Skip to main content

Ira Singhal, IAS : నా పరిస్థితులే..న‌న్ను 'ఐఏఎస్' చేసాయ్‌..

వైకల్యం శరీరానికేగానీ, ప్రతిభకు, ఉన్నత లక్ష్యానికి కాదని రుజువు చేయాలనే సంకల్పం... ప్రజలకు సేవ చేసేందుకు వైకల్యం అడ్డుకాదని నిరూపించాలనే తపన.. రోజూ క్రమం తప్ప కుండా పటిష్ట ప్రణాళికతో సుదీర్ఘ ప్రిపరేషన్ ఫలితం.. సివిల్ సర్వీసెస్- 2014లో ఆలిండియా టాపర్...!
Ira Singhal, IAS
Ira Singhal, IAS

ఇదీ ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్ సక్సెస్ స్టోరీ! ఇరా విజయగాథ ఆమె మాటల్లోనే...

కుటుంబ నేప‌థ్యం:
మా స్వస్థలం మీరట్. అమ్మానాన్న రాజేంద్ర సింఘాల్, అనితా సింఘాల్ ఢిల్లీలో స్థిరపడ్డారు. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగులే. దాంతో నా విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే కొనసాగింది. 

నా ఎడ్యుకేష‌న్ : 
పదో తరగతి వరకు లొరెంటో కాన్వెంట్‌లో, 12వ తరగతి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ (సీఎస్‌ఈ), ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) పూర్తి చేశాను. అఖిల భారత సర్వీసుల్లో కొలువు సంపాదించడం అనేది చిన్ననాటి కల. నేను పెరిగిన వాతావరణం, పరిసర పరిస్థితులే ఇందుకు కారణం. దీనికితోడు అకడమిక్‌గా మంచి ప్రతిభ చూపడంతో అందరూ ప్రోత్సహించారు.

కార్పొరేట్ కొలువు నుంచి..
అకడమిక్ అర్హతల ఆధారంగా 2008లో క్యాడ్‌బరీ ఇండియాలో మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. అంతకుముందు కోకాకోలా ఇండియాలో మార్కెటింగ్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేశాను. 2010 జనవరిలో క్యాడ్‌బరీ ఇండియాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, సివిల్స్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నం (2010)లోనే 813వ ర్యాంకుతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను. కానీ, అంగవైకల్యం(వెన్నెముక లోపం) పరిమిత స్థాయికంటే ఎక్కువ ఉందని విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించారు.

నా వైకల్యం కార‌ణంతోనే..
అంగవైకల్యం కారణంతో ఐఆర్‌ఎస్ నియామకం అందకపోవడంతో తొలుత కొంత నిరుత్సాహానికి గురయ్యాను. కానీ, వెంటనే తేరుకుని వైకల్యం శరీరానికేగానీ, ప్రతిభకు, సంకల్పానికీ కాదని రుజువు చేయాలనుకున్నా. ఐఆర్‌ఎస్‌లో పోస్టింగ్ కోసం క్యాట్‌ను ఆశ్రయించి ఒకవైపు పోరాడుతూనే మరోవైపు సివిల్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించా. ఐఆర్‌ఎస్ కంటే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశమున్న ఐఏఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ క్రమంలో 2011లో 888వ ర్యాంకు, 2013లో 839వ ర్యాంకు వచ్చాయి. మరోవైపు కార్పొరేట్ కంపెనీల్లో విధులు నిర్వర్తించిన తీరు, అక్కడ నేను చూపిన ఫలితాలు నిదర్శనాలుగా క్యాట్‌లో పోరాడాను. ఎట్టకేలకు విజయం సాధించి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో పోస్టింగ్ సాధించా. సివిల్స్ 2014 పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సొంతమైంది. ఈ ర్యాంకు ఊహించనిది. ఈ విషయం తొలుత మా పైఅధికారి ఒకరు ఫోన్ చేసి చెప్పినప్పుడు నమ్మలేదు. తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు చెప్పడంతో నా ఆనందానికి అవధుల్లేవు.

