Subashini Sankaran, IPS : ఇక్కడ ఐపీఎస్ అంటే...నల్లేరు నడక కాదు...కానీ ఆమె
మధ్యతరగతి కుటంబం నుంచి వచ్చి...
సుభాషిణీ శంకరన్ తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పుట్టారు. మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. తల్లి గృహిణి. సుభాషిణికి ఓ సోదరి. అమెరికాలో ఔత్సాహిక వ్యాపారవేత్త. 1980ల్లో సుభాషిణి వాళ్ల కుటుంబం తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చింది. సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. ‘మహిళలు- ఉగ్రవాదం’ అనే విషయాన్ని రీసెర్చ్ అంశంగా తీసుకొని వ్యాసాలు రాశారు. దీనివల్ల ఆమెకు దేశ సరిహద్దు రాజకీయాలు, సామాజిక స్థితిగతుల మీద, లా అండ్ ఆర్డర్ సమస్యల పట్ల చక్కటి అవగాహన కలిగింది.ఓై వెపు ఎంఫిల్ చేస్తూనే ఇంకో వైపు సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. అస్సాంలో పోస్టింగ్ వచ్చింది.
ఇక్కడ ఐపీఎస్ అంటే...నల్లేరు నడక కాదు...
అసలు పోలీస్ ఉద్యోగమంటేనే 24 గంటలూ ఒత్తిడి! పైగా అస్సాం లాంటి కల్లోలిత ప్రాంతంలో ఐపీఎస్ అంటే నల్లేరు మీద నడక కాదు. యుద్ధ రంగంలో ఉన్నట్టే. ఓవైపు ఉగ్రవాదం, ఇంకోవైపు మతకలహాలు, మూడోవైపు స్మగ్లింగ్.. నాలుగో వైపు అడవి జంతువుల వేటగాళ్లను ఎదుర్కొవడం! రెండు కళ్లను నాలుగుదిక్కుల సారిస్తేనే సమర్థులైన ఆఫీసర్‌గా లెక్క. లేదంటే పై కేడర్ డిసిప్లినరీ యాక్షన్స్‌కు బలవ్వడమే. అయితే సుభాషిణిది సవాళ్ళను ఎదుర్కొనే నైజమే. అందుకే క్రమశిక్షణ చర్యలకు భయపడి కాకుండా చాలా ఇష్టంగా విధులు నిర్వహించారు. తక్కువ సమయంలోనే సాహసోపేతమైన ఐపీఎస్‌గా పేరు తెచ్చుకున్నారు.
నాలుగేళ్లలో ఎన్నో..
నాలుగేళ్లలో ఎన్నో చూశారు.. స్మగ్లర్స్‌కి సివంగిలా కనిపించారు. సున్నితమైన సమస్యలను సహనంతో పరిష్కరించారు. ఇవన్నీ కూడా ఆమెకు ప్రాక్టికల్ లెసన్స్. వాటిల్లో ఆమె చూపించిన తెగువే సీఎం సెక్యురిటీని పర్యవేక్షించే పదవిని కట్టబెట్టింది. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాల్సిన ఉద్యోగం ఇది. ‘సీఎం సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా ఒక మహిళా ఐపీఎస్ ఉండడం జనాలకు కొత్తే. ఒక్కసారిగా జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళలు ఏ రంగంలో ఉన్నా ఇలాంటి రియాక్షన్స్ సర్వసాధారణం. కాబట్టి తోటి అధికారుల, ప్రజల స్పందన నాకేం కొత్తగా అనిపించట్లేదు. నెమ్మదిగా అలవాటు పడతారు. నేను నేర్చుకున్నది ఒకటే... తక్కువ మాట్లాడాలి.. ఎక్కువ పనిచేయాలి. అంతే!’ అంటారు సుభాషిణీ శంకరన్.