Civil Services: సివిల్స్ విజేతల సరికొత్త ఫ్యాక్టరీ!.. గడిచిన పదేళ్లలో సివిల్స్ టాప్ ర్యాంకర్లు వీరే..
అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, అనేక వడపోతలతో సాగే ఈ ప్రక్రియ గురించి వింటేనే..వామ్మో మనకెలా సాధ్యం..? అని అన్పిస్తుంది. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల కోసం ఒకప్పుడు ఢిల్లీకి వెళ్లి మరీ సన్నద్ధులైన తెలుగు రాష్ట్రాల వారిని పరిశీలిస్తే ఫెయిల్యూర్ స్టోరీలే ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాంతం క్రమంగా పట్టు బిగిస్తోంది..ర్యాంకుల సాధనలో సక్సెస్ అవుతోంది. 2021–2022 సివిల్స్ ఫలితాలే అందుకు నిదర్శనం అని నిపుణులు అంటున్నారు. తాజాగా ర్యాంకులు సాధించినవారిలో 46 మంది ఇక్కడివారే కావటం కొత్త చరిత్రగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ సివిల్స్ విజేతల ఫ్యాక్టరీగా రూపుదిద్దుకున్న ఫలితమే గడిచిన నాలుగేళ్లుగా తెలుగింటి బిడ్డల జైత్రయాత్ర అని చెబుతున్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఎప్పుడూ టాప్‌లో ఉండే ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాల సరసన ఇప్పుడు తెలంగాణ కూడా చేరుతోంది.
అమెరికా, ఐటీలొద్దంటూ..
ఇంజనీరింగ్, మెడికల్ ఇతర ప్రొఫెషనల్ చదువుల అనంతరం ఉన్నత ఉద్యోగం, అమెరికా లేదా ఇండియాలో ఐటీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉత్సాహం చూపే ప్రతిభావంతుల్లో ఎక్కువమంది దృష్టి ఇప్పుడు సివిల్స్ వైపు మళ్లుతోంది. సమాజం నుంచి తీసుకున్న దాంట్లో కొంతైనా సేవా రూపంలో తిరిగి సమాజానికి ఇవ్వాలనే లక్ష్యంతో కొందరు సివిల్స్ వైపు అడుగులేస్తున్నారు. ఢిల్లీ ఐఐటీలో గోల్డ్‌మెడల్ సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అజ్మీరా సంకేత్ జపాన్‌లో మంచి ప్యాకేజీతో ఉన్నత ఉద్యోగం సంపాదించాడు. అయితే తన స్నేహితుడు కట్టా రవితేజ సివిల్స్‌కు ఎంపికై సమాజానికి చేస్తున్న సేవ, అందులోని సంతృప్తిని గమనించి తానూ సివిల్స్ రాసి 35వ ర్యాంకు సాధించాడు. తనకు మిత్రుడు రవితేజ రోల్‌మోడల్ అని సంకేత్ సాక్షికి చెప్పారు.
చదవండి: UPSC: సివిల్స్ ఫలితాల‍్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి!
మాధోపట్టి..సివిల్స్ విజేతల పుట్టినిల్లు!
యూపీ రాజధాని లక్నోకు 300 కి.మీ. దూరంలో ఉన్న మాధోపట్టి గ్రామంలో మొత్తం 75 ఇళ్లు. అందులో సివిల్స్ సాధించిన వారు ఏకంగా నలభై మంది ఉండటం అబ్బురపరిచే విషయం. ఇక్కడ ఉపాధికి సరిపోయే భూమి లేక అందరూ ఉన్నత చదువులనే ఆధారం చేసుకున్నారు. ఇలా 1952లో డాక్టర్ ఇందుప్రకాష్ తొలిసారి యూపీఎస్సీ పరీక్షల్లో రెండో ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన నలుగురు సోదరులు ఐఏఎస్ ను సాధించారు. అందులో వినయ్‌సింగ్, ఛత్రçసల్‌సింగ్‌లు బిహార్, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఇలా మాధోపట్టి మేధావులకు నిలయంగా మారింది. పురుషులతో పాటు మహిళలు కూడా ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికయ్యారు. అలా మాధోపట్టి ఐఏఎస్‌ల ఫ్యాక్టరీగా మారింది.
