Skip to main content

NEST-2023: ‘నెస్ట్‌’.. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీకి బెస్ట్‌!

నెస్ట్‌.. నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌! ఈ ఎంట్రన్స్‌లో ప్రతిభ చూపితే.. ఇంటర్‌ పూర్తి చేస్తూనే.. నేరుగా ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులో అడుగు పెట్టొచ్చు! అది కూడా దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్‌లుగా గుర్తింపు పొందిన.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైసర్‌), యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై – డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌లో అడ్మిషన్‌ లభిస్తుంది.
nest 2023 notification details
  • నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా నైసర్, సీఈబీఎస్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ
  • ఇంటర్మీడియెట్‌ సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులు అర్హులుగా నెస్ట్‌
  • ప్రవేశం పొందితే అయిదేళ్లపాటు స్కాలర్‌షిప్, ఇతర ప్రోత్సాహకాలు
  • పరిశోధనల దిశగా అడుగులు వేసే మార్గం

దేశంలో సైన్స్‌ విద్య, పరిశోధనలో పేరున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైసర్‌)–భువనేశ్వర్,అదే విధంగా ముంబై యూనివర్సిటీలో అణు శక్తి విభాగం నెలకొల్పిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌(సీఈబీఎస్‌) ఇన్‌స్టిట్యూట్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఎంట్రన్స్‌.. నెస్ట్‌.

అర్హతలు

  • సైన్స్‌ గ్రూప్‌లతో 2021, 2022 సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • 2023లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు: ఆగస్ట్‌ 1, 2003 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు ఇస్తారు.

మొత్తం 257 సీట్లు

  • నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా.. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశం కల్పించే నైసర్‌ –భువనేశ్వర్, సీఈబీఎస్‌లలో మొత్తం 257 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నైసర్‌ భువనేశ్వర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు ఉన్నాయి. 
  • నైసర్‌–భువనేశ్వర్‌లో బయలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ బోధిస్తున్నారు.
  • సీఈబీఎస్‌లోనూ ఇవే సబ్జెక్ట్‌లలో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ అందుబాటులో ఉంది.
  • నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం ఖరారు చేసుకున్న అభ్యర్థులు.. తమ అకడమిక్‌ అర్హతలకు అనుగుణంగా ఏదో ఒక సబ్జెక్ట్‌లో పీజీ ఎంచుకోవచ్చు.
  • మేజర్‌ సబ్జెక్ట్‌తోపాటు బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ వంటి సబ్జెక్ట్‌లను మైనర్‌ సబ్జెక్ట్‌లుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది.
  • నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులు రెండు ఇన్‌స్టిట్యూట్స్‌కు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: NEST, CEBS: ఇంటర్‌తోనే ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశాలు.. పరీక్ష విధానం, అర్హతలు, విజయానికి మార్గాలు ఇలా..

నాలుగు విభాగాలు.. 200 మార్కులు

  • నెస్ట్‌ నాలుగు విభాగాలుగా(బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌) 200 మార్కులకు ఉంటుంది. ప్రతి విభాగానికి 50 మార్కు­లు కేటాయించారు. అదే విధంగా.. ప్రతి విభాగంలో 17 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 12 ప్రశ్నలు ఎంసీక్యూలుగా, అయిదు ప్రశ్నలు మల్టిపుల్‌ కరెక్ట్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. 
  • మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 2.5 మార్కులు చొప్పున,మల్టిపుల్‌ కరెక్ట్‌ ఆన్సర్‌ టైప్‌ కొశ్చన్స్‌కు నాలుగు మార్కులు చొప్పున కేటాయిస్తారు. 
  • ఇలా ప్రతి సెక్షన్‌లో 17 ప్రశ్నలతో 50 మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • మొత్తం రెండు సెషన్లుగా పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏదో ఒక సెషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. 
  • నాలుగు సెక్షన్లలో మూడు సెక్షన్లు ఎంచుకునే అవకాశం ఉంది. నాలుగు సెక్షన్లు కూడా రాయొచ్చు. 
  • మెరిట్‌ లిస్ట్‌ రూపకల్పనలో.. నాలుగు సెక్షన్లలో అత్యధిక మార్కులు పొందిన మూడు సెక్షన్లనే పరిగణనలోకి తీసుకుని అందులో పొందిన మా ర్కులను గణించి మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. 
  • ప్రతి సెక్షన్‌లోనూ కొన్ని ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.
  • కొన్ని ప్రశ్నలు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలతో ఉంటాయి. 
  • నెస్ట్‌లో స్కోర్‌ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ రూపొందించే క్రమంలో.. ప్రతి సెక్షన్‌లోనూ అభ్యర్థులు పొందాల్సిన కనీస అర్హత మార్కులను నిర్దేశించారు.

ఓవరాల్‌ కటాఫ్‌ నిబంధన

  • నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ రూపకల్పనలో సెక్షన్‌వారీగా కనీస అర్హత మార్కుల నిబంధన మాత్రమే కాకుండా.. మినిమమ్‌ అడ్మిషబుల్‌ పర్సంటైల్‌ పేరుతో ఓవరాల్‌ కటాఫ్‌ను కూడా నిర్దేశిస్తున్నారు. 
  • జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 95 పర్సంటైల్, ఓబీసీ అభ్యర్థులు 90 పర్సంటైల్, ఎస్‌సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులు 75 పర్సంటైల్‌ సాధించాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..

