First IAS Officer: ఫస్ట్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీకు తెలుసా?
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి చాలా ఏళ్లముందు సత్యేంద్రనాథ్ ఠాగూర్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నాటిరోజుల్లో బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలిస్తున్నారు. వారు భారతీయులను చాలా ఏళ్లపాటు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించలేదు. అయితే సత్యేంద్ర ఠాగూర్ తన అపార ప్రతిభతో ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
17వ శతాబ్దంలో బ్రిటీష్ వారు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి, ఇక్కడ పాలన ప్రారంభించారు. అప్పట్లో వారి ప్రభుత్వం ఉండేది. సమస్తం వారి నియంత్రణలో ఉండేది. చాలా ఏళ్లపాటు బ్రిటీష్ ప్రభుత్వంలోని ఉన్నత స్థానాల్లో భారతీయులు పనిచేసేందుకు వీలు కల్పించలేదు. 1832లో మొదటిసారిగా మున్సిఫ్, సదర్ అమీన్ పదవులకు భారతీయులు ఎన్నికయ్యేందుకు అనుమతించారు. తరువాత డిప్యూటీ మేజిస్ట్రేట్, కలెక్టర్ పదవులకు పోటీపడేందుకు భారతీయలను అనుమతించారు. కానీ 1860ల వరకు భారతీయులు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరు కాలేదు.
1861లో ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇండియన్ సివిల్ సర్వీస్ స్థాపితమయ్యింది. ఫలితంగా భారతీయులను సివిల్ సర్వీసెస్ పరీక్షకు అనుమతించారు. అయితే ఈ పరీక్షకు హాజరుకావడం భారతీయులకు అంత సులభం కాలేదు. ఈ పరీక్షలకు హాజరు కావడానికి లండన్‌కు వెళ్లవలసి వచ్చేది. పాఠ్యాంశాలు గ్రీక్, లాటిన్ భాషలలో ఉండేవి. గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లుగా ఉండేది.
1842 జూన్‌లో జన్మించిన సత్యేంద్రనాథ్ ఠాగూర్ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అడ్మిషన్ పొంది తన ప్రతిభచాటారు. ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం ఆమోదం పొందిన తరువాత సత్యేంద్రనాథ్ ఠాగూర్ తన స్నేహితుడు మోనోమోహన్ ఘోష్‌తో కలిసి ఈ పరీక్షకు వెళ్లాలని భావించారు. ఇద్దరూ లండన్ వెళ్లి పరీక్షకు ప్రిపేర్ అయ్యారు.
అయితే ఘోష్ ఈ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. సత్యేంద్ర ఠాగూర్ (1863లో) ఎంపికయ్యాడు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని, 1864లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అతను తొలుత బాంబే ప్రెసిడెన్సీలో నియమితులయ్యారు. తరువాత అహ్మదాబాద్‌లో అసిస్టెంట్ కలెక్టర్/మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. సత్యేంద్ర ఈ పదవిలో 30 సంవత్సరాల పాటు ఉన్నారు.
1896లో మహారాష్ట్రలోని సతారా నుండి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహణ 1922లో ప్రారంభమైంది. అప్పుడు దానిని ఇండియన్ ఇంపీరియల్ సర్వీసెస్ అని పిలిచేవారు. ఆ తర్వాత దానిని సివిల్ సర్వీసెస్‌గా మార్చారు.