Skip to main content

After Common Admission Test (CAT) Exam: క్యాట్‌ తర్వాత.. ఏం చేద్దాం!

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌.. సంక్షిప్తంగా క్యాట్‌! దేశంలోని ప్రతిష్టాత్మక బీస్కూల్స్‌.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) క్యాంపస్‌ల్లో ఎంబీఏ, పీజీపీఎం, ఫెలో ప్రోగ్రామ్‌ తదితర మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో.. 2023-24లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష! జాతీయ స్థాయిలో రెండు లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు! వీరంతా క్యాట్‌ తర్వాత ఏం చేయాలి.. క్యాట్‌ కటాఫ్‌ ఎంతుంటుంది.. ఐఐఎంల మలిదశ ఎంపిక ప్రక్రియకు సన్నద్ధమవడం ఎలా.. అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. క్యాట్‌-2022 విశ్లేషణతోపాటు, మలి దశలో ఐఐఎంలు నిర్వహించే ఎంపిక ప్రక్రియ వివరాలు, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, క్యాట్‌-2023 కటాఫ్‌ అంచనా తదితర అంశాలపై విశ్లేషణ..
Career Options After Common Admission Test (CAT) Exam
  • నవంబర్‌ 27న ముగిసిన క్యాట్‌-2022
  • జాతీయ స్థాయిలో 2.2 లక్షలకు పైగా హాజరు
  • 50 శాతం మార్కులతో 99 పర్సంటైల్‌ అంచనా
  • మలి దశకు సన్నద్ధం కావాలంటున్న నిపుణులు
  • 20 ఐఐఎంలలో 12 వేలకు పైగా సీట్లు

గ్రాడ్యుయేషన్‌ కోర్సుల విద్యార్థులు ఎక్కువ మంది మేనేజ్‌మెంట్‌ కోర్సులు,ముఖ్యంగా ఐఐఎంల్లో చేరడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. దీంతో క్యాట్‌కు ప్రతి ఏటా రెండు లక్షలకు పైగా అభ్యర్థులు హాజరవుతున్నారు. అయితే ఐఐఎంల్లో క్యాట్‌ స్కోర్‌తోనే అడ్మిషన్‌ లభించదు. క్యాట్‌తోపాటు మలి దశలో గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ, రిటన్‌ ఎబిలిటీ టెస్టుల్లోనూ రాణించాల్సి ఉంటుంది.

చదవండి: IIM-CAT Notification 2022: ఐఐఎం క్యాట్‌ 2022 వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు..

మోస్తరు క్లిష్టత

  • ఈ ఏడాది నవంబర్‌ 27న మూడు స్లాట్లలో క్యాట్‌ పరీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం పరీక్ష ఓ మోస్తరు క్లిష్టతతో ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. మూడు సెక్షన్లలో క్యాట్‌ నిర్వహించగా.. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 24 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 20 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 22 ప్రశ్నలు చొప్పున మొత్తం 66 ప్రశ్నలు అడిగారు. వీటికి 198 మార్కులు కేటాయించారు. 
  • స్లాట్‌-1లో.. ఏఆర్‌సీ విభాగం ప్రశ్నలు కొంత సులభంగా, లాజికల్‌ రీజనింగ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు సులభంగా ఉన్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. 
  • స్లాట్‌-1 కంటే స్లాట్‌-2 కొంత క్లిష్టంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీఏఆర్‌సీ విభాగంలో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటున్నారు. డీఐఎల్‌ఆర్‌ విభాగం ప్రశ్నలు సులభంగా ఉన్నప్పటికీ..కాలిక్యులేషన్స్‌ చేయాల్సిన విధంగా ప్రశ్నలు అడగడంతో సమయాభావం ఎదురైందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో.. ఓ మోస్తరు క్లిష్టతతో అభ్యర్థులను తికమక పెట్టే విధంగా ప్రశ్నలు ఉన్నాయి.
  • తొలి రెండు స్లాట్లతో పోల్చితే మూడో స్లాట్‌ సులభంగా ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వీఏఆర్‌సీ, డీఐఎల్‌ఆర్‌ విభాగాల నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. దీంతో ఈ స్లాట్‌లో పరీక్షకు హాజరైన వారు అధిక శాతం ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం లభించింది. అయితే క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగం మాత్రం క్లిష్టంగా ఉందంటున్నారు.

