Skip to main content

CMAT 2023: మేనేజ్‌మెంట్‌ పీజీకి మరో మార్గం.. సీమ్యాట్‌!

కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌.. సంక్షిప్తంగా సీమ్యాట్‌! దేశవ్యాప్తంగా ఉన్న.. ఏఐసీటీఈ అనుబంధ కళాశాలలు, ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎంబీఏ, పీజీడీఎం సహా.. పీజీ స్థాయిలో పలు మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఇది!! ఎన్‌టీఏ.. తాజాగా సీమ్యాట్‌–2023 దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. సీమ్యాట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...
cmat exam pattern 2023 and syllabus and preparation tips
  • వేయికిపైగా ఇన్‌స్టిట్యూట్స్‌కు సీమ్యాట్‌ స్కోర్‌ ప్రామాణికం
  • ఎంబీఏ, మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం
  • సీమ్యాట్‌తోపాటు గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలు
  • సీమ్యాట్‌–2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

మేనేజ్‌మెంట్‌లో పీజీ లేదా ఎంబీఏ ప్రోగ్రామ్‌లనగానే.. ఎక్కువ మంది విద్యార్థులు క్యాట్, ఐసెట్‌లపైనే గురిపెడతారు. వీటిలో ర్యాంకు రాకపోతే నిరాశకు గురవుతారు. అలాంటి వారికి చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.. సీమ్యాట్‌. క్యాట్, ఐసెట్‌ సన్నద్ధతతో సీమ్యాట్‌లో సులువుగా విజయం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 

వేయికిపైగా ఇన్‌స్టిట్యూట్‌లు

సీమ్యాట్‌ స్కోర్‌తో.. ప్రస్తుతం దేశంలో వేయికిపైగా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏ తదితర పీజీ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరే అవకాశముంది. ఏఐసీటీఈ అనుబంధ కళాశాలల్లో సీమ్యాట్‌ స్కోర్‌తో ఎంబీఏలో చేరొచ్చు. అదే విధంగా.. డి.వై పాటిల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌(ఐపీఈ), ఐఐఆర్‌ఎం, కె.జె.సోమయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, గ్జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీస్‌–రాంచీ తదితర ప్రముఖ ప్రైవేట్‌ విద్యాసంస్థలు కూడా సీమ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణ, కర్నాటక తదితర రాష్ట్రాలు సీమ్యాట్‌ను అధికారిక పరీక్షగా ప్రకటించాయి. దీంతో క్యాట్, ఎక్స్‌ఏటీలలో మంచి ర్యాంకు దక్కని విద్యార్థులకు సీమ్యాట్‌ చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

అర్హత

సీమ్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

చ‌ద‌వండి: CMAT 2023: కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌)-2023

అయిదు విభాగాలు.. 400 మార్కులు

  • జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే సీమ్యాట్‌ పరీక్షను మొత్తం అయిదు విభాగాల్లో 400 మార్కులకు నిర్వహిస్తారు. 
  • క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 20 ప్రశ్నలు–80 మార్కులు; లాజికల్‌ రీజనింగ్‌ 20 ప్రశ్నలు–80 మార్కులు; లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ 20 ప్రశ్నలు –80 మార్కులు; జనరల్‌ అవేర్‌నెస్‌ 20ప్రశ్నలు–80 మార్కులు; ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ 20ప్రశ్నలు–80 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది.
  • పరీక్షకు కేటాయించిన సమయం 3 గంటలు. 
  • ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి.
  • ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు.
  • నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.

మలి దశలో జీడీ, పీఐలు

సీమ్యాట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్న పలు ఇన్‌స్టిట్యూట్‌లు మలిదశలో.. గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), పర్సనల్‌ ఇంటర్వ్యూ(పీఐ) నిర్వహిస్తున్నాయి. వీటిల్లో చూపిన ప్రతిభ, పొందిన మార్కులు, సీమ్యాట్‌ స్కోర్‌కు వెయిటేజీ కల్పించి ప్రవేశాలు ఖరారు చేస్తున్నాయి. గ్రూప్‌ డిస్కషన్‌లో.. కరెంట్‌ అఫైర్స్, మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్‌ నైపుణ్యాలను పరిశీలిస్తున్నారు. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు నేరుగా సీమ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా కనీస కటాఫ్‌ను నిర్దేశించి.. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ రూపొందించి సీట్లు భర్తీ చేస్తున్నాయి. 

మెరుగైన స్కోర్‌కు మార్గాలివే
క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

గణిత, డేటా విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో మంచి స్కోర్‌ సాధించాలంటే.. అర్థమెటిక్‌–రేషియో, మిక్చర్స్, వర్క్, యావరేజ్, పర్సంటేజెస్, టైమ్‌ అండ్‌ స్పీడ్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, ఇంటరెస్ట్, బేసిక్‌ స్టాటిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా నెంబర్‌ ప్రాపర్టీస్, ప్రాబబిలిటీ, కౌంటింగ్‌ ప్రిన్సిపల్స్, జామెట్రీ, డెరివేటివ్స్‌(మ్యాగ్జిమా–మినిమా) వంటి ప్యూర్‌ మ్యాథ్స్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌కు సంబంధించి టేబుల్స్,పై ఛార్ట్స్, బార్‌ డయాగ్రమ్స్‌ అండ్‌ గ్రాఫ్స్, ఛార్ట్స్‌లను పరిశీలించడం, వాటిలోని గణాంకాలను విశ్లేషించడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకునేలా ప్రిపరేషన్‌ సాగించాలి. 

