నాస్తి మాతృ సమః సఖా నాస్తి పితృ సమో గురుః
అందరూ ఐఐటీలో ఇంజినీరింగ్ చదివి.. అంతా ఇంజినీర్లే అయితే దేశంలో మిగతా సేవలు ఎక్కడ్నుంచి లభ్యమౌతాయి? వెల్లింగ్టన్ చిన్నతనం నుంచి చదువులో వెనుకబడి ఉండేవాడు. తరచూ తోటి పిల్లల్ని గ్రూపులుగా చేసి, పోటీలు పెడుతుండేవాడు. ఓడిపోయిన గ్రూపునకు తాను నాయకత్వం వహించి, గెలిచిన గ్రూపుతో పోటీ పడేవాడు. చదువులో అనాసక్తి, ఈ పోటీలలో ఆసక్తిని గమనించిన వెల్లింగ్టన్ తల్లి..పిల్లవాడ్ని సైనిక శిక్షణకు పంపింది. అనతి కాలంలోనే మిలిటరీ శిక్షణలో మంచిపేరు తెచ్చుకొని.. అంచలంచెలుగా ఎదిగి గొప్ప నాయకత్వ సామర్థ్యాలున్న జనరల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఐరోపాలో అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ.. సామ్రాజ్య కాంక్షతో దూసుకుపోతున్న నెపోలియన్‌ను నిలువరించటమే కాకుండా.. వాటర్లూ వద్ద జరిగిన యుద్ధంలో అతన్ని ఓడించిన వెల్లింగ్టన్.. చరిత్రలో శాశ్వతస్థానం సంపాదించుకున్నాడు...
ఐఐటి పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆ కుటుంబంలోని సభ్యుల మధ్య మాటల్లేవు. తండ్రి, కొడుకు మధ్య; తల్లి తండ్రి మధ్య; తల్లి కొడుకు మధ్య మౌనమే భాషగా ఉంది. ఆశించిన ఫలితాలు రాలే దని తండ్రి.. ఎందుకు రాలేదో తెలియని తల్లి.. ఫలితాలని ఎలా సమర్థించుకోవాలనుకునే కొడుకు.. ఈ ముగ్గురూ అనుభవించే మానసిక స్థితి, పోటీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాక అనేక కుటుంబాలలో కనిపిస్తుంది. ఈ కుటుంబ వాతావరణాన్ని గమనిస్తే... శ్రీనాథుని ‘కాశీఖండం’లో గుణనిధి కథ జ్ఞప్తికి వస్తుంది..! గుణనిధి తల్లిదండ్రులకు లేక లేక కలిగిన మగ సంతానం. సంతానలేమితో అల్లాడిన తల్లి, అమిత గారాబంతో పెంచటం మొదలెట్టింది. తండ్రి రాజు గారి ఆస్థానంలో ప్రధాన సలహాదారుగా ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండేవాడు. తండ్రి కుమారుడి గురించి ప్రస్తావించినప్పుడల్లా... కొడుకు వేదాలు, శాస్త్రాలు బాగా అభ్యసిస్తున్నాడని.. సంధ్యాదులు క్రమం తప్పకుండా ఆచరిస్తున్నాడని భర్తకి అబద్ధాలు చెప్పడం ప్రారంభించింది. గుణనిధి మాత్రం వేళకి భోజనానికి రావడం.. అందినంత ధనాన్ని, ఆభరణాల్ని చేజిక్కించుకోవడం.. మిత్రులతో జూదం ఆడటం, మధ్యం సేవించటం..లాంటి సమస్థ దుర్గుణాలకు ‘నిధి’గా మారాడు. చివరకు ఒకరోజు, ఓ జూదరి గుణనిధి గుణాలన్నింటినీ ఏకరువు పెట్టాడు. తండ్రికి కళ్లు బైర్లు కమ్మాయి. కొడుకు దుర్గుణాల్ని దాచిపెట్టి, తనతో అబద్దాలు చెబుతూ వచ్చి, తన విశ్వాసాన్ని వమ్ము చేసిందని భార్యకు.. వంశ ప్రతిష్ఠను దిగజార్చి, తనను తలదించుకునేలా చేశాడని కొడుకుకూ...శాస్త్రోక్తంగా కర్మకాండలు చేసి, వారితో సంబంధాలు తెంచుకున్నాడు!!
