Google: గూగుల్‌లో మంచి జీతం..కానీ ఉద్యోగానికి రాజీనామ చేసి...
తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలే.. పైసా పైసా కూడబెట్టి..
రెండుసార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్‌లో పోయాయి. అయినా శ్రావ్య నిరాశ పడలేదు. అంతే ఉత్సాహంగా మూడో ఎటెంప్ట్‌కి రెడీ అయింది. ప్రిపరేషన్ మొదలుపెడుతున్న సమయంలో తెలిసింది అంతకుముందు జరిగిన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదని ఒక అమ్మాయి, అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నట్టు! అబ్బాయి తెలుగువాడే. శ్రావ్యకు తెలిసిన వ్యక్తే. అతనిది చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలే. పైసా పైసా కూడబెట్టి కొడుకును చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆ అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం రెండుసార్లు ఐఏఎస్ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయానే అని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రావ్య వాళ్ల ఫ్రెండ్స్ అంతా కండోలెన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. శ్రావ్య వెళ్లలేదు. ఫ్రెండ్స్ నిష్టూరమాడారు.
ఎందుకు ఆలోచించరు..?
‘‘ఎందుకు రావాలి? ఆ అబ్బాయిది ఎంత పిరికితనం? ఐఏఎస్ రాకపోతే లైఫ్ లేదా? ఇంజనీరింగ్ చదివినవాడు ఐఏఎస్ రాకపోతే ఇంకేదీ చేయలేడా? అతని తల్లిదండ్రులు కొడుకు ఐఏఎస్సే కావాలనే ఆశతో ఉన్నా...ఆ ప్రయత్నం ఫెయిల్ అయితే ఇంకోటి సాధించి తన తల్లిదండ్రుల ఆలోచననూ మార్చాలి. జీవితంలో అనుకున్నవన్నీ జరగవనీ, అయినా అధైర్య పడకుండా అనుకోనివి ఎంత సక్సెస్‌గా అఛీవ్ చేయగలుగుతామో చూపించాలి. ఇన్‌స్పైర్ చేయాలి. అదీ చదువు నేర్పిన ఓర్పు, విచక్షణ! అంతేకాని నిరాశతో సూసైడ్ చేసుకోవడం కాదు. అరే చేతికొచ్చిన కొడుకు పోయాడు.. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల గతేంటి? సింగిల్ మినిట్ అయినా వాళ్ల గురించి ఆలోచించాడా అతను? ఆలోచిస్తే ఇలా ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అందుకే నేను కండోలెన్స్ మీటింగ్‌కి రాలేదు’’ అని తెగేసి చెప్పింది శ్రావ్య.
ముప్పై రోజుల్లో అరవై గ్రామాలు..
ఫ్రెండ్స్‌తో చెప్పడమే కాదు తన ఆలోచనా తీరునూ మార్చుకుంది అప్పటి నుంచే శ్రావ్య. ఇప్పుడు తన ముందున్నది ఐఏఎస్ కాదు... అంతకుమించిన లక్ష్యం! సమాజం కోసం ఏమన్నా చేయాలి... ఏం చేయాలి? పరిశోధన ప్రారంభించింది. ప్రతి జిల్లాలో 60 గ్రామాల చొప్పున తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించింది. జూలై 1న ప్రయాణం మొదలుపెట్టిన ఈ ప్రయాణం జూలై 31కి పూర్తయింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలెన్నో తెలుసుకుంది. అంతకుమించిన అనుభవం గడించింది. శ్రావ్య పూర్తిపేరు మందడి శ్రావ్యారెడ్డి. తల్లిదండ్రులు.. మందడి చంద్రశేఖర్‌రెడ్డి, కాంట్రాక్టర్. తల్లి నీరజారెడ్డి, అడ్వకేట్. శ్రావ్యకు ఓ చెల్లెలు.. శ్రీహారెడ్డి, ఏమ్‌బీఏ గోల్డ్‌మెడలిస్ట్. శ్రావ్య విద్యాభ్యాసం.. స్కూలింగ్.. సెయింట్ ఆన్స్, శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్, నల్లమల్లారెడ్డి కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.
‘నో’ అనే మాటమీదే ఉంది..అంటే..?
