Skip to main content

Amrapali, IAS : ఆమ్రపాలి స‌క్సెస్ జ‌ర్నీ.. స్వగ్రామం.. కుటుంబ నేప‌థ్యం ఇదే..?

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందిన ఆడపడుచు, ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నియమించారు.
Amrapali, IAS
ఆమ్రపాలి, ఐఏఎస్‌

అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ కేబినెట్‌ సెలక్షన్‌ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది.

ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్‌.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.

అతి చిన్నవయసులోనే...
అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్‌ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఐఏఎస్‌కు ఎంపికైన తరువాత 2011లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

కుటుంబ నేప‌థ్యం..:

Amrapali IAS Family


ఆమ్రపాలి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్‌ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమ్రపాలి.. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్‌.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది.

కుటుంబం అంతా ఉన్నతాధికారులే..
ఆమ్రపాలి భర్త సమీర్‌ శర్మ కూడా ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్‌ శర్మది జమ్మూ కాశ్మీర్‌. ప్రస్తుతం ఆయన డయ్యూ, డామన్‌లో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్‌ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్‌ కుమార్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. తమిళనాడు క్యాడర్‌ ఐఏఎస్‌కు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నికకు రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

కెరీర్‌ ఎంపిక విషయంలో..IAS
‘ ఇద్దరు అమ్మాయిలు నా దగ్గరికి వచ్చారు. అందులో ఒకరు నేను బాక్సర్‌నవుతాను.. సహకారం అందివ్వాలని కోరింది. మరొక అమ్మాయి మౌంటనీర్‌ (పర్వతారోహకురాలు) అవ్వాలని ఉంది.. శిక్షణ ఇప్పించాలని వేడుకుంది. ఈ బాలికల వెంట వారి తల్లిదండ్రులు ఉన్నారు. సమాజంలో మంచి మార్పు వస్తుందనేందుకు ఇవి ఉదాహరణలు. గతంతో పోల్చితే అమ్మాయిలకు సంబంధించి కెరీర్‌ ఎంపిక విషయంలో చాలా మార్పులు వచ్చాయనేది స్పష్టమవుతోంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని మాత్రం చెప్పలేం.’

భరించలేని బాధలను...
‘పుట్టడం, పెరగడం, చదువు, పెళ్లి, ఉద్యోగం ఇలా అన్ని విషయాల్లో మహిళలు అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నారు. ఈ ఆంక్షల కారణంగా ఎంతో ప్రతిభావంతులు సైతం ఇంటికే పరిమితం అవుతున్నారు. భరించలేని బాధలను పంటి బిగువున అదిమి పెడుతున్నారు. అందరితో మంచి అనిపించుకోవాలనే ఆత్రుతతో తమని తాము కోల్పోతున్నారు..’ స్త్రీ జీవితం చుట్టూ పెనవేసుకున్న నిబంధనలు, ఆచార వ్యవహరాలపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి కాటా స్పందించారు. ఒక్క రోజులో ఈ ప్రపంచాన్ని మార్చలేమని, వ్యక్తిగత స్థాయిలో మార్పును ఆహ్వానిస్తే అతి త్వరలో సామాజిక మార్పు, తద్వారా మహిళల జీవితాల్లో మరింత వెలుగు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు.

జీవితంలో పెళ్లి అనేది..

Life


ఓ కలెక్టర్‌గా నా దగ్గరకు వివిధ సమస్యలతో వచ్చే మహిళలో చాలా మంది పెళ్లైన తర్వాత భర్త సరిగా చూసుకోవడం లేదు. ఇబ్బంది పెడుతున్నాడు, భర్త, అతని కుటుంబం నుంచి కష్టాలు వస్తాయని చెప్పిన వారే ఉన్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం బయటి నుంచి చూపించడం కష్టం. తన కాళ్ల మీద తాను నిలబడగలను అనే ధైర్యం ఉన్నప్పుడు పరిష్కారం త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకుంటే నా జీవితం సెట్‌ అయిపోతుంది, నా భర్తే అంతా చూసుకుంటారు అనే ఆలోచణ ధోరణి కంటే నా కాళ్ల మీద నేను నిలబడతాను అనే వైఖరి అమ్మాయిల్లో రావాలి. జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైనది. తల్లిదండ్రులు, బంధువులు.. అంతా కలిసి పెళ్లి విషయం చూసుకుంటారు. పెళ్లి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టే బదులు ఆర్థిక స్వాతంత్ర సాధించే దిశగా పదో తరగతి నుంచి అమ్మాయిలు ఆలోచించడం మేలు. తెలివితేటలు అభిరుచికి తగ్గ చదువు, నైపుణ్యం పెంచుకోవాలి. ఉద్యోగం లేదంటే కుట్లు,అల్లికలు.. ఇలా క్రియేటివ్‌ వర్క్‌ ఏదైనాచేస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడాలి.

