Justice EV Venugopal: సివిల్ ర్యాంకర్లను యువత ఆదర్శంగా తీసుకోవాలి
సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కరీంనగర్ మంకమ్మతోటలోని ఆయన నివాసంలో ఏప్రిల్ 21న సివిల్ ర్యాంకర్లకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందాల సాయికిరణ్, కొలనుపాక సహనను అభినందించి ఘనంగా సన్మానించారు.
ర్యాంకులు సాధించేందుకు దోహదపడిన అంశాలపై ఇష్టాగోష్టిగా వారితో చర్చించారు. రాజ్యాంగానికి లోబడి వృత్తిని కొనసాగిస్తూనే సమాజంలోని అన్నివర్గాలకు న్యాయం చేయాలని సూచించారు. గొప్ప వ్యక్తులు, సివిల్ ర్యాంకర్లను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గల్లీ నుంచి సివిల్ ర్యాంకులు సాధించి ఎదగాలని ఆకాంక్షించారు.
పుట్టిన గడ్డ గర్వపడేలా మరో పది మందికి ఆదర్శంగా నిలుస్తూ పేరు, ప్రతిష్టలు సంపాదించాలని తెలిపారు. ర్యాంకర్ల లక్ష్య సాధన అంశాలపై, వాళ్ల కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన వారైనప్పటికీ మొక్కవోని దీక్షతో వారు ర్యాంకులు సాధించడం అభినందనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి కె.వెంకటేశ్, 14వ డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేశ్, న్యాయవాదులు ఉప్పల అంజనీప్రసాద్, ఏవీ రమణ, ఎ.కిరణ్ కుమార్, ర్యాంకర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.