శ్రావ్య ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే బెల్జియం దేశానికి సంబంధించిన ఓ సంస్థ నిర్వహించిన జనరల్ నాలెడ్జ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్‌లో నెగ్గింది. ఆమె ప్రతిభకు ముచ్చటపడ్డ ఆ సంస్థ తమ ఖర్చుతో బెల్జియంలో శ్రావ్య చదువుకునే చాన్స్‌నూ ఇచ్చింది. అంతేకాదు చదువు తర్వాత ఉద్యోగావకాశాన్నీ ఇస్తామంది. కానీ శ్రావ్య ‘నో’ అంది.‘ తెలియనితనంతో కాదు.. తెలిసిన పరిణతితోనే’ అలా అన్నానని అంటుంది ఆమె. ‘‘ఒక్కసారి వాళ్ల ఆఫర్‌కు ఓకే అన్నామంటే జీవితాంతం ఆ దేశానికి ఊడిగం చేయాలి. అదేదో నా దేశానికే చేసుకోవచ్చు కదా! అనే అభిప్రాయంతో రిజెక్ట్ చేశాను’’ అని చెప్తుంది. ఆ దృఢ నిశ్చయానికి ఆమె తల్లిదండ్రులూ సంబరపడ్డారట కాని అయ్యో అంత అద్భుతమైన అవకాశాన్ని వద్దనుకుంటోందే అని బాధపడలేదట.. ప్రెషర్ పెట్టలేదట. స్కూల్ ప్రిన్సిపాలే ఒకటికిరెండు సార్లు ‘‘వెళితే స్కూల్ పేరు కూడా ఎలివేట్ అవుతుంది కదా’’ అని ప్రస్తావించారట. అయినా శ్రావ్య ‘నో’ అనే మాటమీదే ఉంది. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నదాని మీద నిలబడ్డం చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అది ఆమె వ్యక్తిత్వం. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా.
గూగుల్‌లో ఉద్యోగం.. కానీ
స్కూలింగ్ అప్పటి నుంచే క్లాస్ లీడర్‌గా ఉంది శ్రావ్య. ఇంజనీరింగ్ వరకూ ఆ లీడర్‌షిప్ కంటిన్యూ అయింది. ఏ టాస్క్ ఇచ్చినా సమర్థవంతంగా పూర్తిచేసేది. ప్రశ్నించే తత్వం ఉండేది. ఇంజనీరింగ్ అయిపోయాక అందరిలాగే కార్పొరేట్ జాబ్ గూగుల్‌లో చేరింది. కాని ఎక్కడో అసంతృప్తి. ఏదో చేయాలనే చివరకు ఇదా చేస్తోంది అని తనను తానే విమర్శించుకుంది. విశ్లేషించుకుంది. ఐఏఎస్ సాధిస్తే చాలామందికి ఉపయోగపడొచ్చు కదా అని సివిల్స్‌కి సిద్ధమైంది. అదిగో అప్పుడే పైన చెప్పిన సంఘటన (ఇద్దరి ఆత్మహత్య) జరిగి.. మొత్తం తన దిశనే మార్చుకుంది.
‘‘మాతో పాటు సివిల్స్‌కి ప్రిపేర్ అయిన ఆ ఇద్దరి ఆత్మహత్య నన్ను చాలా ఆలోచించేలా చేసింది. మన దగ్గర కంప్లయినింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఏం చేయలేకపోయినా తప్పు సమాజం మీద, దేశం మీదకు నెట్టేస్తాం. బాధ్యత తీసుకోవడానికి మాత్రం ముందుకు రాం. అలాంటప్పుడు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? రెస్పాన్సిబుల్ సిటిజన్స్‌గా మనమేం చేస్తున్నాం? హావ్ టు బ్రింగ్ దట్ చేంజ్ అనుకున్నా. ముందుగా కొన్ని ఎన్‌జీవోలతో కలిసి పనిచేశా’’ అంటూ తన ప్రయాణ ప్రారంభాన్ని చెప్పింది శ్రావ్య.
ఎగతాళికి గురవుతున్న...
పనిచేసిన ఎన్‌జీవోలు, అటెండ్ అయిన సెమినార్లు శ్రావ్యకు చాలా విషయాలే నేర్పాయి. ముఖ్యంగా మన దగ్గర స్త్రీల పరిస్థితి గురించి! రేప్ జరిగినా అమ్మాయిదే తప్పు, భర్త చనిపోతే శుభానికి పనికిరాదు మహిళ, మొగుడు విడాకులిచ్చినా అవమానం మోసేది స్త్రీయే.. ప్రతి తప్పును ఆడవాళ్లే మోయాలి ఎందుకు? ఈ అనుభవమే శ్రావ్య ‘‘వియ్ అండ్ షి’’ అనే సంస్థను పెట్టి తెలంగాణ జిల్లాలను చుట్టేలా చేసింది. ప్రతి ఊరూ వెళ్తున్నా కొద్దీ.. తెలియని కోణాలు, ఊహించని పరిస్థితులు ఆమె కళ్ల ముందు! ఇంకా ఆగని బాల్యవివాహాలు, బాల వితంతువులు.. చదువు, ఉపాధి లేకుండా.. బానిస బతుకులు ఈడుస్తూ.. ఆమె కడుపు తరుక్కు పోయింది. కొంతమందికి అయితే ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలియదు. పెన్షన్ ఆగిపోయిన వాళ్లు, పక్కా ఇళ్లు లేని వాళ్లు ఉన్నారు. జోగినీ వృత్తికి దూరమైనా ఇంకా అవమానాలపాలవుతున్న మహిళలు, ‘‘మీకెంతమంది నాన్నలురా’’ అని ఎగతాళికి గురవుతున్న వాళ్ల పిల్లలు, వరకట్న బాధితులు.. ఇలాంటి దాదాపు 73 కేస్‌లను ఐడెంటిఫై చేసింది. తక్షణమే సాయం కావల్సిన వాళ్లకు తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఆ సహాయం అందేలా చూసింది. మిగిలిన వాళ్ల వివరాలు రాసుకుంది.
