Film Industry: సినీ రంగంలో కెరీర్ అవకాశాలు.. నైపుణ్యాలు, అర్హతలు..
- సినీ ప్రపంచంలో విభిన్న కొలువులు
- నటన నుంచి డైరక్షన్ వరకు అవకాశాలు
- సృజనాత్మకత ఉన్న వారికి చక్కటి వేదిక
కెరీర్ వినూత్నంగా ఉండాలి, నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందాలి అనుకునే వారికి చలన చిత్ర రంగం ఒక ప్రధాన వేదికగా నిలుస్తోంది. ప్రతిభ, సృజనాత్మకత ఉంటే.. సినిమా రంగంలో అవకాశాలకు కొదవలేదు. ఎందుకంటే.. సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ప్రధాన వినోద సాధనంగా మారింది. సిల్వర్ స్క్రీన్‌పై చూసే సినిమాలైనా.. ఓటీటీలో వస్తున్న చిత్రాలైనా.. వెబ్ సిరీస్‌లు.. ఏవైనా సరే... వినోదానికి మారుపేరుగా మారుతున్నాయి. దీంతో ఈ రంగం విస్తరిస్తూ.. విస్తృత అవకాశాలకు వేదికగా మారుతోంది.
అన్ని విభాగాల్లో
సినిమా అనగానే గుర్తొచ్చేది.. నటీ నటులు, హీరో, హీరోయిన్‌లు. కాని ఇటీవల కాలంలో డైరెక్టర్ ఎవరు.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.. స్క్రీన్ ప్లే రైటర్ ఎవరు.. అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలు పెట్టారు. వీటి ఆధారంగా సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో అంచనా వేస్తున్నారు. దీంతో.. సినిమా నిర్మాణ సంస్థలు.. వెండి తెరపై కనిపించే నటీనటుల విషయంలోనే కాకుండా.. టెక్నికల్‌గా అన్ని హంగులు దిద్దుతూ ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు యత్నిస్తున్నాయి.
ఆ నాలుగు ప్రధానంగా
సినీ రంగంలో విస్తృత కెరీర్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నేటికీ ప్రధానంగా నాలుగు విభాగాలు ముందంజలో ఉంటున్నాయి. అవి..యాక్టింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్. కారణం.. ఈ నాలుగు విభాగాలుæసినిమా విజయానికి దోహదం చేస్తున్నాయనే అభిప్రాయమే. వీటిలో రాణిస్తే.. పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకోవడం సులభమనే భావన నెలకొంది.
యాక్టింగ్
సినీ రంగంలో కెరీర్ పరంగా ఎక్కువ మంది ఆసక్తి చూపే విభాగం..యాక్టింగ్. ఎందుకంటే.. వెండితెరపై కనిపిస్తూ ప్రేక్షకుల మదిలో చిర స్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉండడమే. ఇలాంటి వారికి యాక్టింగ్‌లో నైపుణ్యాలు అందించేందుకు ఇప్పుడు ఎన్నో కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
టాలెంట్ ముఖ్యం
నటుడిగా రాణించేందుకు.. శిక్షణతోపాటు వ్యక్తిగత ప్రతిభ కూడా ముఖ్యమే. శిక్షణ కోర్సులు నటనకు సంబంధించిన మెళకువలు నేర్పుతాయి. కానీ..ఒక వ్యక్తి నటుడిగా రాణించాలంటే.. స్వతహాగా టాలెంట్ ఉండాలి. సన్నివేశానికి తగినట్లుగా హావభావాలు పండించే ప్రతిభ, నైపుణ్యం అవసరం. నటుడిగా కెరీర్ ప్రారంభించి.. మంచి పేరు సంపాదించుకుంటే.. సినిమా రంగమే కాకుండా, టెలివిజన్, ఓటీటీ సిరీస్‌లలోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నటుడిగా ఫేమ్ అయితే లక్షల్లో పారితోషికం అందుతుంది. టెలివిజన్ ఇండస్ట్రీలో ఎపిసోడ్‌ల ప్రాతిపదికగా ఒక్కో ఎపిసోడ్‌కు రూ.పది వేల నుంచి రూ.30 వేల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు.