పదవీ విరమణ చేస్తున్న ఓ ప్రొఫెసర్ ఇలా అన్నాడు -‘‘నేను జీవితాంతం ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాను. గత 50 ఏళ్లలో నా ఉపన్యాసాల ద్వారా నేను బోధించలేనిది, మా నాన్న వారం రోజుల్లో తన ఆచరణ ద్వారా నాకు బోధించాడు. ఎలా జీవించాలో ఆయన నాకు నేర్పలేదు. ఆయన జీవించాడు, నేను గమనించాను. నిన్ను ప్రేమించలేని దానిని దేన్నీ నీవు ప్రేమించకు.. ఇదే నా తండ్రి మరణించబోతూ నాకు ఇచ్చిన సలహా. నాన్న మరణించిన తర్వాత అర్థమైంది. తండ్రికి కొడుకుగా ఉండటం చాలా తేలికని.. కొడుకులకు తండ్రిగా ఉండటం కష్టమని! నా జీవితంలో నాన్న మాటలు సబబే అని నేను అంగీకరించే సమయానికి.. ‘మా నాన్న మాటలు తప్పు’ అనుకునే కొడుకును కలిగి ఉన్నాను’’. ఈ ప్రొఫెసర్‌లా తండ్రులను గౌరవించలేక.. కొడుకుల గౌరవాన్ని పొందలేక వ్యథను అనుభవించే వ్యక్తులు సమాజంలో తరుచూ తారసపడతారు. ప్రేమించే తల్లిదండ్రులను కాకుండా.. ప్రేమించలేని అనేక వస్తువులను ప్రేమించే వ్యక్తులు ఎందరో! మరి ప్రొఫెసర్ తండ్రిలా తమ ఆచరణ ద్వారా బోధించేవారు ఎందరు?
చరిత్ర చదవటం కాదు.. సృష్టించాలి!
ప్రతి తండ్రి తన కుమారుడ్ని తనకు ‘మారుడు’గా తీర్చిదిద్దాలని అనుకుంటారు. వెల్లింగ్టన్ తల్లి, కుమారుడి ఆసక్తిని గమనించి, సైనిక శిక్షణకు పంపించి ఉండకపోతే యూరోప్ చరిత్ర మరోలా ఉండేదేమో! చరిత్ర సృష్టించాలనుకునే విధంగా తమ పిల్లలు ఎదగాలని అందరూ కోరుకుంటారు. మరి చరిత్ర సృష్టించిన వారి తల్లిదండ్రుల్లా... పిల్లల ఆసక్తిని గమనించి ఎదగనిచ్చేది, ప్రోత్సహించేది ఎందరు? తమ సంతానాన్ని తల్లిదండ్రులు చూడవలసిన తీరుపై భర్తృహరి ఇలా అన్నాడు..
రాజవత్ పంచ వర్షాణి దశ వర్షాణి దాసవత్
ప్రాప్తేతు షోఢశే వర్షే పుత్రం మిత్రవ దాచరేత్
పిల్లలకు ఐదేళ్లు వచ్చేవరకు రాజులా.. తర్వాత ఐదేళ్ల వరకు సేవకుడిలా.. 16 సంవత్సరాల వయసు దాటాక స్నేహితుడిలా చూడాలి. పిల్లలు తల్లి కడుపులోనే కాదు.. ఎదిగాక అడ్డం తిరగొచ్చు! సరైన పెంపకం లేకపోతే!!
