Skip to main content

GPAT 2023 Notification: ఫార్మసీలో బెస్ట్‌ పీజీకి.. జీప్యాట్‌!

ఫార్మసీ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఫార్మసీ నిపుణుల సేవలు ఎంతో కీలకం. ఎం.పార్మసీతో ఫార్మా రంగంలో ఉజ్వల కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. బీఫార్మసీ ఉత్తీర్ణులు ఉన్నత విద్య ఎంఫార్మసీలో చేరేందుకు మార్గం.. జీప్యాట్‌! ఈ ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయిలో నైపర్‌ సహా పలు ప్రముఖ ఫార్మా ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎంఫార్మసీలో చేరేందుకు అవకాశం లభిస్తుంది. ఇటీవల జీప్యాట్‌–2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జీప్యాట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు, భవిష్యత్‌ కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం..
career opportunities in pharma sector with M.Pharmacy
  • జీప్యాట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎన్‌టీఏ
  • మాస్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి జీప్యాట్‌
  • ఎం.ఫార్మసీ పూర్తయితే విస్తృత ఉద్యోగావకాశాలు
  • జీప్యాట్‌ ద్వారా ప్రవేశం పొందితే స్కాలర్‌షిప్‌ సదుపాయం

బీ.ఫార్మసీ.. విద్యార్థుల నుంచి ఆదరణ పొందుతున్న కోర్సుల్లో ఒకటి. ముఖ్యంగా బైపీసీ విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. బీఫార్మసీ తర్వాత తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌లో ఎం.ఫార్మసీ పూర్తి చేస్తే.. ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. జాతీయ స్థాయిలోని పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎం పార్మసీలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంట్రన్స్‌.. గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(జీప్యాట్‌). జీప్యాట్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది.

జీప్యాట్‌తో ప్రయోజనాలు

  • జీప్యాట్‌ స్కోర్‌ ఆధారంగా దేశంలోని 800కు పైగా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎం ఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. 
  • దేశంలో ఫార్మా విద్యారంగంలో మేటి సంస్థలుగా పేరొందిన నైపర్‌(నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫార్మా ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌æ)ల్లో సీటు పొందాలంటే.. తొలుత జీప్యాట్‌లో అర్హత సాధించాలి. ఆ తర్వాత నైపర్‌లు నిర్వహించే నైపర్‌ జేఈఈలో ర్యాంకు సొంతం చేసుకోవాలి. 
  • జీప్యాట్‌ ఉత్తీర్ణతతో ఎం.ఫార్మసీలో చేరితే నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్‌ అందుకునే సదుపాయం ఉంది. 
  • రాష్ట్రాల పరిధిలో ఎం.ఫార్మసీ సీట్ల భర్తీలో ముందుగా జీప్యాట్‌ ఉత్తీర్ణులకే ప్రాధాన్యం లభిస్తుంది. 

చ‌ద‌వండి: GPAT 2023 Notification: గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌)-2023

అర్హత

  • నాలుగేళ్ల బీఫార్మసీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 10+2+ 4 విధానంలో బీఫార్మసీ పూర్తి చేసుకోవాలి. 2023లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

4 విభాగాలు.. 500 మార్కులు

  • ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంతో కీలకంగా నిలుస్తున్న జీప్యాట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌గా నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు విభాగాల్లో.. 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 
  • ఫార్మాస్యుటికల్‌ కెమిస్ట్రీ, అనుబంధ సబ్జెక్ట్‌లు 38  ప్రశ్నలు–152 మార్కులు; ఫార్మాస్యుటిక్స్‌ అనుబంధ సబ్జెక్ట్‌లు 38 ప్రశ్నలు–152 మార్కులు; ఫార్మకోగ్నసీ అనుబంధ సబ్జెక్ట్‌లు 10 ప్రశ్నలు–40 మార్కులు; ఫార్మకాలజీ అనుబంధ సబ్జెక్ట్‌లు 28 ప్రశ్నలు–112 మార్కులు; ఇతర సబ్జెక్టులు 11 ప్రశ్నలు–44 మార్కులకు.. ఇలా మొత్తం 125 ప్రశ్నలు–500 మార్కులకు జీప్యాట్‌ జరుగుతుంది.
  • ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌(ఒక మార్కు) నిబంధన అమల్లో ఉంది. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు.
  • పరీక్షను నిర్దేశిత తేదీలో రెండు సెషన్స్‌లో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) నిర్వహిస్తారు.

