Skip to main content

కళాత్మక కెరీర్‌కు ఫైన్‌ ఆర్ట్స్‌.. వివ‌రాలు తెలుసుకోండిలా..

ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సుల్లో చేరుతుంటారు. కానీ ఆసక్తి, సృజనాత్మకత, కళాత్మక దృష్టి ఉంటే.. ఆర్ట్స్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ వంటి కోర్సులతోనూ ఉజ్వల కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎఫ్‌ఏయూ డిజైన్, ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులను అందిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ.. ఏడీసెట్‌–2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు, అందిస్తున్న యూనివర్సిటీలు, ప్రవేశ విధానాలు, అర్హతలు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం...

ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఏపీ ప్రభుత్వం 2020లో నెలకొల్పిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, తెలంగాణలో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీల్లో.. పలు ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో.. బీఎఫ్‌ఏ–పెయింటింగ్, బీఎఫ్‌ఏ–స్కల్ప్‌చర్‌; బీఎఫ్‌ఏ–యానిమేషన్‌; బీఎఫ్‌ఏ–అప్లయిడ్‌ ఆర్ట్స్‌; బీఎఫ్‌ఏ–ఫొటోగ్రఫీ; బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌–ఇంటీరియర్‌ డిజైన్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి నాలుగేళ్లు. ఇంటర్మీడియెట్‌ అర్హతతో ఈ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ల ద్వారా ఎంపిక..

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి.. జేఎన్‌ఏఎఫ్‌ఏయు, డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎఫ్‌ఏయూలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
  • డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎఫ్‌ఏయూ.. ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌); జేఎన్‌ఏఎఫ్‌ఏయూ.. ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఏడీఈఈ) ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి.
  • అర్హత: ఈ రెండు ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎఫ్‌ఏడీఈఈ పరీక్ష విధానం..
జేఎన్‌ఏఎఫ్‌ఏయూనివర్సిటీ నిర్వహించే ఎఫ్‌ఏడీఈఈ (ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌) పరీక్ష.. ఆయా కోర్సులకు వేర్వేరుగా ఉంటుంది. ఈ పరీక్ష 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆగస్టు 13,14 తేదీల్లో జరుగనుంది.

బీఎఫ్‌ఏ (అప్లయిడ్‌ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్‌చర్‌ అండ్‌ యానిమేషన్‌)..

పేపర్‌ మార్కులు సమయం
పేపర్‌ ఎ– మెమొరీ డ్రాయింగ్‌ అండ్‌ కలరింగ్‌ 100 90 ని.
పేపర్‌ బి–ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌ 50 50 ని.
పేపర్‌ సి– ఆబ్జెక్ట్‌ డ్రాయింగ్‌ 100 90 ని.

బీఎఫ్‌ఏ ఫోటోగ్రఫీ..

పేపర్‌ మార్కులు సమయం
పేపర్‌ డి–కంపోజిషన్‌ అండ్‌
విజువల్‌ కమ్యూనికేషన్‌ 100 90 ని.
పేపర్‌ ఇ– ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌ 50 50 ని.

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌)
..

పేపర్‌ మార్కులు సమయం
పేపర్‌–ఎఫ్‌ 200 3 గం.
  • ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు జేఎన్‌ఏఎఫ్‌ఏయూ క్యాంపస్‌ కళాశాలతో పాటు అనుబంధ కళాశాలల్లోనూ ప్రవేశం పొందొచ్చు.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎఫ్‌ఏయూలో కోర్సులు.. సీట్లు..

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌) – 60 సీట్లు
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (పెయింటింగ్‌) – 40 సీట్లు
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(అప్లయిడ్‌ ఆర్ట్స్‌) – 40 సీట్లు
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(స్కల్ప్‌చర్‌) – 40 సీట్లు
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (యానిమేషన్‌) – 60 సీట్లు
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(ఫొటోగ్రఫీ) – 40 సీట్లు.

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కోర్సులు.. సీట్లు..

  • బీఎఫ్‌ఏ అప్లయిడ్‌ ఆర్ట్స్‌– 35 సీట్లు
  • బీఎఫ్‌ఏ పెయింటింగ్‌ – 20 సీట్లు
  • బీఎఫ్‌ఏ స్కల్ప్‌చర్ – 10 సీట్లు
  • బీఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ – 30 సీట్లు.
  • జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో సెల్ఫ్‌ సపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ పేరుతో ఆయా కోర్సులకు అదనపు సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి ఫీజు కొంత ఎక్కువగా ఉంటుంది.

ఫైన్‌ ఆర్ట్స్‌.. కెరీర్‌ అవకాశాలు..
బ్యాచిలర్‌ స్థాయి ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులతోనే ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే సంబంధిత విభాగాల్లో పీజీ స్పెషలైజేషన్‌ కోర్సుల్లో చేరొచ్చు. ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవచ్చు. సాఫ్ట్‌వేర్, మల్టీనేషనల్‌ కంపెనీల్లో సైతం అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వర్‌టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలు, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్, మల్టీ మీడియా, యానిమేషన్‌ తదితర సంస్థల్లో కొలువులు లభిస్తాయి.