మీరున్న చోటే.. మీకు వీలైనప్పుడు..
శ్రావ్య ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్లను మామూలు మనుషులుగా చేసే ప్రయత్నంలో ఉంది. తర్వాత వాళ్ల నైపుణ్యం, అభిరుచులకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చేపడుతుందట. వాటికి కావల్సినవి సమకూర్చుకుంటోంది. తన సంస్థకు సంబంధించిన ఆఫీస్‌ను ప్రారంభించింది. వన్ ఉమన్ ఆర్మీగా సాగుతున్న ఈ జర్నీకి ఆమె ఎవరినుంచీ ఆర్థిక సహకారం ఆశించట్లేదు. వలంటీర్స్‌నూ ఆహ్వానించట్లేదు. ఒంటరి స్త్రీలకు మెరుగైన జీవితం ఇవ్వడానికి ఒంటరిగానే పోరాడుతోంది శ్రావ్య. కాకపోతే ఎవరైనా వలంటరీగా సర్వీసెస్ ఇస్తామని ముందుకు వస్తున్నవాళ్లకు ఒకటే చెప్తోంది.. ‘‘మీరున్న చోటే.. మీకు వీలైనప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేయండి.. మీకు తోచిన పని చేయండి’’ అని. యువతలోని చాలామంది ఆ స్ఫూర్తిని పంచుకుంటున్నారు. శ్రావ్య ఇప్పుడు లా కూడా చదువుతోంది. లాయర్ అయి పేదరికంలో ఉన్న మహిళలకు న్యాయసహాయం కూడా చేయాలని ఆమె ఉద్దేశం. అలాగే అవగాహన కూడా కల్పించే పనిలో ఉంది ఆమె.
సర్పంచ్‌లు అడ్డుకునేవారు...కానీ
‘‘చిన్న చిన్న వానచినుకులే సముద్రాన్ని నింపుతాయి. అలా నేను వేసిన అడుగు కూడా చిన్న వాన చినుకులాంటిదే. తెలంగాణ టూర్‌కి నేనే ఫైనాన్స్ చేసుకున్నా. జాబ్ చేస్తున్నప్పటి నా సేవింగ్స్, నాకున్న కొంచెం జ్యూయెలరీ, మా నాన్న ఇచ్చిన ఎమౌంట్ అన్నీ కలిసి రెండు లక్షలు అయ్యాయి. వాటితోనే రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. కొన్ని చోట్ల ఊళ్లోకి అడుగు పెట్టనివ్వకుండా సర్పంచ్‌లు అడ్డుకున్నారు. వాళ్లను కన్విన్స్ చేశా.. వినలేదు కొంతమంది. నేనూ అంతే మెండిగా ఊరి పొలిమేరలో కూర్చున్నా కానీ వెనకడుగు వేయలేదు. వాళ్లకు విసుగొచ్చి సరే వెళ్లండి అని ఊళ్లోకి పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్ సర్వే జరగని ఊళ్లకు కూడా వెళ్లా. నన్ను చూసి వాళ్లెంత సంతోషపడ్డారో.. వాళ్ల బాధలన్నీ ఏకరువు పెట్టారు. సర్వే కోసం ఎవరైనా వస్తే.. సర్పంచ్‌లు డబ్బులిచ్చేసి ఊళ్లోకి రానివ్వకుండా పంపించేస్తారని తెలిసి షాక్ అయ్యా. ఇలాంటి నిజాలెన్నో తెలిశాయి. వెల్‌ఫేర్ గర్ల్స్ హాస్టల్స్‌లో పిల్లల పక్కనే పడుకున్నా. వాళ్ల సమస్యలన్నీ షేర్ చేసుకున్నారు. శ్మశానంలోనే ఇళ్లున్న బ్యాదరి వాళ్ల దగ్గరా ఉన్నా. ఒళ్లు గగుర్పొడిచే లైఫ్ వాళ్లది. వాళ్లకు పెన్షన్ లేదు.. పక్కా ఇల్లు ఉండదు. సోషల్‌బాయ్‌కాట్! తలచుకుంటే ఇప్పటికీ మనసు మెలేసినట్టవుతుంది. ఇండిపెండెన్స్ వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా ఈ స్థితిలో ఉన్నాం. బాగవ్వాలి. ప్రస్తుతం మా చెల్లెలు నాకు చాలా హెల్ప్ చేస్తోంది. ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మా పేరెంట్స్ సపోర్ట్ గురించైతే చెప్పనవసరం లేదు’’ అంటోంది శ్రావ్యారెడ్డి.