అవగాహన పెరిగింది
గతంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు? వారి విధులు ఎలా ఉంటాయి? సమాజంలో వారు తీసుకొచ్చే మార్పు ఎలా ఉంటుందనే అంశాలపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. చాలామందికి డాక్టర్లు, ఇంజనీర్లే ఎక్కువ అనే భావన ఉండేది. మరోవైపు సివిల్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు చాలావరకు ఢిల్లీ కేంద్రంగానే ఉండేవి. దీంతో ఢిల్లీతో ఎక్కువ అనుసంధానమై ఉండే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ ఎంపిక అయ్యేవారు. అయితే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. సివిల్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈజీగా తెలిసిపోతోంది. హైదరాబాద్ కేంద్రంగానూ మంచి కోచింగ్ సెంటర్లు వచ్చాయి. అలాగే అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అవగాహన పెరిగింది. ఫలితంగా మనవారు ఇప్పుడు సివిల్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. విజయం సాధిస్తున్నారు.
– దురిశెట్టి అనుదీప్, (సివిల్స్–2017 ఆలిండియా టాపర్, మెట్‌పల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా), (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్)
ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించొచ్చు
నాన్న వెంకటేశ్వర్లు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. నేను బీటెక్‌లో ఉన్నప్పుడే మా కలెక్టర్ అలా అన్నారు. ఎస్పీ ఇలా అన్నారు అంటూ వారి గురించి గొప్పగా చెబుతుండేవారు. అప్పుడే నేనూ నిర్ణయించుకున్నా కలెక్టర్ కావాలని. అందుకోసం ఐదేళ్లు కష్టపడ్డా. కుటుంబసభ్యులు అందించిన సహకారంతో చివరకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించా. నాలా అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ దొరికితే రాష్ట్రం నుంచి అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు వస్తారు.
– ఉమా హారతి, సివిల్స్ 3వ ర్యాంకర్
నాలాంటి వాళ్లకు సాయం చేయాలని..
నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ నన్ను, అన్న, చెల్లెల్ని చదివించింది. మా కోసం ఆమెపడే కష్టం ఎప్పుడూ కళ్ల ముందే ఉండేది. అందుకే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఇంటర్ వరకు చదివా. ఐఐటీ చెన్నైలో సీటు వచ్చినప్పుడు కనీస ఫీజు సరే అక్కడికి వెళ్లేందుకు, ఇతర ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. అయితే కొందరు దాతలు ముందుకొచ్చి సహాయం చేయడంతో ఐఐటీ పూర్తి చేశా. ఆపై ఓఎన్‌జీసీలో ఉన్నత ఉద్యోగం సంపాదించా. కానీ ఏదో వెలితిగా అనిపించేంది. నేను కూడా కొంత మందికి సహాయం చేయాలంటే మరింత ఉన్నత స్థితిలో ఉండాలనుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి రెండవ ప్రయత్నంలోనే సివిల్స్‌లో 410 ర్యాంకు సాధించా.
– డొంగ్రి రేవయ్య, ఆసిఫాబాద్ జిల్లా
ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే..
ఒకప్పుడు సివిల్స్ రాయాలంటే ఢిల్లీ వెళ్లాలి. అక్కడ ఉండి కోచింగ్ తీసుకోవాలి. అక్కడి వాతావరణం, ఆహారం, భాష అన్నీ మనకు కొత్తగా అనిపించేవి. దాంతో ఎక్కువగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల వారే సివిల్స్‌లో రాణించేవారు. కానీ ఇప్పుడు అన్నింటికీ హైదరాబాద్ అడ్డా అయ్యింది. నిపుణుల కొరత లేదు. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, అమెరికా లాంటి దేశాలపై మోజు తగ్గించుకుని మరీ సివిల్స్ వైపు వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ఎంపికవుతుండటంతో, ఇతరులు వారిని ఆదర్శంగా తీసుకుని విజేతలవుతున్నారు.
– ఎం.బాలలత, సివిల్స్ ట్రైనర్
గడిచిన పదేళ్లలో సివిల్స్ టాప్ ర్యాంకర్లు..
ఏడాది |
టాపర్ |
రాష్ట్రం |
2013 |
గౌరవ అగర్వాల్ |
రాజస్తాన్ |
2014 |
ఢిల్లీ |
|
2015 |
ఢిల్లీ |
|
2016 |
కర్ణాటక |
|
2017 |
తెలంగాణ |
|
2018 |
కనిష్కా కటారియా |
రాజస్తాన్ |
2019 |
హరియాణా |
|
2020 |
బిహార్ |
|
2021 |
యూపీ |
|
2022 |
యూపీ |