డైరెక్షన్
సినిమాకు కెప్టెన్ లాంటి వ్యక్తి.. దర్శకుడు. డైరెక్షన్ విభాగానికి సంబంధించి అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కో-డైరెక్టర్ వంటి కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ విభాగంలో నైపుణ్యం సాధించాలంటే.. వాస్తవిక దృక్పథం, శ్రమ, సహనం అవసరం. కారణం.. కథ, నటీనటుల ఎంపిక, మ్యూజిక్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఆర్ట్, పబ్లిసిటీ.. ఇలా అన్నీ విభాగాలను సమర్థవంతంగా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
డైరెక్టర్‌గా క్లిక్ అయితే.. పేరు, డబ్బు, హోదా.. ఇలా అన్నీ ఒకదాని వెంట ఒకటి వచ్చి చేరుతాయి. అందుకే.. ఇప్పుడు యువత ఈ విభాగం వైపు దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ సంస్కృతి పెరిగిన నేపథ్యంలో ముందుగా దర్శకత్వ విభాగంలో తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు.
డైరెక్టింగ్ విభాగంలో.. సినిమా దర్శకత్వంతోపాటు పలు ఉపాధి వేదికలు అందుబాటులో ఉన్నాయి. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు, టీవీ సీరియళ్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్స్.. వీటిలో ముందు వరుసలో ఉంటున్నాయి.
దర్శకత్వ నైపుణ్యాలు అందించే కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, మాస్టర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, పీజీ డిప్లొమా ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్. వీటిని పలు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి.
ఎడిటింగ్
సినీ రంగంలో మరో ప్రధానమైన విభాగం.. ఎడిటింగ్. వాస్తవ రన్ టైమ్ నాలుగైదు గంటలు ఉండే సినిమాని రెండున్నర, మూడు గంటలకు కుదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయా సన్నివేశాల మధ్య అనుసంధానం కోల్పోకుండా.. సీక్వెన్స్ దెబ్బతినకుండా చూస్తూ.. ప్రేక్షకులు మెచ్చేలా సన్నివేశాలని కూర్పు చేయడం సవాలుతో కూడుకున్న పని. ఈ పనిని సమర్థంగా చేయగలిగే వారే ఎడిటర్స్.
ఎడిటింగ్ విభాగంలో రాణించాలంటే.. సృజనాత్మకత, ఓర్పు, సహనం ప్రధానం. ఎందుకంటే.. నిర్మాత, దర్శకుడి ఆలోచన సరళిని తెలుసుకుంటూ.. అందుకు అనుగుణంగా సన్నివేశాలను కూర్పు చేయాల్సి ఉంటుంది. వీరికి టెక్నికల్ నైపుణ్యాలు కూడా అవసరమవుతున్నాయి. ఎడిటింగ్‌లో పలు సంస్థలు డిప్లొమా నుంచి బ్యాచిలర్ స్థాయి వరకు పలు కోర్సులను అందిస్తున్నాయి.
ఎడిటింగ్ కోర్సులు: డిప్లొమా ఇన్ ఫిల్మ్ ఎడిటింగ్, డిప్లొమా ఇన్ వీడియో ఎడిటింగ్, డిప్లొమా ఇన్ వీడియో ఎడిటింగ్ అండ్ సౌండ్ రికార్డింగ్, పీజీ డిప్లొమా ఇన్ ఎడిటింగ్.
ఉపాధి వేదికలు: ఎడిటింగ్ కోర్సు పూర్తిచేసిన వాళ్లు సినీ, టీవీ, వార్తా ఛానళ్లు, ప్రకటన సంస్థలు, మల్టీ మీడియా సంస్థలు, Ðð బ్ డిజైనింగ్ కంపెనీలు, నెట్ పోర్టల్స్ వంటి చోట్ల ఉద్యోగాలు పొందొచ్చు. అదే విధంగా ఫ్రీలాన్స్ ఎడిటర్‌గా స్వయం ఉపాధికీ అవకాశాలున్నాయి. డిజిటల్ వీడియోలు, యూట్యూబ్ ఛానెళ్లకు సైతం పని చేయొచ్చు.