మలి దశలో ఇలా

జీప్యాట్‌లో స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు మలి దశలో.. ప్రత్యేక ప్రవేశ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. జీప్యాట్‌ అర్హతతో ఎంపార్మసీలో ప్రవేశానికి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఈ స్కోర్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి నేరుగా అడ్మిషన్‌ కల్పిస్తాయి. మరికొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు మలి దశలో గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నాయి. వాటిలోనూ చూపిన ప్రతిభ ఆధారంగా జీప్యాట్‌ స్కోర్‌కు వెయిటేజీ కల్పిస్తూ సీట్లు కల్పిస్తున్నాయి.

చ‌ద‌వండి: ఫార్మసీ విద్యార్థులకు ఎగ్జిట్ పరీక్ష

విజయం సాధించాలంటే

జాతీయ స్థాయిలో ఎంతో పోటీ నెలకొంటున్న జీప్యాట్‌లో విజయానికి అభ్యర్థులు విభాగాల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..

ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ

ఈ విభాగంలో ప్రశ్నలు ప్రాథమికంగా ఉంటాయి. కాన్సెప్టులపై అవగాహనతో సదరు ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా ఇందులో కర్బన రసాయన శాస్త్రంపై దృష్టిపెట్టాలి. ఎలక్ట్రోఫిలిక్, న్యూక్ట్రోఫిలిక్‌ రియాక్షన్స్, ఇంటర్మీడియెట్‌ రియాక్షన్స్‌ను అధ్యయనం చేయాలి. ఎస్‌ఏఆర్‌ ఆఫ్‌ స్టెరాయిడ్స్, నామ్‌నిక్లేచర్‌ అండ్‌ కెమికల్‌ మొయిటీ ఆఫ్‌ ది మెడికల్‌ డ్రగ్స్‌ గురించి అధ్యయనం చేయాలి.

ఫార్మాస్యుటిక్స్‌

ఇందులో రాణించాలంటే.. రసాయనాలు, టాబ్లెట్ల సూత్రీకరణతో మొదలుపెట్టాలి. సూక్ష్మజీవులను హతమార్చే(స్టెరిలైజేషన్‌) నైపుణ్యాలు, న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. సర్ఫేస్‌ అండ్‌ ఇంటర్‌ ఫేషియల్‌ ఫినామినా, రియాలజీ, కైనటిక్స్‌ అండ్‌ డ్రగ్స్‌ స్టెబిలిటీ, బయోఫార్మాటిక్స్‌ అండ్‌ ఫార్మకోకైనటిక్స్‌ అంశాలను ప్రత్యేక దృష్టితో చదవాలి.

ఫార్మకోగ్నసీ

పూర్తిగా థియరీ ఆధారిత ప్రశ్నలతో ఉండే ఫార్మకోగ్నసీలో రాణించాలంటే.. అభ్యర్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదివి షార్ట్‌ నోట్స్‌ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చివరి దశ ప్రిపరేషన్‌లో ప్రయోజనం ఉంటుంది. ఆయా ఔషధాలకు సంబంధించిన భావనలు, విధానాలు, ప్రభావాలు, ఉపయోగాల గురించి అధ్యయనం చేయాలి. ముఖ్యంగా గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్, వాలటైల్‌ ఆయిల్స్, రెసిన్స్, టానిన్స్, కార్బొహైడ్రేట్స్, టిష్యూ కల్చర్, హెర్బల్‌ డ్రగ్స్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

ఫార్మకాలజీ

జీప్యాట్‌లో ఎక్కువ వెయిటేజీ ఉన్న విభాగంగా ఫార్మకాలజీని పేర్కొనొచ్చు. ఇందులో డ్రగ్‌ ఇంటరాక్షన్, మెకానిజమ్స్, డ్రగ్స్‌–సైడ్‌ ఎఫెక్ట్స్‌(బాడీ పెయిన్స్‌ వంటి సాధారణ సైడ్‌ ఎఫెక్టŠస్‌ కాకుండా)ను అధ్యయనం చేయాలి. డ్రగ్స్‌ను సంక్షిప్త నామాల్లో గుర్తుంచుకొనేందుకు డ్రగ్స్‌ వర్గీకరణ పాఠ్యాంశం ఉపయోగపడుతుంది. అంకాలజీ(కీమోథెరపీ డ్రగ్స్, నూతన టెక్నాలజీలు తదితరం), న్యూరో ఫార్మకాలజీ, అరుదైన వ్యాధులు, కార్డియోవస్కులర్‌ అండ్‌ బ్లడ్‌ ప్రొడక్ట్స్‌ తదితర ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

