Skip to main content

Joint Entrance Test 2023 Notification: ఈ కోర్సులతో.. వెండితెర కెరీర్‌!

సినిమా ప్రపంచం.. అందరూ ఆసక్తి చూపే రంగం! చలన చిత్రాలపై యువతకు ఎంతో క్రేజ్‌!! రీల్‌ లైఫ్‌లో సత్తా చాటి.. రియల్‌లైఫ్‌లో కెరీర్‌ వెలుగులు సొంతం చేసుకోవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కాని ఎంతటి సృజనాత్మకత ఉన్నా.. దానికి మెరుగులు దిద్దుకుంటేనే.. వెండితెరపై వెలుగులీనే అవకాశం దక్కుతుంది! అలాంటి చలన చిత్ర రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించే ఎఫ్‌టీటీఐ, సత్యజిత్‌రే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశానికి చక్కటి మార్గం.. జెట్‌!! ఇటీవల జాయింట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(జెట్‌) 2022-23 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. జెట్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తున్న కోర్సులు, అడ్మిషన్‌ విధానం, ప్రవేశ పరీక్ష, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం..
Joint Entrance Test 2023 Notification
  • ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంక్షిప్తంగా.. ఎఫ్‌టీటీఐ.
  • సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐగా సుపరిచితం.
    గత కొన్ని దశాబ్దాలుగా సినీ రంగంలోని 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించి దాదాపు అన్ని విభాగాల్లోనూ అకడమిక్‌ కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తూ.. ఈ రంగానికి ఎందరో ప్రముఖులను పరిచయం చేసిన ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిల్లో చేరి తమకు ఆసక్తి ఉన్న విభాగంలోని కోర్సులు పూర్తి చేసుకుంటే.. సినీ, టీవీ రంగాల్లో ఆన్‌-స్క్రీన్, ఆఫ్‌-స్క్రీన్‌ అవకాశాలు స్వాగతం పలుకుతాయనడంలో సందేహం లేదు. 

16 ప్రోగ్రామ్‌లు

ఎఫ్‌టీటీఐ నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా.. ఎఫ్‌టీటీఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలలో.. పీజీ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, యూజీ సర్టిఫికెట్‌ పేరుతో 16 ప్రోగ్రామ్‌లో సీట్లు భర్తీ చేస్తారు. వీటిని గ్రూప్‌-ఎ, బి, సిలుగా వర్గీకరించారు.

గ్రూప్‌-ఎ కోర్సులు

  • పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌; వ్యవధి మూడేళ్లు; ఇన్‌స్టిట్యూట్‌- ఎఫ్‌టీటీఐ.
  • పీజీ డిప్లొమా ఇన్‌ స్క్రీన్‌ యాక్టింగ్‌; వ్యవధి-రెండేళ్లు; ఇన్‌స్టిట్యూట్‌-ఎఫ్‌టీటీఐ.
  • పీజీ డిప్లొమా ఇన్‌ స్క్రీన్‌ రైటింగ్‌(ఫిలిం, టీవీ, వెబ్‌ సిరీస్‌); వ్యవధి-రెండేళ్లు; ఇన్‌స్టిట్యూట్‌-ఎఫ్‌టీటీఐ.
  • యూజీ సర్టిఫికెట్‌ ఇన్‌ యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ డిజైన్‌; వ్యవధి-మూడేళ్లు, ఇన్‌స్టిట్యూట్‌-ఎఫ్‌టీటీఐ.
  • పీజీ డిప్లొమా ఇన్‌ యానిమేషన్‌ సినిమా; వ్యవధి-మూడేళ్లు, ఇన్‌స్టిట్యూట్‌- ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ.
  • పీజీ డిప్లొమా ఇన్‌ ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌; వ్యవధి-మూడేళ్లు, ఇన్‌స్టిట్యూట్‌-ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ.
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌; వ్యవధి - రెండేళ్లు, ఇన్‌స్టిట్యూట్‌-ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ.

చ‌ద‌వండి: ‘ఫొటోగ్రఫీ’ కెరీర్... యువతకు చక్కటి ఉపాధి వేదిక

గ్రూప్‌-బి కోర్సులు

  • పీజీ డిప్లొమా ఇన్‌ డైరెక్షన్‌ అండ్‌ స్క్రీన్‌ ప్లే రైటింగ్, వ్యవధి-మూడేళ్లు, ఇన్‌స్టిట్యూట్‌- ఎఫ్‌టీటీఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ.
  • పీజీ డిప్లొమా ఇన్‌ సినిమాటోగ్రఫీ,వ్యవధి-మూ డేళ్లు, ఇన్‌స్టిట్యూట్‌-ఎఫ్‌టీటీఐ,ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ.
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఎడిటింగ్, వ్యవధి-మూడేళ్లు, ఇన్‌స్టిట్యూట్‌-ఎఫ్‌టీటీఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ.
  • పీజీ డిప్లొమా ఇన్‌ సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ సౌండ్‌ డిజైన్, వ్యవధి-మూడేళ్లు, ఇన్‌స్టిట్యూట్‌-ఎఫ్‌టీటీఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ.

