Skip to main content

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అనేవారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. ఈ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని పెద్ద పెద్ద కలలు కన్నాడు రమేష్‌ గోలప్‌.
Ramesh Gholap,IAS officer
రమేష్‌ గోలప్‌ది, ఐఏఎస్‌ ఆఫీసర్‌

వాటిని సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినా ఏనాడూ వెనకంజ వేయలేదు. ఒకప్పుడు పొట్ట కూటి కోసం గాజులు అమ్మిన ఆ కుర్రాడే.. ప్రస్తుతం ఐఏఎస్‌గా సేవలందిస్తున్నాడు. తన తల్లినీ, గ్రామాన్నీ తలెత్తుకునేలా చేస్తున్నాడు!

నిరుపేద కుటుంబం...పైగా పోలియో సోకడంతో..
మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా వార్సీకి చెందిన రమేష్‌ గోలప్‌ది నిరుపేద కుటుంబం. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకింది. దీంతో ఆటపాటల్లో పాల్గొనడానికి ఇబ్బంది పడేవాడు. అయితే, ఈ వైకల్యం అతని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కొంచెం కూడా తగ్గించలేకపోయింది. చదువులో రమేష్‌ ఎప్పుడూ క్లాస్‌ ఫస్టే. తండ్రి గోరఖ్‌ గోలప్‌ సైకిల్‌ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, అతడి తాగుడు అలవాటు కుటుంబంపై పెను ప్రభావాన్ని చూపింది. రోజూ తాగడంతో ఆరోగ్యం దెబ్బతిని, కుటుంబం నడవడం కష్టమైంది.

మరో ఆదాయ మార్గం లేక‌..

Ramesh Gholap


దీంతో రమేష్‌ తల్లి విమలకు పని చేయక తప్పలేదు. మరో ఆదాయ మార్గం లేకపోవడంతో రమేష్‌ గోలప్‌ తల్లి చుట్టుపక్కల గ్రామాల్లో గాజులు అమ్ముతూ సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఆమెకు తోడుగా రమేష్, తమ్ముడు సాయం చేసేవారు. వార్సీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండటంతో ఉన్నత విద్య కోసం బాబాయి దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూడా మిగతా విద్యార్థుల కంటే రమేష్‌ ముందుండేవాడు.

తండ్రి అంత్య క్రియలకు వెళ్ల‌డానికి చిల్లి గవ్వలేక‌..Father​​​​​​​
2005లో ఓ పిడుగు లాంటి వార్త రమేష్‌ను కుదిపేసింది. అనారోగ్యంతో తండ్రి మరణించడంతో 12వ తరగతి చదువుతున్న రమేష్‌ హతాశుడయ్యాడు. ఆ సమయంలో మోడల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి అంత్య క్రియలకు వెళ్లేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఊరెళ్లేందుకు బస్‌ చార్జీ కోసం 7 రూపాయలు కావాలి. రమేష్‌కు వికలాంగ బస్‌పాస్‌ ఉంది. అయినా మరో 2 రూపాయలు కావాలి. స్నేహితుల సాయంతో అంత్య క్రియల్లో పాల్గొన్నాడు. తండ్రి మరణం అతడిని బాగా కుంగదీసింది. అయితే, తల్లి బలవంతంతో నాలుగు రోజులకు కెమెస్ట్రీ పరీక్షకు హాజరయ్యాడు. ఆ పరీక్షలో రమేష్‌కు 40కి 35 మార్కులొచ్చాయి. దీంతో స్కూల్‌ టీచర్‌ అందించిన ప్రోత్సాహంతో 12వ తరగతి పరీక్షల్లో 88.5 శాతం మార్కులు సాధించాడు.

తహసీల్దార్‌ అయితే..
ఉన్నత చదువులు చదవాలని ఉన్నా అందుకు భారీ మొత్తంలో డబ్బు అవసరం కావడంతో, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డీఎడ్‌ కోర్సులో చేరాడు. అదే సమయంలో ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్‌ చేశాడు. 2009లో ఓ స్కూల్‌లో టీచర్‌గా జాయినయ్యాడు. ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే గానీ, రమేష్‌కు సంతృప్తి మాత్రం లభించలేదు. కాలేజీ విద్యార్థిగా ఉండగా స్టూడెంట్‌ యూనియన్‌ లీడర్‌ హోదాలో ఆయన చాలా సార్లు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లేవాడు. ఆ క్రమంలో తహసీల్దార్‌ అయితే, అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టొచ్చని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు.

తల్లి తీసుకున్న రుణంతో చ‌దివా...తొలి ప్రయత్నంలోనే

IAS Family


తన కల నిజం చేసుకునే దిశగా 2009లో తొలి అడుగువేశాడు రమేష్‌. స్వయం సహాయక బృందం నుంచి తల్లి తీసుకున్న రుణంతో పుణే వెళ్లి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావడం మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయితే, మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలు రాసి తహసీల్దార్‌ ఉద్యోగం సంపాదించాడు. కానీ, పట్టు విడవలేదు. పగలనక, రాత్రనక కష్టపడి చదివాడు. 2012 యూపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో 287వ ర్యాంకు సాధించాడు. ఆ క్షణంలో అతడిలో చెప్పలేనంత ఆనందం. 2012, మే 4న ఐఏఎస్‌ అధికారిగా తన స్వగ్రామంలో అడుగు పెట్టాడు.

మా గ్రామస్థులు ఆశ్చర్యపోయారు...ఘ‌నంగా..

Village


తమ కళ్లముందే గాజులమ్మిన కుర్రాడు ఐఏఎస్‌ ఆఫీసర్‌గా రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రమేష్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలిచిన ఆయన్ను గ్రామస్థులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం రమేష్‌ జార్ఖండ్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే ఆయన.. తన బాల్యంలోని అనుభవాలను మర్చిపోలేదు. అందుకే అవినీతి అధికారులకు సింహస్వప్నంగా మారాడు. జీవితంలో ఏదైనా సాధించవచ్చనడానికి రమేష్‌ జీవితం చక్కని ఉదాహరణ!

Inspiring Story : విప‌త్క‌ర‌ ప‌రిస్థితిల్లో..ఆప‌ద్బాంధ‌వుడు..ఈ యువ ఐఏఎస్ కృష్ణ తేజ

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Published date : 13 Jan 2022 01:33PM

Photo Stories