Skip to main content

IT Crisis: షేర్‌చాట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింత.. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న కంపెనీలు..!

ద్రవ్యోల్బణం,స్టాక్‌ మార్కెట్‌లలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా టెక్‌ కంపెనీలు కాస్ట్‌ కటింగ్‌ విధానాన్ని అవలంబిస్తున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ షేర్‌ చాట్‌ భవిష్యత్‌లో తలెత్తే మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 20 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

గూగుల్, టెమాసెక్‌ వంటి టెక్‌ దిగ్గజ కంపెనీల పెట్టుబడులతో బెంగళూరు కేంద్రంగా మొహల్లా టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యానికి చెందిన షేర్‌చాట్, షార్ట్‌ వీడియో కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఆర్థిక మాద్యం భయాలతో పెట్టుబడి దారులు ప్రకటనలపై వెచ్చించే ఖర్చును భారీగా తగ్గించారు. దీంతో ప్రకటనల మీద ఆదాయాన్ని గడించే మొహల్లా టెక్‌ను నష్టాలు చుట్టుముట్టాయి. ఈ తరుణంలో 5 బిలియన్ల డాలర్ల మార్కెట్‌ వ్యాల్యూషన్‌  ఉన్న షేర్‌చాట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, షార్ట్‌ వీడియో యాప్‌ ‘మోజ్‌’లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 500 మందిని తొలగించే అవకాశం ఉంది. 

ఉద్యోగుల తొలగింపుపై ఆ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ..‘మా కంపెనీ చరిత్రలో కఠినమైన, బాధాకరమైన నిర్ణయాలను తీసుకునే సమయం ఆసన్నమైంది. సంస్థ ప్రారంభం నుంచి మాతో జర్నీ చేస్తున్న 20 శాతం మందిని వదులుకోవాల్సి వస్తోంది. పెట్టుబడుల కారణంగా కంపెనీలు తమ వైఖరిని మార్చుకోవాలి. లాభదాయకమైన ప్రాజెక్ట్‌లలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి’ అని అన్నారు.  

డిసెంబర్‌ 2022లో మొహల్లా టెక్‌ తన ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ జీత్‌11ని షట్‌డౌన్‌ చేసి దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరో సారి ఉద్యోగుల విషయంలో హైర్‌ అండ్‌ ఫైర్‌ పాలసీని అప్లయ్‌ చేస్తోంది.

Published date : 16 Jan 2023 07:04PM

Photo Stories