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌)..
ఇంటిని లేదా ఆఫీస్‌ సముదాయాన్ని అంతర్గతంగా చూడముచ్చటగా, అందంగా తీర్చిదిద్దే నైపుణ్యమే.. ఇంటీరియర్‌ డిజైన్‌. ప్రస్తుతం నగరాల్లోని ప్రజలు ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీంతో ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి డిమాండ్‌ పెరుగుతోంది. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు ఉత్తీర్ణులు.. ఫర్నిచర్‌ డిజైనింగ్, ఎగ్జిబిషన్‌ డిజైనర్, లైటింగ్‌ డిజైనర్, కిచెన్‌ డిజైనర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్చరల్‌ టెక్నాలజిస్ట్, ప్రొడక్ట్‌ డిజైనర్, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.

స్కల్ప్‌చర్‌ (శిల్ప కళ)..
ప్రాచీన కాలం నుంచే వెల్లివిరిస్తున్న మరో ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం.. శిల్పకళ. ప్రస్తుతం బీఎఫ్‌ఏ స్కల్ప్‌చర్‌ కోర్సు పూర్తిచేసిన యువతకు ఉపాధి అవకాశాల పరంగా అనుకూల పరిస్థితి నెలకొంది. కోర్సుల అనంతరం కొంతమంది ఇంటి వద్దే శిల్పాలు రూపొందిస్తుంటే.. మరికొందరు ప్రత్యేకంగా హోం స్టూడియోలు నిర్వహిస్తున్నారు. వీరంతా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజన్సీలు, వ్యక్తులకు శిల్పాలను సరఫరా చేస్తున్నారు. చక్కటి పరిశీలనా నైపుణ్యం, భావోద్వేగాలు, ఆలోచనలకు రూపం ఇవ్వగలిగే నేర్పు ఉన్నవారికి ఈ కోర్సు చక్కగా సరిపోతుంది.

అప్లయిడ్‌ ఆర్ట్‌..
ఆర్ట్‌ డైరెక్టర్‌ కావాలనుకునేవారికి చక్కటి కోర్సు.. అప్లయిడ్‌ ఆర్ట్‌! ఈ కోర్సులో.. డ్రాయింగ్, పెయింటింగ్, క్లే మోడలింగ్‌లో బేసిక్స్‌తో పాటు విజువల్‌ కమ్యూనికేషన్, గ్రాఫిక్స్‌ తదితర అంశాలపై మెలకువలు నేర్పుతారు. గ్రాఫిక్‌ డిజైన్, అడ్వర్‌టైజింగ్, లోగో డిజైనింగ్‌ల్లో ప్రావీణ్యత సంపాదించడం ద్వారా.. సినిమా రంగంలో ఆర్ట్‌ డెరైక్టర్‌గా, సెట్‌ డిజైనర్‌గా, విజువలైజర్‌గా అవకాశాలు అందుకోవచ్చు. వస్త్ర పరిశ్రమ, ఆభరణాల డిజైనింగ్, కలినరీ ఆర్ట్, గేమ్‌ డిజైనర్, యాడ్‌ ఫిలిం ఏజన్సీలలో స్టోరీ బోర్డ్‌ ఆర్టిస్ట్‌గా, క్రియేటివ్‌ ఆర్ట్‌ డెరైక్టర్‌గా అవకాశాలు లభిస్తాయి.

యానిమేషన్‌..
ప్రస్తుతం యానిమేషన్‌ రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్, ఇంటర్నెట్‌తో యువత గేమింగ్‌పై ఆసక్తి పెంచుకుంటోంది. దాంతో యానిమేషన్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. యానిమేష¯ŒSకు సంబంధించి సినిమాలు, టెలివిజన్, అడ్వర్‌టైజింగ్‌ విభాగాలు ప్రధాన ఉపాధి వేదికలు.

పెయింటింగ్‌ (చిత్రకళ)!
ప్రకృతి అందాలకు చూడచక్కని రూపం ఇచ్చే కళ.. పెయింటింగ్‌. పెయింటింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసిన వారు తమ సృజనాత్మకతను జోడించి.. అద్భుతమైన పెయింటింగ్స్‌ రూపొందించే నైపుణ్యం పొందుతారు. పెయింటింగ్‌లో ఆయిల్‌ పెయింట్,వాటర్‌ కలర్‌ పెయింట్, ఆక్రిలిక్‌ పెయింట్, టెంపెరా పెయింట్‌ వంటి వాటికి మంచి ఆదరణ ఉంది. పెయింటింగ్‌ ప్రస్తుతం యువతకు మంచి కెరీర్‌ మార్గంగా నిలుస్తోంది. ఈ కోర్పు పూర్తిచేసిన వారు కేంద్రీయ విద్యాలయం, నవోదయ, సైనిక్‌ స్కూల్‌ తదితర ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. ఫ్రీలాన్స్‌ ఆర్టిస్ట్‌గా, సెట్‌ డిజైనర్‌గా కెరీర్‌లో స్థిరపడొచ్చు.

ఫొటోగ్రఫీ..
ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉజ్వల అవకాశాలు అందుకునే వీలుంది. కోర్సు అభ్యసించే సమయంలో ఫొటోగ్రఫీలో మెళకువలతోపాటు డిజిటల్‌ ల్యాబ్‌లు, గ్రీన్‌ మ్యాట్‌ స్టూడియోలను ఏర్పాటు చేస్తారు. ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ, ఆటోమొబైల్‌ ఫొటోగ్రఫీ, కార్పొరేట్‌ ఫొటోగ్రఫీ, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ విభాగాల్లో ఉపాధి పొందొచ్చు.

Published date : 09 Aug 2021 02:48PM

Photo Stories