Skip to main content

IT Crisis: ఇంత భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపా... వేలమంది ఒకేసారి ఇంటికి.. మైక్రోసాఫ్ట్‌ భారీ షాక్‌..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే.. ఆర్థికమాంద్యం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా బడా కంపెనీలు ఉద్యోగులను ఇళ్లకు సాగనంపుతున్నాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతున్నాయి.
Layoff

ఉదయం ఆఫీసుకు వచ్చిన వారికి ... సాయంత్రానికి కంపెనీలు షాక్‌ ఇస్తున్నాయి. సెటిల్‌మెంట్‌ చేసేసి తలుపులు మూసేస్తున్నాయి. ప్రస్తుతానికి అమెకారిలో తొలగింపులు అధికంగా జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ ఇండియా వరకు రావడానికి ఎంతో సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు. 

చ‌ద‌వండి: దినదినగండంలా ‘‘ఐటీ’’ ఉద్యోగాలు...!

ఇప్పటికే అమెజాన్, గూగుల్, మెటా సంస్థలు తమ ఉద్యోగులకు టాటా చెప్పేశాయి. తాజాగా ఆ జాబితాలోకి మైక్రోసాఫ్ట్‌ చేరింది. మొత్తం సిబ్బందిలో ఐదు శాతానికి సమానమైన 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించడానికి సిద్ధమైంది. తొలగింపు ప్రక్రియ నేటి నుంచే(జనవరి 18) ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఆర్, ఇంజినీరింగ్‌ విభాగాల్లో అధికంగా తొలగింపులు చేపట్టనుంది.   

వచ్చే రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్లు ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాలకు మైక్రోసాఫ్ట్‌ సైతం అతీతమేమీ కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ సంస్థల్లో సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ పరోక్షంగా తొలగింపులపై సంకేతాలిచ్చారు. 

చ‌ద‌వండి: తుమ్మితే ఊడుతున్న‌ ఐటీ జాబ్స్‌... ఐఐటీ కొలువులకూ భద్రత లేదు..?

వ్యక్తిగత కంప్యూటర్ల పరిశ్రమలో కొన్ని త్రైమాసికాల నుంచి నిర్లిప్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఇది విండోస్‌ సహా మైక్రోసాఫ్ట్‌ ఉత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు క్లౌడ్‌ వ్యాపారమైన అజూర్‌తో కంపెనీ వృద్ధిని కొనసాగించడం కష్టతరంగా మారింది. గత ఏడాది జులైలోనే కొంతమంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్‌ ఇంటికి పంపింది. అక్టోబరులోనూ సుమారు 1,000 మందికి ఉద్వాసన పలికింది.

గత ఏడాది జూన్‌  30 నాటికి.. మైక్రోసాఫ్ట్‌లో 2,21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1,22,000 మంది అమెరికాలో, 99,000 మంది ఇతర దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు వాషింగ్టన్‌  రాష్ట్రంలోని బెలెవూలో ఉన్న 26 అంతస్తుల సిటీ సెంటర్‌ ప్లాజాలోని కార్యాలయ లీజును మైక్రోసాఫ్ట్‌ పునరుద్ధరించడం లేదని వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published date : 18 Jan 2023 01:28PM

Photo Stories