50 శాతం మార్కులతో 99 పర్సంటైల్‌

మొత్తం 198 మార్కులకు జరిగిన పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారు 99 పర్సంటైల్‌ సాధించే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా 73-77 మార్కులు సాధించిన వారు 97కు పైగా పర్సంటైల్, 63-67 మార్కులతో 95 శాతం పర్సంటైల్‌ పొందే అవకాశాలున్నాయి. ఈ స్థాయిలో మార్కులు సాధిస్తామనే అంచనాకు వచ్చిన అభ్యర్థులు ఐఐఎంలు నిర్వహించే మలి దశ ఎంపిక ప్రక్రియకు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

మలి దశ ఎంపిక ఎలా

ఐఐఎంలు క్యాట్‌ స్కోర్‌తోపాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. క్యాట్‌ స్కోర్‌ కేవలం ఆయా ఐఐఎంలలో తమకు ఆసక్తి ఉన్న ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగపడే సాధనంగానే నిలుస్తోంది. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐఐఎంలు మలి దశలో నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలలోనూ ప్రతిభ చూపితేనే ప్రవేశాలు ఖరారు అవుతాయి.

కటాఫ్‌ పర్సంటైల్‌

అన్ని ఐఐఎంలు మలిదశలో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ.. ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తాయి. క్యాట్‌లో నిర్దిష్ట కటాఫ్‌ పర్సంటైల్‌ ఉన్న వారికే దరఖాస్తుకు అవకాశం కల్పిస్తాయి. తుది జాబితా రూపకల్పన, గత రెండు, మూడేళ్లుగా ప్రవేశాలు ఖరారైన విద్యార్థుల పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. 93 శాతంపైగా పర్సంటైల్‌ ఉంటేనే ప్రవేశం లభిస్తోంది. ఐఐఎం-కోల్‌కత, ఐఐఎం-అహ్మదాబాద్‌ వంటి తొలితరం ఐఐఎంలలో ప్రవేశం పొందాలంటే.. 99కి పైగా పర్సంటైల్‌ ఉంటేనే సాధ్యమని గత ప్రవేశాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

చదవండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం

ఈ మూడు ముఖ్యమే

క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. తదుపరి దశలో రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలోనూ విజయం సాధిస్తే.. ఐఐఎంల్లో ప్రవేశం ఖరారైనట్లే.

గ్రూప్‌ డిస్కషన్‌

మలి దశ ఎంపికకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఆయా ఐఐఎం క్యాంపస్‌లలో నిర్వహించే ప్రక్రియ.. గ్రూప్‌ డిస్కషన్‌. అభ్యర్థులను బృందాలుగా ఏర్పాటుచేసి.. ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానిపై చర్చించమంటారు. కోర్‌ నుంచి కాంటెంపరరీ వరకు.. ఈ అంశాలు ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన అంశాలపైనా ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌

గ్రూప్‌ డిస్కషన్‌ తర్వాత అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన మరో పరీక్ష.. రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌. ఇందులో నిర్దిష్టంగా ఏదైనా ఒక అంశాన్ని పేర్కొని.. అభ్యర్థులు తమ అభిప్రాయాలు లేదా సలహాలు వ్యక్తీకరించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక అంశానికి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పదాల మధ్యలో అభ్యర్థులు తమ సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ అంశాలు కూడా.. సబ్జెక్ట్‌ నాలెడ్జ్, సోషల్‌ అవేర్‌నెస్‌ సమ్మిళితంగా ఉంటున్నాయి. 

చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ

గ్రూప్‌ డిస్కషన్, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌లో విజయం సాధించిన అభ్యర్థులు.. చివరిగా ఎదుర్కోవాల్సిన ప్రక్రియ.. పర్సనల్‌ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో.. సదరు విద్యార్థికి మేనేజ్‌మెంట్‌ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు ఎంచుకున్న మార్గాలు తదితర అంశాలను నిపుణులైన ప్రొఫెసర్స్‌ కమిటీ అడిగి తెలుసుకుంటుంది.

