సివిల్స్ అభ్యర్థులు అవగాహన స్థాయిపై స్వీయ విశ్లేషణతో ఉపయోగాలు ఇవే..!
ఒకవేళ పూర్తి చేయగలిగినా.. పరీక్షలో ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపగలమా అనేది ఆలోచించుకోవాలి. ఉదాహరణకు...కొన్ని సబ్జెక్ట్‌లు జనరల్‌గా ఉంటాయి. చదువుతున్నప్పుడు ఎంతో సులువు అనే భావన కూడా ఏర్పడుతుంది. కానీ.. వాటికి సంబంధించి పరీక్షలో అడిగే ప్రశ్నల తీరు ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఉదాహరణకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి మనం నిత్యం చూసే కలెక్టర్ వ్యవస్థ మొదలు పంచాయితీ రాజ్ వరకూ.. అన్నీ సమ్మిళితంగా ఉంటాయి. పరీక్ష రోజు ప్రశ్న పత్రంలో కనిపించే ప్రశ్నలు మాత్రం పూర్తిగా లోతైన అవగాహనను పరీక్షించేలా ఉంటాయి. ఇలాంటి సబ్జెక్టులో రాణించాలంటే.. పరీక్ష హాల్లో రాత నైపుణ్యాలు చాలా అవసరం.
మెటీరియల్ లభ్యత..
ఆప్షనల్ ఎంపికలో మరో కీలక అంశం.. మెటీరియల్ లభ్యత. ఇప్పుడు ఆర్ట్స్, హ్యుమానిటీస్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌ల మెటీరియల్ లభ్యతలో ఎలాంటి సమస్య లేదు. కానీ..టెక్నికల్, సైన్స్ తదితర స్పెషలైజ్డ్ సబ్జెక్ట్‌ల విషయంలో మాత్రం అభ్యర్థులకు మెటీరియల్ లభ్యత కొంత సమస్యగానే ఉంది. ఇలాంటి సబ్జెక్ట్‌లను ఎంచుకునే అభ్యర్థులు తమ అకడమిక్ బుక్స్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రామాణికమైన గేట్, ఐఈఎస్ మెటీరియల్ అందుబాటులో ఉంటోంది. మెడికల్ ఆప్షనల్ అభ్యర్థులకు సీఎంఎస్‌కు సంబంధించిన మెటీరియల్ లభిస్తోంది. కానీ అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్ వంటి ‡సబ్జెక్టులకు మెటీరియల్ లభ్యత తక్కువనే చెప్పొచ్చు. కాబట్టి అభ్యర్థులు ఆప్షనల్ ఎంపికలో మెటీరియల్ లభ్యత, దాని ప్రామాణికతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
సాహిత్యం ఆప్షనల్..
ఇటీవల కాలంలో సివిల్స్ మెయిన్ ఫలితాల సరళిని పరిశీలిస్తే.. భాషా సాహిత్యం(లాంగ్వేజ్ లిటరేచర్)ను ఆప్షనల్‌గా తీసుకుని విజయం సాధిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. భాషా సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకునే అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృభాషకు సంబంధించిన సాహిత్యాన్ని ఎంపిక చేసుకున్నా..ఆ ఆప్షనల్‌కు సంబంధించి సిలబస్‌ను పూర్తిగా పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. సమాధానాలివ్వగలిగే సంసిద్ధత లభిస్తుందనే ఆత్మవిశ్వాసం ఉంటేనే వీటిని ఎంపిక చేసుకోవాలి.
ప్రిలిమినరీ నుంచే ప్రిపరేషన్..
ఆప్షనల్ సబ్జెక్ట్ పరంగా స్పష్టత లభించిన అభ్యర్థులు.. దానికి సంబంధించిన ప్రిపరేషన్‌ను ప్రిలిమినరీతోపాటే ప్రారంభించాలి. ప్రిలిమినరీ నుంచే మెయిన్ ఆప్షనల్‌పైనా దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగిస్తే.. రెండింటికీ ఒకే సమయంలో సన్నద్ధత లభిస్తుంది. పాలిటీ, ఎకానమీ,సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ ఆప్షనల్స్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు కొంత అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పొచ్చు. ప్రిలిమినరీలోనూ ఈ అంశాలు ఉండటమే ఇందుకు కారణం.
అనుసంధానం..
మెయిన్‌లోని ఇతర పేపర్లతోనూ ఆప్షనల్ సబ్జెక్ట్‌ను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్‌లో జీఎస్–1 నుంచి జీఎస్–4 వరకు నిర్వహించే నాలుగు పేపర్లలో పాలిటీ, ఎకానమీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీలకు సంబంధించిన అంశాలుæ సిలబస్‌లో నిర్దేశించారు. దీన్ని సానుకూలంగా మలచుకుని తులనాత్మక అధ్యయనం చేయడం ద్వారా.. మెరుగైన మార్కులు సాధించే అవకాశం ఉంది.