మాటల కంటే ఆచరణ మిన్న:
రామాయణంలో భరతునికి రాజధర్మాలు వివరిస్తూ రాముడు.. ‘భరతా! రాజు, ప్రజలకు తండ్రిలాంటి వాడు. రాజు నిద్రను జయించినవాడై ఉండాలి. సమయాలు ఎరిగి, మేల్కొంటూ ఉండాలి. ముఖ్యమైన విషయాలను తెల్లవారుజామున ఆలోచించాలి. ఒంటరిగా ఉన్నా.. ప్రజలంతా నిన్నే గమనిస్తున్నారన్న భావంతో.. నీ శీలం, నడవడి, ఆదర్శప్రాయంగా ఉండాలి. పరిపూర్ణత ఆచరణ నుంచి వస్తుంది’ అన్నాడు.. ఈ మాటలు ప్రతి తల్లిదండ్రులకు వర్తించేవే! ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ ఇలా అంటారు - ‘మా అమ్మానాన్న వాదులాడుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్లు యవ్వనంలో ఉన్నప్పుడే.. ఇద్దరిలో ఒకరు పిల్లలకు క్రమశిక్షణ గురించి చెబుతున్నప్పుడు - మరొకరు ఎట్టి పరిస్థితిలోనూ జోక్యం చేసుకోకూడదని ఒప్పందం చేసుకున్నారు’.పిల్లలు ఎదగాలనుకునే తల్లిదండ్రులు.. ఐన్‌స్టీన్ తల్లిదండ్రుల్లా ఒప్పందం చేసుకొని అమలు చేయాలి కదా! దేశంలోనే గొప్ప న్యాయవాదిగా ఖ్యాతినార్జించిన వ్యక్తి.. తన అనుభవాన్ని ఇలా చెబుతున్నాడు - మా నాన్న జీవితంతో స్ఫూర్తిని పొంది, భగవంతుడిని ఒకరోజు రాత్రి నేను ఇలా ప్రార్థించాను - ‘దేవుడా.. నన్ను మా నాన్నలాంటి మనిషిగా ఎదిగేలా చూడు’ అని, నా ప్రార్థనను తలుపు చాటు నుంచి విన్న మా నాన్న .. మరుసటి రోజు రాత్రి ఇలా ప్రార్థన చేశాడు.. ‘భగవంతుడా నా కొడుకు ఎలాంటి తండ్రిని కావాలనుకుంటున్నాడో.. నన్ను అలా ప్రవర్తించేలాచూడు’ అని! తండ్రీ కొడుకులు ఒకరు అధికారం కోసం, మరొకరు స్వాతంత్య్రం కోసం పరస్పరం పోటీ పడకుండా... ఇలా ఒకరిని ఒకరు గెలిపించుకోవడానికి.. అర్థం చేసుకోవడానికి పోటీ పడితే ఎంత బాగుంటుంది!!
అసహనం.. అభద్రతాభావం.. ఆత్మన్యూనతా భావం:
ప్రపంచం సుభిక్షంగా, భద్రంగా ఉండాలంటే.. దేశాలు భద్రంగా ఉండాలి. దేశాలు భద్రంగా ఉండాలంటే.. కుటుంబాలు భద్రంగా ఉండాలి. కుటుంబం భద్రంగా ఉండాలంటే... వ్యక్తులు భద్రంగా ఉండాలి. ఈ కాలం పిల్లల్లో... అసహనం, అభద్రతాభావం, ఆత్మన్యూనతాభావం పెరుగుతున్నాయనేది నిస్సందేహం. పిల్లల్లో అభద్రతా భావం పెరగటానికి ఉమ్మడి కుటుంబాలు క్రమక్రమంగా విచ్ఛిన్నం కావటం కూడా కారణం. సామాజిక వ్యవస్థలో రకరకాల మనుషుల మధ్య మనగలగటానికి.. కుటుంబంలో రకరకాల బంధువుల మధ్య భిన్న,భిన్న వయసు, అనుభవం, అవగాహన, ఆలోచన ఉన్న వ్యక్తుల మధ్య విడదీయరాని బంధంతో ఇమిడిపోయిన భావంతో... పుట్టినప్పటి నుంచి పిల్లలు పెరిగితే.. వారిలో అభద్రతా భావం, అసహనం పెరగదు. దానివల్ల వ్యక్తి భద్రత బలపడి, సంఘ భద్రత కూడా బలపడుతుంది. ఇదివరకు రెండు మూడు తరాలు కలిసి జీవించినప్పుడు ఈ పరిస్థితి ఉండేది. పిల్లలకు విమర్శకుల కంటే ఆదర్శప్రాయులైన వ్యక్తుల అవసరమే ఎక్కువ. పిల్లలు మాట వినలేదని ఆందోళన చెందటం కంటే.. వాళ్లు మనల్నే గమనిస్తున్నారని ఆందోళన చెందటం అవసరం.