నా విషయానికి వస్తే కేరీర్‌ విషయంలో..
సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి కేరీర్‌ ఎంచుకోవాలనే అంశంపై చాలా మందికి స్పష్టత ఉండదు. మన వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, ఇష్టాఇష్టాలను బేరీజు వేసుకుని ఏ తరహా కెరీర్‌ ఎంచుకోవాలనేది తెలుస్తుంది. అందులో బెస్ట్‌గా ఉండేదాన్ని సాధించాలనే గోల్‌ పెట్టుకోవాలి. నా విషయానికి వస్తే కేరీర్‌ విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉన్నారు. నువ్వు అమ్మాయివి ఇలాంటి చదువే నీకు కరెక్ట్‌ అనలేదు.

పని ప్రదేశాల్లో...
ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ సంస్థల్లో మహిళలు పని చేస్తున్నారు. ఇక్కడ స్త్రీ, పురుషులకు ఒకే రకమైన సదుపాయాలు ఉంటున్నాయి. పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నందున అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు కార్యాలయంలో పని చేసే ఓ మహిళ తన పసిబిడ్డకు పాలు పట్టించేందుకు ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. క్లీన్‌ అండ్‌ సేఫ్‌ టాయిలెట్స్‌ పెద్ద సమస్య. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.

అందరికీ నచ్చాలంటే ఎలా..?

Women IAS Officer


సామాజిక కట్టుబాట్లు, ఆచారాలకు అమ్మాయిలు లొంగి ఉండాలి అనేట్టుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం నేర్పుతుంది. దీంతో అమ్మాయిలు లొంగి ఉండటం, సర్థుకుపోవడం వంటివి వంటబట్టించుకుంటారు. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి. అణుకువగా ఉండాలి అంటే. బీ కూల్, బీ నైస్‌ అని చెబుతారు. అబ్బాయిల విషయంలో అగ్రెసివ్‌గా ఉండు, నువ్వు ఏం చేసినా ఏం కాదు.. భయపడకు అని చెబుతారు. ఇలా మొదటి నుంచి పిల్లల పెంపకం (కండీషనింగ్‌)లోనే తేడాలు ఉంటాయి. ప్రపంచంలో అందరికీ నచ్చేట్టు ఎవ్వరూ బతకలేరు. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్‌ మనం మంచిగా బతకడం ముఖ్యం, ఆ తర్వాత పక్కన వాళ్లు. లీగల్, సోషల్‌ కౌన్సిలర్లు ఈ అంశంపై మహిళలతో మాట్లాడి వారిలో మార్పును తీసుకువస్తున్నారు. తరతరాలు ఉన్న పద్ధతిని ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా మార్చలేము. నెమ్మదిగా అయినా మార్పు వస్తుంది.

ఇక్కడ చాలా బెటరే...కానీ
అమ్మాయిల రక్షణ విషయంలో దేశంలో మన హైదరాబాద్‌ నగరం ఎంతో ముందంజలో ఉంది. పాలన వ్యవహారాలు, వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ, బెంగళూరులకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది పరిశీలిస్తాను. ప్రభుత్వ పనులు పక్కన పెడితే నేను ఓ సాధారణ మహిళనే. ఈ రెండు పరిస్థితుల మధ్య తేడా ను పోల్చి చూసినప్పుడు ఢిల్లీ, బెంగళూరుల కంటే హైదరాబాద్‌ మహిళల రక్షణ విషయంలో మెరుగైన స్థితిలో ఉంది. బెంగళూరు, ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్‌ మాటలను బట్టి.. ఏదైనా ఆపద వచ్చినా ఇబ్బందుల్లో ఉన్నా.. వారికి న్యాయం జరగాలంటే ఎన్ని ఫోన్‌ కాల్స్‌ చేయాలి.. ఎంత మందిని కలవాలి అనేది బేరీజు వేస్తాను. మన రాష్ట్రంలో కలెక్టర్‌గా కాకుండా ఓ సాధారణ మహిళగా ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు షీ టీమ్స్‌ వస్తాయి. ఇలాంటి రక్షణ దేశంలో ఇతర ప్రాంతాల్లో లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలను వేధించే, టీజ్‌ చేసే వాళ్లు అన్ని చోట్ల ఉంటున్నారు. వ్యక్తిగత స్థాయిలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే అమ్మాయి ప్రభుత్వ పాఠశాలల అమ్మాయిలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌పై శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం పీఈటీలకు స్వశక్తి టీమ్‌లతో ఇప్పటికే శిక్షణ ఇప్పించాం.