సమస్యల సాధన

  • ఇతర సబ్జెక్ట్‌ల విషయంలో ఫార్మాస్యూటికల్‌ అనాలసిస్‌కు సంబంధించి.. భావనలను అర్థం చేసుకుంటూ చదవాలి. అదేవిధంగా వీలైనన్ని ఎక్కువ సమస్యలు సాధించాలి. ఫార్ములాలను నోట్‌ చేసుకోవాలి. యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్, మాస్‌ స్పెక్టోస్క్రోపీ, క్రొమాటోగ్రఫీ, పోలరోగ్రఫీ అండ్‌ పొలారిమెట్రీ, ఫ్లేమ్‌ ఫోటోమీటర్, కండక్టోమెట్రీ, ఆంపెరోమెట్రీ, పొటెన్షిమోమెట్రీ అంశాలపై క్షుణ్నమైన అవగాహన ఏర్పరచుకోవాలి. అంతేకాకుండా స్పెక్టోస్క్రోపీ–మాస్‌ స్పెక్టోస్క్రోపీ, యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్‌ స్పెక్టోస్క్రోపీ చాప్టర్లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. 
  • క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ డ్రగ్స్, షెడ్యూల్స్‌ ఆఫ్‌ డ్రగ్స్‌ చాప్టర్లకు వేర్వేరు నోట్సు రాసుకోవాలి. 
  • జీప్యాట్‌లో న్యూమరికల్‌ ప్రాబ్లమ్స్‌ సంఖ్య పెరుగుతున్న విషయాన్ని గుర్తించి ఈ తరహా ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. ముఖ్యంగా బయో ఫార్మాస్యుటిక్స్, డిప్రెషన్‌ ఇన్‌ ఫ్రీజింగ్‌ పాయింట్, అలిగేషన్‌ మెథడ్, డోస్‌ ఆన్‌ ది బేసిస్‌ ఆఫ్‌ బాడీ వెయిట్‌ అండ్‌ ఏజ్‌ టాపిక్స్‌పై ప్రాబ్లమ్స్‌ ఎక్కువగా అడుగుతున్నారు.
  • గత ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్టులకు హాజరవ్వడం ద్వారా జీప్యాట్‌ ప్యాట్రన్‌పై అవగాహన ఏర్పడుతుంది. వెయిటేజీ, ప్రశ్నల తీరు తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

350కు పైగా లక్ష్యంగా

మొత్తం 500 మార్కులకు నిర్వహించే జీప్యాట్‌లో.. 350కు పైగా స్కోర్‌ లక్ష్యంగా ప్రిపరేషన్‌ సాగించాలి. ఫలితంగా.. బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు సొంతం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి. గత మూడు, నాలుగేళ్లుగా ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు ఖరారు చేసుకున్న అభ్యర్థుల గణాంకాలే ఇందుకు నిదర్శనం. రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులు 125 నుంచి 200 మధ్యలో మార్కులు సాధన లక్ష్యంగా కృషి చేస్తే సీటు లభించే వీలుంటుంది. 

ఎంఫార్మసీ.. క్రేజీ స్పెషలైజేషన్లు

ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మకాలజీ, ఫార్మాస్యుటిక్స్, టాక్సికాలజీ, ఫార్మా మేనేజ్‌మెంట్, ఫార్మకోగ్నసీ స్పెషలైజేషన్‌లు పూర్తి చేస్తే ఎంఫార్మసీ తర్వాత ఉజ్వల అవకాశాలు అందుకోవచ్చు. కోర్సు పూర్తి చేసుకున్నాక డ్రగ్‌ డిస్కవరీ సంస్థలు, డ్రగ్‌ ఫార్ములేషన్‌ కంపెనీలు, బల్క్‌ డ్రగ్‌ ప్రొడక్షన్‌ సంస్థల్లో సీనియర్‌ లెవల్‌లో ఉద్యోగాలు లభిస్తాయి. జీప్యాట్‌తో పీజీ పూర్తి చేసిన తర్వాత పీహెచ్‌డీ వైపు అడుగులు వేస్తే పరిశోధన రంగంలో భవిష్యత్తు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 6, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: మార్చి 7–9, 2023
  • జీప్యాట్‌ పరీక్ష తేదీ: మే రెండో వారంలో నిర్వహించే అవకాశం
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://gpat.nta.nic.in
Published date : 27 Feb 2023 06:50PM

Photo Stories