Skip to main content

Civils: మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడికి సివిల్స్‌లో ర్యాంకు.. సివిల్స్‌ గురూ.. మహేశ్‌ భగవత్‌

సాక్షి, హైదరాబాద్‌: సివిల్స్‌ ఫలితాల్లో దినసరి కూలీ కుమారుడు సత్తా చాటాడని, అది కూడా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో చదివి ఈ ఘనత సాధించాడని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ చౌడారపు శ్రీధర్‌ మే 23న‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనగాం జిల్లాకు చెందిన కొయ్యాడా ప్రభాకర్‌ కుమారుడు కొయ్యాడా ప్రణయ్‌ కుమార్‌ తొలిసారి సివిల్స్‌ పరీక్షకు హాజరై 885వ రాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు. ప్రణయ్‌ తండ్రి దినసరి కూలీకాగా అతని తల్లి గృహిణి. ప్రణయ్‌ మేడ్చల్‌ జిల్లా నాగారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదవగా గజ్వేల్‌ ప్రభుత్వ సోషల్‌ రెసిడెన్షియల్‌లో పాలిటెక్నిక్, జేఎన్‌టీయూలో బీటెక్‌ చేశాడు.
Dongri Revaiah
ర్యాంకు సాధించిన రేవయ్యకు స్వీట్‌ తినిపిస్తున్న తల్లి విస్తారుబాయి, సోదరుడు

మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడికి.. 410వ ర్యాంకు

రెబ్బెన (ఆసిఫాబాద్‌): సివిల్‌ ఫలితాల్లో మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడు డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410 ర్యాంకుతో మెరిశాడు. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి విస్తారుబాయి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కారి్మకురాలిగా పనిచేస్తోంది. 25 ఏళ్ల క్రితం భర్త మనోహర్‌ మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను షోషించింది. పెద్ద కుమారుడు తిర్యాణి మండలంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు రేవయ్య కన్నతల్లి కలను సాకారం చేస్తూ సివిల్స్‌లో సత్తా చాటాడు. 

చదవండి: NASA : 15 ఏళ్ల‌కే కైవల్య రెడ్డి రికార్డు.. ఐఏఎస్‌పీ-2023కి ఎంపిక..

2021లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి..

ఐఐటీ మద్రాస్‌లో బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన రేవయ్య కొన్నాళ్లు ఐఎన్‌జీసీలో ఉద్యోగం చేశాడు. సివిల్స్‌ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. 2021లో జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా కేవలం రెండు మార్కులతో ర్యాంకు కోల్పోయాడు. ఈసారి మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాగజ్‌నగర్‌లో ప్రాథమిక విద్య, ఆసిఫాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన రేవయ్య.. హైదరాబాద్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో ఇంటర్‌లో 929 మార్కులు సాధించాడు. పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని, ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపాడు.  

చదవండి: UPSC Civils 3rd Ranker Interview: విద్యా, వైద్యం, మహిళ సాధికారత సాధించడమే నా లక్ష్యం!

సివిల్స్‌ గురూ.. మహేశ్‌ భగవత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ ‘సివిల్స్‌ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్‌–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్‌ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్‌ భగవత్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్‌కు తాను మెంటార్‌గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్‌ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

చదవండి: Civils 2022 40th Ranker: నా success సీక్రెట్ ఇదే..

ఈ ఏడాది టాప్‌–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్‌ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్‌ దత్తా, 25వ ర్యాంకర్‌ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్‌ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్‌ కుమార్, 38వ ర్యాంకర్‌ అనూప్‌దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకర్ణి, 74వ ర్యాంకర్‌ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్‌ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్‌లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్‌ భగవత్‌ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు. 

Published date : 24 May 2023 11:34AM

Photo Stories