పిల్లవాడు విమర్శల మధ్య పెరిగితే.. పెద్దయిన తర్వాత ప్రతి దానిని విమర్శించటానికి ప్రయత్నిస్తాడు. పిల్లవాడు హేళనల మధ్య పెరిగితే.. పెద్దయిన తర్వాత బిడియస్తుడవుతాడు. ప్రతిదానికీ వేరే వాళ్లతో పోలుస్తూ, కించపరుస్తూ ఉంటే.. పెద్దయ్యాక ఆత్మన్యూనతా భావంతో జీవిస్తాడు. అదే చిన్నప్పటి నుంచి ప్రోత్సహిస్తే.. ఆత్మ విశ్వాసం కలవాడవుతాడు. చిన్నప్పటి నుంచి ప్రజాస్వామ్య వాతావరణంలో ప్రేమ, స్నేహం, సహనం ఉట్టిపడే వాతావరణంలో పెరిగితే.. తను కూడా ఒక ప్రజాస్వామ్యవాదిగా మారి సమాజాన్ని ప్రేమించటం నేర్చుకుంటాడు. బాల్యం ఎంత బలమైంది అంటే.. ప్రతి వ్యక్తి ఎదిగిన తర్వాత తనకు తెలియకుండానే తన బాల్యాన్ని మళ్లీ జీవించటానికి ప్రయత్నిస్తాడు. చార్లీచాప్లిన్ బాల్యంలో ఒక సంఘటన జరిగింది. వారి ఇంటి దగ్గరలో వథ్యశాల ఉండేది.
ఒక రోజు ఒక మూగజీవి ఆ వథ్యశాల నుంచి తప్పించుకొని, బయటకు పారిపోరుు వచ్చింది. దానిని చంపాలని వెంటపడేవారికి దొరక్కుండా.. గెంతుతూ, చూపరులకు వినోదాన్ని పంచింది. దాన్ని పట్టుకోవాలని వెంటపడ్డవారు ఎలాగో చివరకు దాన్ని పట్టుకున్నారు. దొరికిపోయిన ఆ జీవి భయంతో అరుస్తూ ఉంది. దాన్ని చంపటానికి వాళ్లు తీసుకెళుతుంటే.. చార్లీ చాప్లిన్ ఏడుస్తూ తల్లిదగ్గరకు వెళ్లి.. అమ్మా! వాళ్లు దాన్ని చంపేస్తున్నారంటూ రోదించాడు. ఈ సంఘటనా క్రమంలో.. వినోదాన్ని కలిగించిన సన్నివేశమే.. చివరకు విషాదంగా మారిన స్థితి చాప్లిన్‌కి జీవితాంతం మనస్సులో కదలాడుతూ ఉంది. వినోదంగా మొదలై, విషాదంగా ముగిసిన ఆ సంఘటనే... భవిష్యత్తులో హాస్యరసంతో ప్రారంభమై, కరుణరసంతో ముగిసిన తన చిత్రాలకు పునాది అయిందని చాప్లిన్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు.
కుటుంబం పూలతోట:
జీవితం, ప్రేమ, హాయిగా నవ్వగలగటం.. ఇవే తల్లిదండ్రులు, పిల్లలకు ఇచ్చే వెలకట్టలేని బహుమతులు! తల్లిదండ్రులు పిల్లలకు దృఢమైన మూలాలు.. బలమైన రెక్కలు.. రెండూ ఇవ్వాలి. బాధ్యతలనే మూలాలు, ప్రవాహంలో పడి కొట్టుకెళ్లకుండా ఉండటానికి, స్వేచ్ఛ అనే రెక్కలు సదావకాశం వచ్చినప్పుడు ఎగిరి అందుకోవటానికి, కుటుంబం పూలతోటలాంటిది. తల్లిదండ్రులు తోటమాలులు. తమ సమయం, పరిశ్రమ, ఊహాజనిత దృష్టి కుటుంబాన్ని పెంచటానికి, ప్రేమ పంచటానికి ఉపయోగించాలి. తోటమాలి సమయం వెచ్చించకపోతే మిగిలేది పుష్పవిలాపమే.
‘‘నాస్తి మాతృ సమః సఖా నాస్తి పితృ సమో గురుః’’
తల్లితో సమానమైన మిత్రులుగాని, తండ్రితో సమానమైన గురువు గాని లేరు!!