వెయిటేజీ విధానం

  • ఐఐఎంలలో ఆయా ప్రోగ్రామ్‌లలో అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసే క్రమంలో.. క్యాట్‌ స్కోర్, జీడీ, ఆర్‌ఏటీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలలో ప్రతిభతోపాటు మరెన్నో అంశాలను ప్రామాణికంగా తీసుకుంటూ వాటికి కూడా నిర్దిష్ట వెయిటేజీ ఇస్తున్నారు. 
  • మొత్తం వంద మార్కుల వెయిటేజీ విధానంలో 35 నుంచి 50 శాతం మేరకు జీడీ, పీఐలకు వెయిటేజీ కల్పిస్తున్నారు. 
  • డైవర్సిటీ వెయిటేజీ పేరుతో జండర్‌ డైవర్సిటీ, కల్చరల్‌ డైవర్సిటీలకు మూడు నుంచి అయిదు శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. 
  • పలు ఐఐఎంలు అకడమిక్‌ వెయిటేజీ నిబంధన కూడా అమలు చేస్తున్నాయి.
  • పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు ఒక్కో దానికి ప్రత్యేకంగా వెయిటేజీ ఉంటోంది. అకడమిక్‌ వెయిటేజీలోనే ప్రొఫెషనల్‌ క్వాలిఫికేషన్స్‌ ఉన్న వారికి ప్రత్యేక వెయిటేజీని ఐఐఎంలు కల్పిస్తున్నాయి. ఈ వెయిటేజీ రెండు నుంచి మూడు శాతం మధ్యలో ఉంటోంది.
  • వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న అభ్యర్థులకు అయిదు నుంచి పది శాతం మధ్యలో వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ వెయిటేజీ కూడా అభ్యర్థులు పని చేస్తున్న రంగం, మొత్తం అనుభవం గడించిన సంవత్సరాల ఆధారంగా ఉంటోంది. 
  • ఐఐఎంలలో నాన్‌-ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అకడమిక్‌ డైవర్సిటీకి కూడా పెద్ద పీట వేస్తున్నారు.

జెండర్‌ వెయిటేజీ

  • జెండర్‌ వెయిటేజీ.. ఐఐఎంలు అనుసరిస్తున్న మరో వినూత్న విధానం. మేనేజ్‌మెంట్‌ విద్యలో మహిళా విద్యార్థులు చేరేలా ప్రోత్సహించేందుకు ఈ జెండర్‌ డైవర్సిటీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. 
  • ఐఐఎం కోల్‌కత జెండర్‌ డైవర్సిటీ వెయిటేజీ పేరుతో మహిళా విద్యార్థులకు అదనంగా మూడు మార్కులు కేటాయిస్తోంది. 
  • ఐఐఎం లక్నో విద్యార్థినులకు రెండు పాయింట్లు కేటాయిస్తోంది.
  • ఐఐఎం రోహ్‌తక్‌ జెండర్‌ డైవర్సిటీ, నాన్‌-ఇంజనీరింగ్‌ ఫ్యాక్టర్స్‌ పేరుతో మొత్తం ఎంపిక ప్రక్రియలో 30పాయింట్లు కేటాయిస్తుండటం విశేషం
  • ఐఐఎం రాయ్‌పూర్‌ 20 శాతం వెయిటేజీని జండర్‌ డైవర్సిటీకి కేటాయిస్తోంది.
  • ఐఐఎం-ఉదయ్‌పూర్‌ 15 పాయింట్లు; ఐఐఎం- కాశీపూర్‌ మూడు పాయింట్లు కేటాయిస్తున్నాయి.

'క్యాట్‌'కు గరిష్టంగా 40 శాతం

తుది జాబితా రూపకల్పనతో క్యాట్‌ స్కోర్‌కు లభిస్తున్న వెయిటేజీ 40 శాతంగా∙ఉంటోంది. గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు 40 నుంచి 50 శాతం వెయిటేజీని ఐఐఎంలు ఇస్తున్నాయి. ప్రొఫైల్, పని అనుభవం తదితర అంశాలకు దాదాపు 20 శాతం మేరకు వెయిటేజీ లభిస్తోంది. క్యాట్‌ స్కోర్‌లో అధిక శాతం వెయిటేజీ సొంతం చేసుకోవాలన్నా.. వెయిటేజీ గణనలో తమ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలన్నా.. అభ్యర్థులు సదరు ఐఐఎంలు పేర్కొన్న విధంగా క్యాట్‌లో సెక్షనల్‌ కటాఫ్‌లు, మొత్తం కటాఫ్‌ల పరంగా కనీస కటాఫ్‌ మార్కులు పొందాల్సి ఉంటుంది. 

దాదాపు 12 వేల సీట్లు

ఐఐఎం క్యాంపస్‌లలో పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ మొదలు..ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ వరకు అన్ని కోర్సులకు కలిపి దాదాపు 12 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో, క్యాట్‌ ఉత్తీర్ణతతో సీటు లభించే పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ సీట్ల సంఖ్య అయిదు వేల వరకు ఉంటోంది.
 

Published date : 14 Dec 2022 07:17PM

Photo Stories