Civils Ranker Ravuri Sai Alekya Success Story: సివిల్స్ ఇంటర్వ్యూలో నన్ను అడిగిన ప్రశ్నలివే.. ఆ సబ్జెక్ట్స్ స్కోరింగ్‌గా అనిపించింది
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2023 పరీక్ష తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తంగా 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు.
ఈ ఫలితాల్లో తెలుగమ్మాయి రావూరి సాయి అలేఖ్య 938వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా ఆమె సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ అయ్యింది? ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు వంటి వివరాలపై సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.
1. సివిల్ సర్వీసెస్‌లో ఆప్షనల్‌గా ఏ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు? కారణం ఏంటి?
అలేఖ్య: ఆంత్రొపాలజీని ఎంచుకున్నాను. హ్యూమన్ స్టడీ, సోషియలజీ, ఆర్కియాలజీ వంటి విషయాలకు సంబంధించిన సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. పర్సనల్‌గా నాకు ఇష్టం కూడా. దాంతో పాటు సిలబస్, స్కోరింగ్.. ఇలా అన్నీ దృష్టిలో ఉంచుకొని ఆంత్రొపాలజీని ఎంచుకున్నాను.
2. ఆప్షనల్ ఎంచుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారు?
ఆప్షనల్ ఎంచుకునేందుకు ముఖ్యంగా మన ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందో అదే ఎంచుకోవాలి. ఆ తర్వాత పాత ప్రశ్నలు, సిలబస్, స్కోరింగ్.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవాలి.
3. జీఎస్‌లో మీకు ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ స్కోరింగ్‌గా అనిపించింది?
జీఎస్‌లో నాకు హిస్టరీ అండ్ జాగ్రఫీ బలమైన సబ్జెక్ట్స్ అని చెప్తాను. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చే ప్రశ్నలు కాస్త టఫ్‌గా అనిపించాయి.
4. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?
యూపీఎస్సీలో మన హాబీస్, ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన ప్రశ్నలు కాస్త ఎక్కువగానే అడుగుతారు. కానీ నాకు అవుట్ ఆఫ్ daf ప్రశ్నలు అడిగారు. హిస్టరీ, మైథాలజీ తేడా ఏంటి? దేన్ని ఎక్కువ నమ్మాలి?మీ జనరేషన్ వాళ్లమీద వెస్ట్రన్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉందా? లాంటి ప్రశ్నలు అడిగారు.ఆ తర్వాత యుక్రెయిన్- రష్యా యుద్దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.హిజ్రాయిల్-గాజా యుద్దానికి సంబంధించి, ఎకానమీకి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు అడిగారు.
5. ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్లకి మీరు ఏం చెబుతారు? ఎలాంటి సూచనలు ఇస్తారు?
ముందుగా నేను చెప్పేది ఏంటంటే.. సివిల్స్ రాయాలన్నది వాళ్ల సొంత ఛాయిస్ అయి ఉండాలి. తల్లిదండ్రులు చెప్పారనో, ఇంకెవరో చేశారనో కాకుండా సొంతంగా దానిపై ఇష్టం ఉండాలి.
6. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎలాంటి స్ట్రాటజీ అనుసరించేవాళ్లు?
ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చిన్నవాటికే భయపడిపోకూడదు. నేను ప్రిలిమ్స్ మూడు సార్లు రాశాను. స్ట్రెస్‌గా అనిపించినప్పుడు ఎవరితో మాట్లాడకుండా వెళ్లి పుస్తకాలు పట్టుకొని చదివేదాన్ని. చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని అవి సాధించినప్పుడు ఆనందపడేదాన్ని. ప్రీవియస్ ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు? వంటివి తెలియాలంటే ఎక్కువగా టెస్ట్ సిరీస్ రాస్తుండాలి. అన్నింటి కంటే ముఖ్యంగా సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవాలి.
7. మీ స్టడీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇతరులకు మీరిచ్చే గైడెన్స్ ఏంటి?
ఎవరి స్ట్రాటజీ వాళ్లది. నేను.. నాకు ఈజీగా అనిపించిన సబ్జెక్ట్, ఒక కష్టమైన సబ్జెక్ట్ రెండూ చదివేదాన్ని. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత బాగా సబ్జెక్ట్‌ని అర్థం చేసుకున్నామన్నది ముఖ్యం. రాత్రి పడుకునేముందు ఈరోజు సమయాన్ని ఏమైనా వృథా చేశానా? అని మనకి మనం ఆన్సర్ ఇచ్చుకోగలిగితే చాలు. ఒక స్ట్రాటజీతో చదివితే ఏదైనా సాధ్యమే.