకు భరోసా
పుట్టపర్తి అర్బన్: చదువుతోనే పేదల తలరాతలు మారతాయని గట్టిగా నమ్మారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అందుకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడగానే విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అమ్మఒడి, విద్యాకానుక, నాడు–నేడు కార్యక్రమాలతో పేదల చదువుకు భరోసా కల్పించారు. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకంతో పేద విద్యార్థులు విదేశాల్లోనూ చదువుకునే అవకాశం కల్పిస్తుండటంపై అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌నొక్కి విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి ఎంపికై న నలుగురు విద్యార్థులకు మెగా చెక్కు అందజేశారు.
విదేశాల్లోనూ సత్తా చాటాలి
విదేశాల్లోనూ మన విద్యార్థులు సత్తా చాటాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేద విద్యార్థుల విదేశీ విద్యకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కలెక్టర్ అరుణ్‌బాబు పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ప్రపంచంలో టాప్ 200 ర్యాంకులు ఉన్న విదేశీ విద్యాలయాల్లో ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. ర్యాంకును బట్టి యూనివర్సిటీల్లో రూ.50 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకూ విదేశీ విద్యాదీవెన పథకం వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ ఫీజు, ట్యూషన్ ఫీజు, విమాన చార్జీలు, వీసా ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఫీజును నాలుగు విడతలుగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగు వారు సత్తాను చాటాలన్నారు.
పారదర్శకంగా ‘విదేశీ విద్య’
అగ్రి అడ్వయిజరీ బోర్డు చైర్మన్ అవుటాల రమణారెడ్డి, పుడా చైర్ పర్సన్ లక్ష్మీనరసమ్మ, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగనన్న ప్రభుత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. విదేశీ విద్య అభ్యసించాలంటే గతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ.15 లక్షలు, బీసీ, మైనార్టీలకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో మధ్యలోనే విద్యాభ్యాసాన్ని ఆపేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. అనర్హులకు సైతం బిల్లులు పెట్టిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతం అర్హత ఉంటే చాలు పారదర్శకంగా విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తూ ఉన్నత విద్యకు భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి శివరంగప్రసాద్, డీటీడబ్ల్యూఓ మోహన్‌రాం, బీసీ వెల్ఫేర్ అధికారిణి నిర్మలాజ్యోతి, ఏఎస్‌డబ్ల్యూ శ్రీరాములు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎంపికై న విద్యార్థుల వివరాలు
జిల్లాలోని ఓడీ చెరువు మండలం పగడాలవారిపల్లికి చెందిన గంగులప్ప కుమార్తె డి.అనితకు రూ.82,214 మంజూరైంది. అలాగే హిందూపురం పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు విష్ణుసాయి రాయల్‌కు రూ.17,59,109, కొత్తచెరువు పట్టణంలోని బసవన్నకట్ట వీధిలో ఉండే కే.శివారెడ్డి కుమారుడు రాజశేఖరరెడ్డికి రూ.12,10,883 విడుదల చేశారు. పెనుకొండ మండలం కొండంపల్లికి చెందిన జి.శ్రీహరి కుమారుడు భార్గవసాయికి రూ.13,84,421 కలిపి మొత్తం రూ.44,36,627 మొత్తానికి మెగా చెక్కు అందజేశారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల తెలుగు వారి కీర్తిని అన్ని దేశాల్లో చాటాలన్న వక్తలు జిల్లాలోని లబ్ధిదారులకు రూ.44.36 లక్షల చెక్కు అందజేత