Skip to main content

Keerthi Jalli, IAS : నా పని మాట్లాడాలి.. నేను కాదు..

ఆమె తల్లిదండ్రులకు హైదరాబాద్‌లో కరోనా వచ్చింది. అయినా అస్సాంలో విధులను వదులుకోకుండా ప్రజల్లోనే ఉంది కీర్తి. పెళ్లీ అయినా మరుసటి రోజే కోవిడ్‌ స్పెషల్‌ వార్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది కీర్తి.
Keerthi Jalli, IAS
Keerthi Jalli, IAS

స్త్రీల రక్తహీనతకు విరుగుడుగా ఉసిరి మురబ్బాను పంచి జనం మెచ్చుకోలు పొందింది కీర్తి. 2013 బ్యాచ్‌ తెలంగాణ ఐఏఎస్‌ కీర్తి జెల్లి. ఇవాళ అస్సాం ప్రజల్లో స్త్రీ సామర్థ్యాన్ని, తెలుగువారి సామర్థ్యాన్ని నిరూపించి అభినందనలు అందుకుంటోంది ‘కీర్తి’.

వివాహాం ఇలా..

keerthi jalli ias marriage


గ‌త సంవ‌త్స‌రం సెప్టెంబర్‌ మొదటివారంలో అస్సాంలోని ‘కచార్‌’ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ అయిన ‘సిల్‌చార్‌’లో కొంత మంది ప్రభుత్వ ముఖ్యాధికారులకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం పంపింది కచార్‌ జిల్లా డిప్యూటి కమిషనర్‌ కీర్తి జెల్లి. ‘మా ఇంట్లో సెప్టెంబర్‌ 10న వినాయకపూజ ఉంది. రండి’ అని ఆ ఆహ్వానం సారాంశం. జిల్లాలోని ముఖ్యాధికారులు ఆ రోజు కీర్తి జెల్లి బంగ్లాకు చేరుకున్నారు. అక్కడకు వెళ్లాక తమలాగే మొత్తం 25 మంది అతిథులు కనిపించారు. తాము వచ్చింది కేవలం వినాయక పూజకు మాత్రమే కాదనీ కీర్తి జెల్లి వివాహానికి అని అక్కడకు వెళ్లాకగాని వారికి తెలియలేదు. తమ జిల్లా ముఖ్యాధికారి అంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆనందించారు..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

వీరిద్దరి పెళ్లి ముందే..
వరుడు ఆదిత్యా శశికాంత్‌ వ్యాపారవేత్త. పూణె నుంచి వచ్చి క్వారంటైన్‌ నియమాలు పాటించాకే ఈ పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్లి ముందే నిశ్చయమైనా లాక్‌డౌన్‌ వల్ల పోస్ట్‌పోన్‌ అయ్యింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధులను వదులుకునే పరిస్థితి లేదు కనుక తన పని చోటులోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కీర్తి తెలిపింది. దాంతో కేవలం కొద్దిమంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ‘జూమ్‌’ ద్వారా మరో 800 మంది బంధుమిత్రులు వీక్షించారు. తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకుంటున్నారు కనుక కేవలం చెల్లెలు ఐశ్వర్య మాత్రం అమ్మాయి తరఫున హాజరయ్యింది. పెళ్లికి కీర్తి ప్రత్యేకంగా సెలవు తీసుకోలేదు. పెళ్లయిన మరుసటి రోజే విధులకు హాజరయ్యి ఎప్పటిలాగే విధుల పట్ల తన అంకితభావాన్ని నిరూపించుకుంది.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

కుటుంబ నేపథ్యం :
కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్‌. తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 

ఎడ్యుకేష‌న్ : 
2011లో బి.టెక్‌ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐఏఎస్‌ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్‌ కోసం ఢిల్లీకి వెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువుల్లో ఎవరూ ఐఏఎస్‌కు వెళ్లలేదు. పైగా చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయడం గురించి బంధువుల ఆలోచనలు ఉండేవి. కాని కీర్తి తండ్రి కనకయ్యకు కుమార్తెను ఐఏఎస్‌ చేయాలని పట్టుదల. చిన్నప్పటి నుంచి ఆయన ఇందిరా గాంధీ వంటి ధీర మహిళలను ఉదాహరణగా చూపిస్తూ కీర్తిని పెంచారు. ఐ.ఏ.ఎస్‌ కోచింగ్‌లో చేర్పించారు. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకూ సాధించింది. 

రాష్ట్రపతి చేతుల మీదుగా..

Award


ఐఏఎస్‌ ట్రయినింగ్‌ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్‌హట్‌ జిల్లాలోని తితబార్‌ ప్రాంతానికి సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. సాధారణంగా అస్సాం ప్రజలు ఎన్నికల పట్ల నిరాసక్తంగా ఉంటారు. అది గమనించిన కీర్తి తన నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతం పెంచడానికి, ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరగడానికి ‘భోని’ (చిన్నచెల్లెలు) అనే ‘ప్రచారకర్త బొమ్మ’ (మస్కట్‌)ను తయారు చేసి అన్నిచోట్ల ఆ బొమ్మ ద్వారా ప్రజలను ఉత్సాహపరిచింది. అస్సాం సంస్కృతిలో ‘చిన్న చెల్లెలు’ అంటే మురిపం ఎక్కువ. అందుకని ఆ ప్రచారం పని చేసింది. ఇది ఎలక్షన్‌ కమిషన్‌కు నచ్చింది. దాంతో కీర్తికి నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్‌ ఎలక్టొరల్‌ ప్రాక్టిసెస్‌ అవార్డ్‌’ ఇప్పించింది. 

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

అక్కడి పరిస్థితులు చూస్తే..
2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు తీసుకున్నప్పుడు అక్కడి పరిస్థితులు ఆమెకు సవాలుగా మారాయి. అక్కడ 47 శాతం మహిళలు, ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. ఇక 33 శాతం ఐదేళ్లలోపు పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు. పౌష్టికాహారలోపం  విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఇక అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్‌వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్‌ ప్రధాన్‌’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్‌ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్‌ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది.

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

నా పని మాట్లాడాలి.. నేను కాదు..
2020 మే నెల నుంచి కచార్‌ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్‌ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్‌చార్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్‌ పేషెంట్స్‌కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్‌ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి?

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..​​​​​​​

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Published date : 20 Apr 2022 05:53PM

Photo Stories