చదవండి: ‘ఫొటోగ్రఫీ’ కెరీర్... యువతకు చక్కటి ఉపాధి వేదిక
ఫొటోగ్రఫీ
సినీ పరిభాషలో సినిమాటోగ్రఫీగా పేర్కొనే విభాగం ఇది. ఇందులోనూ ప్రస్తుతం విస్తృత కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. ఒక సన్నివేశాన్ని హృద్యంగా చిత్రీకరించే బాధ్యత ఫోటోగ్రాఫర్‌దే. ఇటీవల కాలంలో సినీ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం, వందలకొద్దీ సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో నిపుణులైన వారికి డిమాండ్ పెరుగుతోంది. ఫొటోగ్రఫీకి సంబంధించి టెక్నికల్ నైపుణ్యాలు కూడా సొంతం చేసుకుంటే.. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, అసోసియేట్ సినిమాటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ స్థాయికి చేరుకోవచ్చు.
చదవండి: సంగీత సాగరంలో ఓలలాడించే.. డీజే
మ్యూజిక్.. కెరీర్ క్లిక్
ఒక సినిమా హిట్, ఫ్లాప్‌లో కీలక ప్రాత పోషించే విభాగం.. మ్యూజిక్. సినిమా విడుదల కంటే ముందే రిలీజయ్యే సంగీతం, పాటలు.. సినిమాకు ఆదరణను, చూడాలనే ఆసక్తిని పెంచుతాయి. కేవలం మ్యూజిక్‌తోనే హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే డైరెక్టర్లు సైతం మ్యూజిక్ విషయంలో రాజీపడకుండా వ్యవహరిస్తారు. అందుకే ఈ విభాగంలో నైపుణ్యం సొంతం చేసుకున్న వారికి కెరీర్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇందులో రాణించాలంటే.. సంగీతంపై సహజమైన ఆసక్తి ఉండాల్సిందే. దీనికంటే ముందుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ గ్రూప్‌లో సభ్యులుగా చేరి.. తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ఈ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్స్ స్థాయికి చేరుకోవచ్చు.
మ్యూజిక్ విభాగంలో బ్యాచిలర్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బీఏ మ్యూజిక్; బీఎఫ్‌ఏ తబలా, మ్యూజిక్; బీఏ తబలా; ఎంఏ మ్యూజిక్; ఎంఫిల్ ఇన్ మ్యూజిక్; పీహెచ్‌డీ ఇన్ మ్యూజిక్ వంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు ఆం్ర«ధా యూనివర్సిటీ, నాగార్జున, కాకతీయ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలు.. బీఏ మ్యూజిక్ కోర్సును అందిస్తున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు కూడా శిక్షణ ఇస్తున్నాయి.
స్క్రీన్ ప్లే
సినిమా చూసే రెండున్నర మూడు గంటల సమయంలో ప్రేక్షకుడు కళ్లప్పగించి చూడాలి. ఎక్కడా కూడా బోర్ ఫీలవకూడదు. ఒక సినిమాకు సంబంధించి ఆయా సన్నివేశాల పట్టు సడలకుండా.. ప్రతి సీన్‌ను ఉత్కంఠ కలిగించేలా.. కథలో బిగి తగ్గకుండా.. అందంగా, ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా ఉండేలా చేసేది స్క్రీన్‌ప్లే. ప్రస్తుతం స్క్రీన్ ప్లే రచయితలకు పలు కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి సంబంధించి నైపుణ్యాలు పొందేందుకు అకడమిక్ కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. స్క్రీన్ ప్లే రైటింగ్, రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్పెషలైజేషన్లతో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా వరకు పలు కోర్సులు అభ్యసించే వీలుంది.
ఇన్‌స్టిట్యూట్‌లు ఇవే
- సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్.
- ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.
- ముంబై డిజిటల్ ఫిల్మ్ అకాడమీ.
- ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్.
- యూనివర్సిటీల విషయంలో ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలు కూడా ఇంటర్ అర్హతగా డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు అందిస్తున్నాయి. స్థానికంగా పలు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు సైతం ఆయా విభాగాల్లో శిక్షణ కోర్సులను నిర్వహిస్తున్నాయి.
చలన చిత్ర రంగం.. కెరీర్ ముఖ్యాంశాలు
- సినీ రంగంలో పెరుగుతున్న అవకాశాలు
- యాక్టింగ్ నుంచి స్క్రీన్ ప్లే వరకు పలు కోర్సులు
- సినీ రంగంతోపాటు ఓటీటీ, డిజిటల్ డాక్యుంటెరీ హౌస్‌లు, యూ ట్యూబ్ ఛానెల్స్ సంస్థల్లో అవకాశాలు
- ప్రఖ్యాత ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్.