NIPER JEE 2023 Notification: నైపర్ క్యాంపస్‌లు, అందించే కోర్సులు, ప్రవేశ పరీక్ష విధానం, ఎంట్రన్స్‌లో విజయానికి మార్గాలు..
- నైపర్–జేఈఈ–2023 ప్రక్రియ ప్రారంభం
- నైపర్ క్యాంపస్‌లలో పీజీ, పీహెచ్‌డీ, ఐపీహెచ్‌డీ కోర్సులు
- నైపర్ సర్టిఫికెట్లతో ఫార్మా రంగంలో ఉజ్వల కెరీర్
దేశంలో ఫార్మా రంగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్.. నైపర్. దేశవ్యాప్తంగా ఏడు నైపర్ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో పీజీ, పీహెచ్‌డీ, ఐపీహెచ్‌డీ వంటి అకడమిక్ ప్రోగ్రామ్‌లతోపాటు నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. ఫార్మా విద్యను అందించడంలో పేరు గడించిన నైపర్ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నైపర్–జేఈఈ.
అర్హతలు
బీఫార్మసీ/సంబంధిత కోర్సులు చదువుతూ గేట్, జీప్యాట్, నెట్ వంటి పరీక్షల్లో అర్హత పొందిన వారు ఈ ఎంట్రన్స్‌కు అర్హులుగా పేర్కొన్నారు. బీఫార్మసీ తత్సమాన కోర్సులో 6.75 సీజీపీఏ లేదా అంతకుసమానమైన పర్సంటేజీతో ఉత్తీర్ణత ఉండాలి. జీప్యాట్/గేట్/నెట్‌ల్లో అర్హత సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 50% మార్కులు లేదా 5.75 సీజీపీఏ సాధిస్తే సరిపోతుంది. ఈ ఏడాది చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!
ఏడు క్యాంపస్‌లు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏడు నైపర్ క్యాంపస్‌లు అకడమిక్ బోధన సాగిస్తున్నాయి. వీటిలో 15 పీజీ స్పెషలైజేషన్లులో 1158 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్–ఎంఎస్ ఫార్మసీ–145 సీట్లు, ఎంబీఏ(ఫార్మసీ)–30 సీట్లు; గువహటి–ఎంఎస్ ఫార్మ సీ–108 సీట్లు, ఎంఫార్మసీ–38 సీట్లు, ఎంటెక్–29 సీట్లు; హాజీపూర్–ఎంఎస్ ఫార్మసీ–82, ఎం ఫార్మసీ–18, ఎంటెక్(ఫార్మసీ)–10 సీట్లు; హైదరాబాద్–ఎంఎస్ ఫార్మసీ–109 సీట్లు, ఎంటెక్(ఫార్మసీ)–36 సీట్లు, ఎంబీఏ (ఫార్మా)–42 సీట్లు; కోల్‌కత–ఎంఎస్ ఫార్మసీ–89 సీట్లు,ఎంటెక్(ఫార్మా)–21 సీట్లు; రాయ్‌బరేలి–ఎంఎస్ ఫార్మసీ–110 సీట్లు; మొహాలీ–ఎంఎస్ ఫార్మసీ–171, ఎంఫార్మసీ–25, ఎంటెక్(ఫార్మసీ)–48సీట్లు, ఎంబీఏ(ఫార్మా)–47 సీట్లు.
పీజీ స్పెషలైజేషన్లు
- ఎంఎస్–ఫార్మసీ: మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్, ట్రెడిషనల్ మెడిసిన్, ఫార్మాస్యుటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ, ఫార్మాస్యుటిక్స్, బయోటెక్నాలజీ, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ డివైజెస్, రెగ్యులేటరీ అఫైర్స్.
- ఎంఫార్మసీ: ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ(ఫార్ములేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్.
- ఎంటెక్ ఫార్మసీ: ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ(ప్రాసెస్ కెమిస్ట్రీ); ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ(బయో టెక్నాలజీ);ఎంబీఏ(ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్).
ప్రవేశాలు ఇలా
- ఈ కోర్సుల్లో ప్రవేశానికి నైపర్–జేఈఈను నిర్వహిస్తారు. n అభ్యర్థులు జీప్యాట్ లేదా గేట్ లేదా సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ స్కోర్‌లు సొంతం చేసుకుని ఉండాలి.
- 2023 సంవత్సరానికి ఈ స్కోర్స్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- నైపర్–జేఈఈ తర్వాత దశలో సీట్ల కేటాయింపునకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేస్తారు. నైపర్–జేఈఈలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
200 ప్రశ్నలు–200 మార్కులు
- నైపర్ జేఈఈ పరీక్షను మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహిస్తారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరుగుతుంది.
- నైపర్–జేఈఈలో మెరుగైన ర్యాంకు సాధించాలంటే.. అభ్యర్థులు బీఫార్మసీ స్థాయిలోని అకడమిక్స్‌పై పట్టు సాధించాలి. కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యుటికల్ అనాలిసిస్ విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మొత్తం 200 ప్రశ్నల్లో 70 శాతం మేర ప్రశ్నలు ఈ విభాగాల నుంచే అడుగుతారు. కొన్ని ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి ఉంటున్నాయి. కోర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బీఫార్మసీలో పొందిన నైపుణ్యం, జీప్యాట్‌కు పొందిన సన్నద్ధతతో రాణించేందుకు వీలుంది.