సీటు సాధిస్తే.. స్కాలర్‌షిప్‌

  • నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా.. నైసర్, సీఈబీఎస్‌లలో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులకు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ వ్యవధిలో.. స్కాలర్‌షిప్, ఇంటర్న్‌షిప్‌ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకం కూడా అందిస్తారు. 
  • ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ పేరిట నెలకు రూ.అయిదు వేలు చొప్పున ఏడాదికి రూ.60 వేలు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. 
  • ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌నకు అర్హత పొందని వారికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రవేశ పెట్టిన దిశ ప్రోగ్రామ్‌ ద్వారా నెలకు రూ.5000 స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 
  • ప్రతి ఏటా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు రూ.20 వేలు గ్రాంట్‌ మంజూరు చేస్తారు.

నెస్ట్‌తో మరిన్ని ప్రయోజనాలు

  • నైసర్‌–భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై –డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ పీజీ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీ ప్రవేశాల్లోనూ ప్రాధాన్యత ఉంటుంది. 
  • ఈ ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి భవిష్యత్తులో రీసెర్చ్‌ ల్యాబ్స్‌లో, సంస్థల ఆర్‌ అండ్‌ డీ సెంటర్లలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
  • భవిష్యత్తులో పీహెచ్‌డీ పట్టా అందుకుని యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా, ప్రముఖ రీసెర్చ్‌ సంస్థల్లో సైంటిస్ట్‌లుగా రూ.లక్షల వేతనంతో కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు.

పరిశోధనలకు మార్గం

  • నెస్ట్‌ ద్వారా ప్రవేశం ప్రవేశం పొందిన విద్యార్థులు.. ఐదేళ్ల వ్యవధిలో పది సెమిస్టర్లుగా ఉండే ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 
  • ఈ పది సెమిస్టర్లలోనూ.. ఆరు సెమిస్టర్లలో సదరు క్యాంపస్‌లోని ఫ్యాకల్టీ సభ్యులు చేస్తున్న రీసెర్చ్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. దీని ఆధారంగానూ అభ్యర్థులకు మార్కులు, క్రెడిట్స్‌ కేటాయిస్తారు. ఇలాంటి నిబంధన నేపథ్యంలో విద్యార్థులకు పీజీ స్థాయిలోనే రీసెర్చ్‌ దిశగా ఆసక్తిని పెంచుకునే అవకాశం, రీసెర్చ్‌ కార్యకలాపాలపై అవగాహన లభిస్తాయి.

బార్క్‌లో.. పీహెచ్‌డీ!

నెస్ట్‌ స్కోర్‌తో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో సీటు ఖరారు చేసుకున్న వారికి భవిష్యత్తులో కలిసొచ్చే మరో అంశం.. ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో ప్రవేశానికి నేరుగా ఇంటర్వ్యూకి హాజరయ్యే అవకాశం కల్పించడం. ఇందుకోసం విద్యార్థులు ఎమ్మెస్సీ కోర్సును నిర్దిష్ట మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ మార్కులను ప్రతి ఏటా బార్క్‌ నిర్దేశిస్తుంది.

చ‌ద‌వండి: After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు

నెస్ట్‌లో విజయం సాధించాలంటే

  • నెస్ట్‌లో విజయం సాధించాలంటే.. విద్యార్థులు ప్రధానంగా ఇంటర్మీడియెట్‌ స్థాయిలో తాము చదివిన అకడమిక్స్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి.
  • ప్రధానంగా..బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ విభాగాలకు సంబంధించి అడిగే ప్రశ్నలు..విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక దృక్పథం, సంగ్రహణ సామర్థ్యం, తులనాత్మక విశ్లేషణను గుర్తించేలా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఆ­యా సబ్జెక్ట్‌లకు సంబంధించి కాన్సెప్ట్‌లపై పట్టు సాధించడంతోపాటు వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగలిగే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇందుకోసం చదువుతున్న అంశాలను ప్రాక్టీస్‌ చేయడం ఎంతో లాభిస్తుంది.
  • నెస్ట్‌ ఎంట్రన్స్‌.. విభాగాల వారీగా గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నలు సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి అభ్యర్థులు పది, పదకొండు, పన్నెండు తరగతుల సీబీఎస్‌ఈ పుస్తకాలను ఔపోసన పట్టడం మేలు చేస్తుంది. ముఖ్యంగా కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి.
  • ఇలా అకడమిక్‌ సబ్జెక్ట్‌లపై కాన్సెప్ట్‌లతోపాటు అప్లికేషన్‌ దృక్పథంతో ప్రిపరేషన్‌ సాగిస్తే నెస్ట్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. 
  • జేఈఈ–మెయిన్, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు అదే ప్రిపరేషన్‌తో నెస్ట్‌కు కూడా హాజరై ప్రతిభ చూపే అవకాశం ఉంది. 

నెస్ట్‌–2023 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2023
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: 12.06.2023
  • నెస్ట్‌–2023 పరీక్ష తేదీ: 24.06.2023
  • ఫలితాల వెల్లడి: 10.07.2023
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.
  • వెబ్‌సైట్‌: https://www.nestexam.in/

చ‌ద‌వండి: After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

Published date : 06 Mar 2023 06:04PM

Photo Stories