ప్రభుత్వ ఉద్యోగమే..
మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈ క్రమంలో బయట పని చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అని కాకుండా ప్రైవేట్‌ రంగంలో అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల/ కాలేజీల్లో ఉన్న పిల్లలు హై స్పీడ్‌ ట్రాక్‌లో ఉన్నారు. కస్తూర్బా పాఠశాలల్లో మార్పు వస్తోంది. గతంలో టెన్త్‌తో చదువు ఆపేసే వారు. ఇప్పుడు ఇంటర్మీడియట్‌కు వెళ్లేలా వారిలో మార్పు తీసుకువచ్చాం. నైన్త్, టెన్త్‌లో చదువు ఆపేసిన వారు, అన్‌ స్కిల్ల్‌డ్‌ గల్స్‌ కోసం వోకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఉన్నాయి.

బాధలు ఉంటే..

Good Words


ర్యాగింగ్‌ చేసినా, టీజింగ్‌ చేసినా బయటకు చెప్పడానికి అమ్మాయిలు భయపడుతారు. ఇంట్లో సమస్యలు ఉంటే బయటకు చెబితే చుట్టు పక్కల అంతా చెడుగా అనుకుంటారెమో అని పెళ్ళైన వాళ్లు సందేహపడతారు. ఇలా సమస్యను బయటకు చెప్పకుండా ఉంటే పరిష్కారం లభించడం కష్టం. నువ్వు అక్కడెందుకు ఉన్నావ్, అలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, అలా ఎందుకు మాట్లాడవు... తప్పంతా నీదే అంటూ విక్టిమ్‌ బ్లేమింగ్‌ చేస్తారని ముందుకు రారు. కానీ అమ్మాయిలు బయటకు చెప్పాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులు, రెవిన్యూ వాళ్లకి చెప్పండి.. మేము చూసుకుంటాం.

దిస్‌ ఈజ్‌ మై రిక్వెస్ట్‌..
గృహిణిగా ఉండడం అనేది ఓ గొప్ప విషయం. అయితే గృహిణి ఇంట్లో చేసి పనిని ఎవ్వరూ సరిగా గుర్తించరు. అండర్‌ వాల్యూ చేస్తారు. గృహిణిగా ఉంటూనే ఫైనాన్షియల్‌ ఇండిపెండెన్స్‌ కోసం ప్రయత్నించాలి. గంటా, రెండు గంటలా అనేది కాదు. పార్ట్‌టైం జాబ్, క్రియేటివ్‌ వర్క్‌ ఏదైనా పర్లేదు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. మనం అవునన్నా.. కాదన్నా వరల్డ్‌ రన్స్‌ ఆన్‌ ఎకనామికల్‌. హౌజ్‌ వైఫ్‌గా ఉండటం తప్పు కాదు. కానీ ఫైనాన్షియల్‌ ఇండిపెండెన్స్‌ కంపల్సరీ. ఎంతో తెలివైన వాళ్లు, సృజనాత్మకత ఉన్న వారు వారి ప్రతిభను అంతా ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఉమన్‌ గో అవుట్‌ అండ్‌ వర్క్‌... దిస్‌ ఈజ్‌ మై రిక్వెస్ట్‌.

నా విషయంలో..

IAS Success Story
నా విషయంలో తల్లిదండ్రుల నుంచి ఇటువంటి ఒత్తిడులు లేవు. అంతేకాదు ఏం చదవాలనే విషయంలో అమ్మాయిలకు ఛాయిస్‌ ఉండడం లేదు. అమ్మాయిలు డాక్టర్, టీచర్, అబ్బాయిలు ఇంజనీరు అంటారు. అమ్మాయిలు ఇంజనీరింగ్‌ చదివినా అందులో కంప్యూటర్స్‌ సెలక్ట్‌ చేసుకోమంటారు. మెకానికల్, సివిల్స్‌ వద్దంటారు. అమ్మాయిల తెలివి తేటలు, సామర్థ్యంతో పని లేకుండా శారీరక కష్టం లేని విధంగా చదువు సాగాలని అభిలాషిస్తారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లు విజయం సాధిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.

ఇది అందరం బాధపడే విషయం...ఎందుకంటే..?
మగ పిల్లలను కనాలి అనుకునే ప్రబుద్ధులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. ఇది మనమందరం బాధపడే విషయం, టెర్రిబుల్‌ ట్రాజిక్‌. రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే నమ్మకంగా ఉంటారు. తల్లిదండ్రులకు అండగా ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసినా మళ్లీ మగపిల్లలే కావాలంటారు. ఈ పద్దతిలో మార్పు రావాలి.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Smita Sabharwal, IAS : స‌క్సెస్ జ‌ర్నీ...ఈమె భ‌ర్త కూడా..

D.Roopa, IPS: ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే ఐపీఎస్‌..ఎక్క‌డైన స‌రే త‌గ్గ‌దేలే..

Ira Singhal, IAS : నా పరిస్థితులే..న‌న్ను 'ఐఏఎస్' చేసాయ్‌..

Published date : 01 Jan 2022 02:09PM

Photo Stories