- ఫార్మకాలజీలో రిసెప్టర్స్ వాటి రకాలు, మెకానిజమ్ ఆఫ్ యాక్షన్, ఔషధాల వర్గీకరణ, క్లినికల్ ట్రయల్స్‌పై అవగాహన, ప్రీ–క్లినికల్ ట్రయల్స్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. డ్రగ్ డిస్కవరీకి సంబంధించి ముఖ్యంగా వాటి ప్రాముఖ్యతలు, దాంతోపాటు రియాక్షన్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.
స్టయిఫండ్ సదుపాయం
నైపర్–జేఈఈ ప్రవేశ ప్రక్రియలో ప్రతిభ చూపి తుది విజేతలుగా నిలిచి.. ప్రవేశం ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా నైపర్ క్యాంపస్‌లు అందిస్తున్నాయి. ప్రతి విద్యార్థికి నెలకు రూ.12,400 స్టయిఫండ్ లభిస్తుంది. ఈ స్టయిఫండ్ కొనసాగాలంటే.. ప్రతి సెమిస్టర్‌లోనూ తప్పనిసరిగా జీపీఏ ఆరు పాయింట్లు ట్రాక్ రికార్డ్‌ను కొనసాగించాలి.
నైపర్–జేఈఈ 2023 సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 16, 2023
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: జూన్ 10, 2023
- నైపర్ జేఈఈ ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూన్ 23, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.niperguwahati.ac.in/
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు ఇలా
నైపర్ క్యాంపస్‌లు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు కూడా అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు నెపర్–జేఈఈ ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసేటప్పుడే పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
చదవండి: CSIR-UGC NET 2023 Notification: సైన్స్‌లో బోధన, పరిశోధనలకు మార్గం.. సీఎస్‌ఐఆర్ నెట్
అర్హతలు
అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగాలకు సంబంధించి.. ఎంఎస్, ఎంఫార్మసీ, ఎంటెక్ కోర్సులను సదరు స్పెషలైజేషన్లతో 6.5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులు 6.25 సీజీపీఏ లేదా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. జీప్యాట్/గేట్/సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ ఉత్తీర్ణత ఉండాలి. ఎండీ, ఎంవీఎస్‌సీ, ఎండీఎస్, ఫార్మ్–డి ఉత్తీర్ణులకు జీప్యాట్ /నెట్/గేట్ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది.
పీహెచ్‌డీ ఎంట్రన్స్
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే నైపర్–జేఈఈ 170 ప్రశ్నలకు ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మొత్తం మార్కులు 85. కెమికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్, ఫార్మాస్యుటికల్ సైన్సెస్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
మలిదశలో ఇంటర్వ్యూ
పీహెచ్‌డీ అభ్యర్థులు ఎంట్రన్స్‌లో పొందిన స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 15. ఇందులోనూ విజయం సాధిస్తే పీహెచ్‌డీ ప్రవేశం లభిస్తుంది.
ఆర్థిక ప్రోత్సాహకం
పీహెచ్‌డీలో ప్రవేశాలు ఖరారు చేసుకున్న విద్యార్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.31వేలు చొప్పున; మూడు, నాలుగు సంవత్సరాలు నెలకు రూ.35 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందుతుంది. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ కూడా లభిస్తుంది.
ముఖ్య సమాచారం
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: మే 16, 2023
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: జూన్ 10
- నైపర్ జేఈఈ ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూన్ 23
- ఫలితాల వెల్లడి: జూన్ 30, 2023
- వెబ్‌సైట్: https://www.niperguwahati.ac.in/
చదవండి: NEST-2023: ‘నెస్ట్’.. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీకి బెస్ట్!
ఐపీహెచ్‌డీ
నైపర్ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఆరేళ్ల వ్యవధిలో ఉండే ఈ ప్రోగ్రామ్‌లకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో స్కోర్ సాధించి సీటు సొంతం చేసుకున్న వారికి మొదటి రెండేళ్లు పీజీ ఫెలోషిప్, తర్వాత నాలుగేళ్లు పీహెచ్‌డీ ఫెలోషిప్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు.
అర్హత
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌ను అనుసరించి బీఫార్మసీ, ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ), బీవీఎస్సీ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ (ఫార్మకాలజీ/టాక్సికాలజీ/లైఫ్ సైన్సెస్/బయె కెమిస్ట్రీ/మెడిసినల్ బయో కెమిస్ట్రీ/ జువాలజీ/బయలాజికల్ సైన్సెస్), బీటెక్(బయో ఇన్ఫర్మాటిక్స్), ఎమ్మెస్సీ (ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ/ఫిజికల్ కెమిస్ట్రీ/మాలిక్యులర్ బయాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్/మైక్రో బయాలజీ), బీటెక్(కెమికల్ ఇంజనీరింగ్/ఫార్మాస్యుటికల్ ఇంజనీరింగ్) తదితర కోర్సుల్లో 6.75 సీజీపీఏతో ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు జీప్యాట్/గేట్/నెట్‌లో అర్హత సాధించాలి.
ప్రవేశం ఇలా
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నైపర్ జేఈఈ 200 ప్రశ్నలతో ఉంటుంది. ఈ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, ఎంపికైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండింటిలోనూ పొందిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. వారికి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తారు.
చదవండి: GPAT 2023 Notification: ఫార్మసీలో బెస్ట్ పీజీకి.. జీప్యాట్!
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 16, 2023
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: జూన్ 10
- ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ నైపర్ జేఈఈ పరీక్ష తేదీ: జూన్ 23
- ఫలితాల వెల్లడి: జూన్ 30
- వెబ్‌సైట్: https://www.niperguwahati.ac.in/