బాలిక లేఖతో స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సజ్జనార్‌కు లేఖ
తాను, సోదరుడు, సోదరి సహా అనేక మంది విద్యార్థులు గ్రామం నుంచి సూదూర ప్రాంతాల్లోని పాఠశాలలు, కాలేజీలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడుకు చెందిన పి.వైష్ణవి సెప్టెంబర్ 19, 2021న లేఖ రాసింది. ఆటో ఖర్చులు ఆర్థికభారం అవుతున్నాయని లేఖలో పేర్కొంది. దీనిపై స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సీజేఐకు కృతజ్ఞతలు తెలిపిన సజ్జనార్.. ఆ దారిలో బస్సు సౌకర్యం పునరుద్ధరిస్తామని నవంబర్ 3న ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘గౌరవనీయులైన జస్టిస్ ఎన్వీ రమణకు నమస్కరించి రాయునది ఏమనగా.. నాపేరు పి.వైష్ణవి (13) ఎనిమిదో తరగతి చదువుతున్నా. నా సోదరుడు పి.ప్రణీత్ (14) 9వ తరగతి. మేము 6 కి.మీ. దూరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాం. నా సోదరి పి.ప్రీతి (15) 18 కి.మీ. దూరంలోని కాలేజీలో ఇంటర్ చదువుతోంది. కరోనా మొదటి నుంచి మా గ్రామానికి బస్సు రావడం లేదు. దీని వల్ల మాతోపాటు స్నేహితులూ చాలా ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల, కాలేజీలకు వెళ్లడానికి ఆటో చార్జీలు రూ.150 అవుతున్నాయి. మా నాన్న కరోనా మొదటి దశలో గుండెనొప్పితో మృతి చెందారు. అమ్మ చిన్న ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తోంది. ప్రభుత్వ బస్సులు తిరిగి ప్రారంభం చేయడానికి సహాయం చేయగలరని మనవి’అని వైష్ణవి లేఖలో పేర్కొంది. జస్టిస్ ఎన్వీ రమణ సూచన మేరకు వైష్ణవి లేఖపై తగిన చర్యలు తీసుకోవాలని సీజేఐ ప్రైవేటు కార్యదర్శి ఎస్‌కే రఖేజా.. సజ్జనార్‌కు నవంబర్ 2న లేఖ రాశారు. విద్యాహక్కు చట్టాన్ని గౌరవిస్తూ పాఠశాలల సమయానికి బస్సులు నడుపుతామని సజ్జనార్ హామీఇచ్చారు.
#TSRTC Management sincerely Thank the Hon'ble apex court Chief Justice of India #CJIRamana Sir for alerting us to restore buses to send students on school timings in token of honoring #RTE @rashtrapatibhvn @PMOIndia @DrTamilisaiGuv @TelanganaCMO @barandbench @LiveLawIndia pic.twitter.com/eCkIopxZfH
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 3, 2021