ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్ ప్రయారిటీ వీళ్లకే..ఒక్క మాటలో చెప్పాలంటే..?
ఒక వైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు విధి నిర్వహణలోనూ తమదైన విభిన్నత చాటుతున్నారు. అలాగే వివిధ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈయన సతీమణి సైతం వేనోళ్ల కొనియాడుతున్నారు. వీరి పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలకు, కుటుంబానికి సమయం కేటాయించడంలేదనే భావన ఉన్నా.. ప్రజల కోసం పని చేస్తుండడం గర్వంగా ఉందని చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ సతీమణి అనూప తమ మనోగతాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.
మా డాడీ గ్రేట్ అంటున్నారు..
కరోనా వైరస్ నియంత్రణలో పోలీసు సిబ్బంది సేవలకు సలామ్ చేస్తున్నాం. సిబ్బందికి మావారు నాయకత్వం వహించడం చాలా గర్వంగా ఉంది. ఐపీఎస్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి ఎక్కడ ఉన్నా విధులను అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఇప్పుడూ కరోనా నియంత్రణలోనూ కష్టపడుతున్నారు. మిగతా పోలీసు సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. బయట తిరగవద్దు. అప్పుడూ వీళ్లకు కూడా బాగుంటుంది. కుటుంబపరంగా చూసుకుంటే మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త సమయం తక్కువగానే ఉంటారు. ముఖ్యంగా మా అమ్మాయిలు అదితి, నియతి.. డాడీ.. డాడీ అంటూ కలవరించేవారు. అయితే డాడీ విధులు తెలిశాక గ్రేట్ అంటున్నారు.
ఆయన ఫస్ట్ ప్రయారిటీ వీళ్లకే..
వర్క్‌హాలిక్ మైండ్ సెట్ ఉన్న మావారు.. ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎప్పుడూ విధులతో బిజీగా ఉండే మావారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువగా ఉడికించిన కోడిగుడ్లు, కూరగాయలు ఇష్టంగా తింటారు. ఉదయం వ్యాయామంతో పాటు యోగా కూడా చేస్తుంటారు. ఆమ్లా జ్యూస్, ఇమ్యూనిట్ బూస్ట్ తీసుకుంటారు. సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. వీలైతే వార్తలు చూస్తుంటారు. విధులకు వెళ్లి లేట్‌గా వచ్చినా పిల్లలతో కొంతసేపు క్యారమ్ ఆడాక నిద్రకు ఉపక్రమిస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే..
లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి తెల్లవారుజామున మానిటరింగ్ మొదలై అర్ధరాత్రి వరకు టెలీ కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉంటున్నారు. అందుకే మా అమ్మాయిలు డాడీతో కొంతసేపైనా ఉండాలన్న ఉద్దేశంతో ఉదయం లేవగానే డాడీ వాహనంలో ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వచ్చేస్తారు. బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా కచ్చితంగా హ్యాండ్ శానిటైజింగ్ చేయాల్సిందే. కాళ్లు, చేతులు కడుక్కొవాల్సిందే. ఇక మావారు బయటి నుంచి ఇంటికి రాగానే యూనిఫాం శానిటైజ్ చేసి సపరేట్‌గా పెట్టేస్తారు. స్నానం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్వారంటైన్ అవుతారు. చివరగా ఒక మాట ఇంట్లోనే ప్రజలు ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. కరోనాను జయించాలి.
ఏ సమయంలోనైనా...
ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. గతంలో కుటుంబ సభ్యులతో గడిపిన విధంగా పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏ సమయంలోనైనా విధి నిర్వహణకు వెళ్లాల్సిందే. గతంలో ప్రతిరోజూ అరగంట పాటు ఆడుకోనేదే ఊరుకునేవారు కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కాస్త దూరంగా ఉండాల్సి వస్తోంది. సమయంతో సంబంధం లేకుండా సిబ్బందికి మార్గదర్శకాలిస్తున్నాం.
– వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