నా ప్రిపరేషన్ ఇలా..
సివిల్స్ కోసం క్రమబద్ధమైన ప్రిపరేషన్ సాగించాను. సిలబస్ ప్రకారం ప్రతి అంశానికి సంబంధించి అన్ని రకాల సమాచార మార్గాలను వినియోగించుకున్నాను. ప్రామాణిక పుస్తకాలు మొదలు.. ఇంటర్నెట్ ఆధారంగా తాజా పరిణామాలపై విశ్లేషణాత్మకంగా పట్టు సాధించాను. తొలి ప్రయత్నం నుంచి ఇదే విధంగా వ్యవహరించాను. ప్రతి అంశానికి సంబంధించి సొంతగా నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకున్నాను. అంతేకాకుండా రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాను. ఇది పరీక్షలో ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నిర్దిష్ట సమయంలో సమాధానాలు ఇచ్చే నైపుణ్యం లభించింది. ఈ విధంగా రోజూ క్రమం తప్పకుండా పది గంటలపాటు ప్రిపరేషన్ సాగించాను.

నా ఇంటర్వ్యూ ఇలా..
సివిల్స్-2014 ఇంటర్వ్యూ ఛత్తర్‌సింగ్ బోర్డ్ నేతృత్వంలో 25 నిమిషాలపాటు సాగింది. చైర్మన్ సహా మొత్తం అయిదుగురు సభ్యుల బోర్డ్‌లో ఇంటర్వ్యూ ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. మహిళల సాధికారత, వికలాంగుల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, వారి అభివృద్ధికి మీరేం చేస్తారు? వంటి ప్రశ్నలతోపాటు అకడమిక్ నేపథ్యం, పని అనుభవానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూ... ప్రశ్న, సమాధానం తరహాలో కాకుండా చర్చ తీరులో సాగడం అనుకూలించింది. ఇంటర్వ్యూలో నేను చెప్పిన సమాధానాలు, బోర్డ్ సభ్యుల స్పందన బట్టి ర్యాంకు వస్తుందని భావించాను. కానీ ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందనుకోలేదు. అందులోనూ ఓపెన్ కేటగిరీలో ఈ ర్యాంకు రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.

నిరుత్సాహం వద్దు
ప్రస్తుతం దేశంలో ఎందరో వికలాంగులున్నారు. వారిలో ప్రతిభావంతులు మరెందరో! కానీ తమ శారీరక వైకల్యంతో మానసికంగా కుంగిపోయి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. వైకల్యం వేదనను పారదోలి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి.

కనీసం ఏడాది ముందు నుంచి..
సివిల్స్ ఔత్సాహికులు కనీసం ఏడాది ముందు నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఆప్షనల్ సబ్జెక్ట్ మినహా దాదాపు అన్ని పేపర్లకు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకునే విధంగా పరీక్ష స్వరూపం ఉండటం కలిసొచ్చే అంశం. చాలా మంది అభ్యర్థులు సివిల్స్ అంటే లైఫ్ అండ్ డెత్ పరీక్షగా భావిస్తారు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం తప్ప ఫలితం ఉండదు. కాబట్టి విజయావకాశాల గురించి ఆలోచించకుండా.. పరీక్షలో మంచి పనితీరు కనబర్చాలనే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే విజయం దానంతటదే వరిస్తుంది.

ప్రోఫైల్ : 

IAS


➤ సివిల్స్-2014లో 1082 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు.
➤ 2011 నవంబర్ నుంచి 2012 డిసెంబర్ వరకు స్పానిష్ లెక్చరర్‌గా విధులు.
➤ 2008 జూన్ నుంచి 2010 జనవరి వరకు క్యాడ్‌బరీ ఇండియాలో మేనేజర్.
➤ ఎంబీఏ (2008)- ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ 2007లో కోకోకోలా ఇండియాలో ఇంటర్న్.
➤ బీఈ (సీఎస్‌ఈ) (2006)- నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
➤12వ తరగతి (2001)-ఆర్మీ పబ్లిక్ స్కూల్(జీపీఏ 9.3)
➤ పదో తరగతి (1999)- లొరెటో కాన్వెంట్ స్కూల్ (జీపీఏ 9.1)

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Published date : 10 Dec 2021 06:39PM

Photo Stories