Civils Ranker Success Story : సివిల్స్‌లో 'అపూర్వ' విజయం సాధించానిలా.. కానీ లక్ష్యం ఇదే..
చిన్నప్పుడు స్కూల్‌కు కలెక్టర్ బంగ్లా ఎదుట నుంచి వెళ్తుండగా అందులో ఎవరుంటారని అడిగితే కలెక్టర్ ఉంటారని, చాలా గొప్ప వ్యక్తి అని నాన్న చెప్పారు. అదే స్ఫూర్తిగా నాన్న ప్రేరణ, ప్రోత్సాహంతో సివిల్స్ సాధించారు మంద అపూర్వ అన్నారు. ఈ నేపథ్యంలో అపూర్వ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మాది తెలంగాణలోని హనుమకొండలోని ఎక్సైజ్‌కాలనీ. నాన్న అశోక్ కుమార్. ఈయన కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. అమ్మ రజనీదేవి. ఈమె ప్రభుత్వ టీచర్‌గా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌లో పనిచేస్తున్నారు. పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, చిన్నన్న అభినవ్ పుణెలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద వదిన మానస అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, చిన్న వదిన దివ్య పుణెలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
➤ Women IPS Success Stories : యూట్యూబ్‌లో వీడియోలు చూసి యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..
ఎడ్యుకేషన్ :
ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివాను. ఎంటెక్ (స్ట్రక్చరల్ ఇంజినీరింగ్) చేస్తున్నాను. నాన్న ప్రోత్సాహం వల్ల సివిల్స్ రాయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
ర్యాంక్ రాకపోవడంతో సివిల్స్ వదిలేసి..
మూడుసార్లు మెయిన్స్ రాశాను. రెండుసార్లు ఇంటర్వ్యూకి వెళ్లాను. ర్యాంక్ రాకపోవడంతో సివిల్స్ వదిలేసి వేరే ఉద్యోగం చేసుకోమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ నేను సాధించగలనని కుటుంబ సభ్యులు నమ్మి, ప్రోత్సహించారు. స్నేహితులు అండగా ఉన్నారు. దీంతో సివిల్స్ సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటే ప్రిపరేషన్ సులువవుతుంది.
సివిల్స్‌కి ఇలా ప్రిపేరయ్యాను..
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్‌కి చాలా టెస్ట్ పేపర్స్‌ని సాల్వ్ చేశాను. పూర్వ యూపీఎస్సీ ప్రశ్నపత్రాలను విశ్లేషించి, రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. జనరల్ స్టడీస్ కోసం కోచింగ్ తీసుకోలేదు. శంకర్ విజన్, ఫోరం టెస్ట్ సిరీస్ రాశాను. ఆప్షనల్ కోసం మాత్రం ఢిల్లీలో గైడెన్స్ ఐఏఎస్‌లో కోచింగ్ తీసుకున్నాను. మొదటి నుంచి నా ఆప్షనల్ జియోగ్రఫీ. మకువతో ఎంచుకున్న సబ్జెక్ట్ కాబట్టి ప్రతి అటెంప్ట్‌లో మంచి మార్కలు వచ్చేవి. ఈసారి కూడా 272 మార్కులు సాధించాను.
టాపర్స్‌ని చూసి మనం..?
సివిల్స్‌కు ప్రణాళిక అవసరం. మొదటి నుంచి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి, ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. టాపర్స్‌ని చూసి మనం ఎక్కడ ఉన్నాం అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. కేవలం తెలివి సరిపోదు స్థిత ప్రజ్ఞత, ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఒకటికి రెండుసార్లు ఓడినా నిరుత్సాహ పడకుండా కష్టపడాలి. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు తప్పనిసరిగా చదవాలి.
నా ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నలు ఇవే..
దాదాపు 30 నిమిషాల పాటు నా ఇంటర్వ్యూ కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర విభజన, అభివృద్ధిపై అడిగారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అభిప్రాయం చెప్పమన్నారు. కృత్రిమ మేధస్సు, చాట్‌జీపీటీ వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుందా అని అడిగారు. తెలంగాణకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధి సూచికలపై అభిప్రాయం చెప్పమన్నారు. కొత్త సెక్రటేరియట్, గ్రీన్ బిల్డింగ్, ఇండో-సార్సెనిక్ నిర్మాణ శైలిపై ప్రశ్నలు అడిగారు.
నా సలహా ఇదే..
యూపీఎస్సీ సివిల్స్ సాధించాలంటే ప్రణాళికబద్ధంగా చదవాలి. ఫెయిలైనా నిరుత్సాహ పడకుండా ముందడుగేయాలి. గత విజేతల ఇంటర్వ్యూలు చదవాలి. రోజూ 8 నుంచి 9 గంటలు ఇష్టంతో చదివితే అనుకున్నది సాధించవచ్చు.
నా లక్ష్యం ఇదే..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రభుత్వంలో వివిధ శాఖల్లో చిన్న వయస్సులోనే అత్యున్నత నాయకత్వపు హోదాలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందికి ప్రభుత్వ ఫలాలను వారి దగ్గరకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. ప్రజలతో మమేకమై, ప్రభుత్వ సేవలను ప్రజలకి మరింత దగ్గరగా తీసుకెళ్లడంపై దృష్టి సాధిస్తాను.
Tags
- Manda Apoorva UPSC Civils Ranker
- Manda Apoorva UPSC Civils Ranker Success Story
- Manda Apoorva UPSC Civils Ranker Family
- Manda Apoorva UPSC Civils Ranker Education
- Competitive Exams Success Stories
- Civil Services Success Stories
- Women
- Success Stories
- ChildhoodDreams
- CareerGoals
- CivilServices
- Inspiration
- CareerJourney
- Motivation
- RoleModel
- women success stories
- Civil Services Success Stories
- sakshi education successstories