Skip to main content

TSRTC: వైద్య కళాశాలకు కసరత్తు.. వీరికి 20 శాతం కోటా..

సాక్షి ఎడ్యుకేషన్: ఆర్టీసీ మెడికల్ కాలేజీ.. 20 శాతం సీట్లు ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబసభ్యులకు. మిగతావి జనరల్.... ఇది దాదాపు 15 ఏళ్ల క్రితం తెలంగాణ ఆర్టీసీ మదిలో మెదిలిన ఆలోచన.
TSRTC,
తార్నాకలో ఆర్టీసీ ఆసుపత్రి

కానీ అప్పట్లో అది సాకారం కాలేదు. ఇప్పుడు మరోసారి ఈ తరహా ప్రతిపాదనను ఆర్టీసీ తెరపైకి తెస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి ఆర్థిక సహకారాన్ని తీసుకోవాలని భావిస్తోంది. ఈమేరకు అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. నెల రోజుల క్రితం దీనికి సంబంధించి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించారు. ఇంతలో మేడారం జాతర హడావుడి రావటంతో దాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టారు. జాతర ముగిసి అధికారులంతా నగరానికి చేరుకోవడంతో, మళ్లీ దీనిపై దృష్టి పెట్టనున్నారు.

ఇదీ ఆలోచన..

ఆర్టీసీకి సొంతంగా తార్నాకలో ఆసుపత్రి ఉంది. గతంలో దీని సామర్థ్యం వంద పడకలు. ఇటీవలే దాన్ని 200 పడకలకు విస్తరించారు. దీన్ని కార్పొరేట్ ఆసుపత్రిస్థాయికి తీసుకెళ్లాలన్నది ఎండీ సజ్జనార్ ఆలోచన. ఈమేరకు మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సహకారం తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓ విశ్రాంత సీనియర్ ప్రభుత్వ వైద్యాధికారిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఆసుపత్రి స్థాయి పెంపు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే చికిత్సలు అందుతున్నాయి. కొన్ని విభాగాల్లో వైద్యులు, సిబ్బంది, పరికరాల కొరత ఉండటంతో వాటి చికిత్సలను ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇలా ప్రైవేటు ఆస్పత్రులకు పంపకుండా ఇక్కడే పరికరాలు సమకూర్చి, వైద్యులను నియమిస్తున్నారు. ల్యాబ్, ఫార్మసీని 24 గంటలూ కొనసాగేలా చేస్తున్నారు. తొలుత వీటిని బయటి వ్యక్తులకు కూడా అందుబాటులోకి తెచ్చి ఆ తర్వాత చికిత్సలకు కూడా బయటి వారిని అనుమతించనున్నారు. ఇలా ఆసుపత్రి స్థాయిని పెంచి దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనేది ఆలోచన.

ఏడెకరాలు సరిపోకుంటే..

తార్నాక ఆసుపత్రి ప్రాంగణంలో ఏడెకరాల స్థలం అందుబాటులో ఉంది. అది సరిపోకుంటే, పక్కనే ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ అ«దీనంలోని కొంత స్థలాన్ని తీసుకోవాలని, లేనిపక్షంలో ఉప్పల్లో ఉన్న ఆర్టీసీ వర్క్షాపు ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. వైద్య కళాశాల ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి వచ్చే సూచన ఆధారంగా ముందడుగు వేయాలని భావిస్తున్నారు.

చదవండి: 

Inspiration Story: నా ఫస్ట్‌ ప్రయారిటీ వీళ్ల‌కే.. ఒక్క మాటలో చెప్పాలంటే..

ఇంధన పొదుపులో టీఎస్‌ఆర్టీసీ దేశంలో ఎన్నో స్థానాన్ని కైవసం చేసుకుంది?

టీఎస్‌ఆర్టీసీకి క్యూసీఎఫ్‌ఐ పురస్కారం

టీఎస్‌ ఆర్టీసీలో కొత్తగా మరో 2 ఈడీ పోస్టులు

Published date : 22 Feb 2022 12:06PM

Photo Stories