సివిల్స్ అభ్యర్థులకు విజయంపై విశ్వాసం ఉండాలి!
Sakshi Education
కోవిడ్ కారణంగా మే నెలలో జరగాల్సిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఇప్పుడు జరుగుతోంది.
ఈ మధ్య కాలంలో కరెంట్ అఫైర్స్‌లో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతర్జాతీయ సంబంధాల్లో చాలా అంశాల్లో మార్పులు వచ్చాయి. వీటిని ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అభ్యర్థులు చివరి నాలుగు రోజులు ఎక్కువగా చదువుతుంటారు. అలాకాకుండా పరీక్షకు ముందు మూడు రోజులు పరీక్ష సమయానికనుగుణంగా మోడల్ పేపర్లు సాధన చేయాలి. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2లను ప్రాక్టీస్ చేయడం ద్వారా మనస్సును పరీక్షకు సన్నద్ధం చేయొచ్చు. సానుకూల దృక్పథాన్ని కలిగి విజయంపై భరోసాతో ఉండాలి. పరీక్షకు ముందు రోజు నిద్ర లేకుండా పుస్తకాలకే పరిమితమవడం ఒత్తిడి పెంచుతుంది. ఇది పరీక్షలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి పరీక్ష ముందు రోజు తగినంత నిద్ర పోవాలి. అభ్యర్థులు తమ చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మెడిటేషన్ చేయాలి. పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగానే తాజా మనస్సుతో వెళ్లాలి. అప్పుడే పరీక్షలో ప్రశ్నలకు సరిగ్గా ఆలోచించి సమాధానాలు రాయగలుగుతారు. కచ్చితంగా తెలియని ప్రశ్నలకు సమాధానం గుర్తించి మార్కులు కోల్పోవద్దు. ప్రిలిమ్స్‌లో గతేడాది జనరల్ కేటగిరీ అభ్యర్థుల కటాఫ్ 50శాతం మార్కుల కంటే తక్కువగా ఉంది. దీనికి కారణం నెగిటివ్ మార్కులే. కాబట్టి 50శాతానికి పైగా నమ్మకం ఉన్న ప్రశ్నలకే సమాధానాలు గుర్తించాలి. రెండో పేపర్ సుదీర్ఘంగా ఉంటుంది. తొలుత నెమ్మదిగా ప్రారంభించి, చివర్లో సమయం లేక గందరగోళానికి గురవుతారు. కాబట్టి మొదట్నుంచి ప్రతి ప్రశ్నకు సరైన సమయం కేటాయించి రాయాలి. పది నిమిషాలు ముందుగానే ప్రశ్నపత్రం పూర్తయ్యేలా చూసుకోవాలి.
–బాలలత మల్లవరపు, డైరెక్టర్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడెమీ
–బాలలత మల్లవరపు, డైరెక్టర్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడెమీ
Published date : 03 Oct 2020 11:20AM