లాజికల్‌ రీజనింగ్‌

అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణను గుర్తించే విభాగం ఇది. ఇందులో లాజికల్‌ రీజనింగ్‌లోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రిపరేషన్‌లో లీనియర్, సీటింగ్, సీక్వెన్సింగ్‌ అండ్‌ అరేంజింగ్‌ విత్‌ కండిషన్స్‌ టు కోడింగ్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. స్టేట్‌మెంట్స్‌–కంక్లూజన్, లాజికల్‌ పజిల్, న్యూమరికల్‌ పజిల్, వెన్‌ డయాగ్రమ్, ట్రూ–ఫాల్స్‌ స్టేట్‌మెంట్స్, విజువల్‌ రీజనింగ్‌ టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టితో ప్రాక్టీస్‌ చేయాలి. ఇందుకోసం క్యాట్, ఎక్స్‌ఏటీ తదితర పరీక్షల పూర్వ ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

లాంగ్వేజ్‌ కాంప్రెహెన్షన్‌

ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో యూసేజ్‌ ఆఫ్‌ ఆర్టికల్స్,æయూసేజ్‌ ఆఫ్‌ నౌన్స్‌ అండ్‌ ప్రొనౌన్స్, ఆడ్జెక్టివ్స్, ఆడ్‌వెర్బ్స్, ప్రిపోజిషన్స్‌–రెగ్యులర్, ఫాలోవుడ్, సింటాక్స్, సబ్జెక్ట్‌–వెర్బ్‌ అరేంజ్‌మెంట్, సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్‌ టెన్సెస్‌ అండ్‌ కండిషనల్‌ అన్‌రియల్‌ పాస్ట్, జంబల్డ్‌ పారాగ్రాఫ్స్‌ వంటి అంశాలపై పట్టు సాధించడం ద్వారా మంచి మార్కులు సొంతం చేసుకునే వీలుంది. అదే విధంగా రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ పాసేజెస్‌ కూడా ఈ విభాగంలో ఉంటాయి. 
500 నుంచి 600 పదాలతో పాసేజ్‌లు ఇస్తారు. తర్వాత పాసేజ్‌కు సంబంధించిన ఇంటర్‌ఫియరెన్స్‌ డ్రాన్, సెంట్రల్‌ ఐడియా, ఫ్రేజెస్, ఇడియమ్స్‌ తదితరాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఈ విభాగంలో మంచి స్కోర్‌ సాధించేందుకు ప్రామాణిక ఇంగ్లిష్‌ దినపత్రికలను రోజూ చదువుతూ.. వొకాబ్యులరీ పెంచుకోవాలి. సెంటెన్స్‌ ఫార్మేషన్‌పై పట్టుసాధించాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

జనరల్‌ నాలెడ్జ్, సమకాలీన అంశాలపై అవగాహనను పరీక్షించే విభాగం ఇది. దీనికోసం స్టాండర్డ్‌ జీకే బుక్స్, న్యూస్‌ పేపర్లు్ల, వీక్లీలు, వెబ్‌సైట్స్, పిరియాడికల్స్‌ను అనుసరించాలి. వీటితోపాటు బిజినెస్‌ న్యూస్, జాతీయ, అంతర్జాతీయ అంశాలు; వార్తల్లో వ్యక్తులు; భారత రాజ్యాంగం; వివిధ దేశాలు –కరెన్సీలు; భారతదేశం –రాష్ట్రాలు; అంతర్జాతీయ సంస్థలు; ద్రవ్య, కోశ గణాంకాలు, ఇటీవల చోటు చేసుకుంటున్న సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.

ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌

ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అంశాలు మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు కీలకమని భావించి గతేడాది ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సంబంధించిన టెక్నికల్‌ టెర్మినాలజీ(సీడ్‌ ఫండింగ్, క్రౌడ్‌ ఫండింగ్, ఏంజెల్‌ ఇన్వెస్టర్స్‌ తదితర)గురించి తెలుసుకోవాలి.స్టార్టప్‌ ఇండియా,మేకిన్‌ ఇండియా వంటి పథకాల లక్ష్యాలపై అవగాహన పెంచుకోవాలి.

250కి పైగా స్కోర్‌ లక్ష్యంగా

సీమ్యాట్‌ ద్వారా టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు.. 250 నుంచి 350 మార్కులు సాధించేలా కృషి చేయాలి. గత రెండేళ్ల ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. 300కు పైగా స్కోర్‌ సాధించిన అభ్యర్థులు వేయి మందికి  పైగా ఉండగా, 250 నుంచి 300 మధ్యలో స్కోర్‌ సాధించిన అభ్యర్థుల సంఖ్య దాదాపు 10 వేలుగా ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ శ్రేణిలో స్కోర్‌ సాధించేలా కృషి చేస్తే టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం ఖరారు చేసుకునే అవకాశం ఉంటుంది. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 6, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: మార్చి 7 – 9, 2023
  • సీమ్యాట్‌ పరీక్ష తేదీ: మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌
  • పూర్తివివరాలకు వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/
Published date : 28 Feb 2023 05:14PM

Photo Stories