గ్రూప్‌-సి కోర్సులు

  • పీజీ సర్టిఫికెట్‌ కోర్సులు: డైరెక్షన్‌; ఎలక్ట్రానిక్‌ సినిమాటోగ్రపీ; వీడియో ఎడిటింగ్‌; సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజనీరింగ్‌; 
  • పీజీ డిప్లొమా కోర్సులు: డైరెక్షన్‌ అండ్‌ ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఈడీఎం; సినిమాటోగ్రఫీ ఫర్‌ ఈడీఎం; ఎడిటింగ్‌ ఫర్‌ ఈడీఎం; సౌండ్‌ ఫర్‌ ఈడీఎం; రైటింగ్‌ ఫర్‌ ఈడీఎం.

చ‌ద‌వండి: సంగీత సాగరంలో ఓలలాడించే.. డీజే

అర్హతలు

  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. మూడేళ్ల వ్యవధిలోని పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్,యూజీ సర్టిఫికెట్‌ ఇన్‌ యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ డిజైన్‌ కోర్సులకు మాత్రం ప్రత్యేక అర్హత ప్రమాణాలను నిర్దేశించారు. 
  • పీజీ డిప్లొమా ఇన్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: అప్లైడ్‌ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఇంటీరియర్‌ డిజైన్‌ లేదా సంబంధిత విభాగాల్లో ఫైన్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • యూజీ సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ డిజైన్‌: ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
  • పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికెట్‌ కోర్సులకు బ్యాచిలర్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండు పేపర్లు..100 మార్కులు

  • ఎఫ్‌టీటీఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలలోని పైన పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న జాయింట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ రెండు పేపర్లుగా, 100 మార్కులకు ఉంటుంది. వివరాలు..
  • పేపర్‌-1: ఈ పేపర్‌ను పార్ట్‌-ఎ, పార్ట్‌-బిలుగా మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. 
  • పార్ట్‌-ఎలో.. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ, అల్లయిడ్‌ ఆర్ట్స్, లిటరేచర్, జనరల్‌ అవేర్‌నెస్, ఎన్విరాన్‌మెంటల్‌ అవేర్‌నెస్, ఆర్ట్, కల్చర్, మీడియా విభాగాలకు సంబంధించి జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలుంటాయి. పార్ట్‌-ఎలో మొత్తం 20 ప్రశ్నలు (20 మార్కులు) అడుగుతారు.
  • పార్ట్‌-బిలో అభ్యర్థులు పేర్కొన్న సబ్జెక్ట్‌ సంబంధిత అంశాలుంటాయి. ఈ విభాగంలో మొత్తం 15 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 30 మార్కులకు పార్ట్‌-బి నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: Film Industry: సినీ రంగంలో కెరీర్‌ అవకాశాలు.. నైపుణ్యాలు, అర్హతలు..

పేపర్‌-2 ఇలా

  • జెట్‌లో కీలకమైన పేపర్‌-2లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగంలో డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఒక సుదీర్ఘ వివరణాత్మక సమాధానం ఇవ్వాల్సిన విధంగా ప్రశ్న అడుగుతారు. దీనికి 20 మార్కులకు కేటాయించారు.
  • రెండో విభాగంలో.. స్కెచెస్, ఫొటోగ్రాఫ్స్‌కు సంబంధించిన డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు, షార్ట్‌ నోట్స్‌ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ఆరు ప్రశ్నలు ఇచ్చి..అందులో మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు చొప్పున మూడు ప్రశ్నలు 30 మార్కులు ఉంటాయి.
  • ఇలా మొత్తం రెండు పేపర్లు కలిపి 100 మార్కులు(పేపర్‌-1- 50 మార్కులు; పేపర్‌-2-50 మార్కులు)కు పరీక్ష నిర్వహిస్తారు.
  • పేపర్‌-1ను ఒక గంట వ్యవధిలో, పేపర్‌-2 రెండు గంటల వ్యవధిలో మొత్తం మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.

మలిదశ ఎంపిక ప్రక్రియ

  • జెట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా.. మలిదశలో ఎఫ్‌టీటీఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలు ఆడిషన్, ఓరియెంటేషన్, ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహిస్తాయి. ఆడిషన్‌ ప్రక్రియ కేవలం స్క్రీన్‌ యాక్టింగ్‌ కోర్సులకే ఉంటుంది.
  • మలిదశ ప్రక్రియకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో.. జెట్‌ పేపర్‌-2 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు పేపర్‌-1లో తప్పనిసరిగా నిర్దిష్ట అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

తుది జాబితా ఇలా

రాత పరీక్షలో పొందిన మార్కులు, మలి దశలో సాధించిన మార్కులను క్రోడీకరించి.. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి ప్రాథమ్యాలను సేకరించి.. అందుబాటులోని సీట్లు, అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ప్రతి గ్రూప్‌ నుంచి ఒక కోర్సుకు

ఎఫ్‌టీటీఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలలోని కోర్సులను మూ డు గ్రూప్‌లుగా విభజించిన నేపథ్యంలో..అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు ప్రతి గ్రూప్‌ నుంచి ఒక కోర్సుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

ఉజ్వల అవకాశాలు

  • ఎఫ్‌టీటీఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐలలోని కోర్సులు పూర్తి చేసుకుంటే.. సంబంధిత విభాగాల్లో విస్తృత అవకాశాలు సొంతం చేసుకునే నైపుణ్యం లభిస్తుంది. యాక్టింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్, ఫొటోగ్రఫీ, స్క్రీన్‌ ప్లే, సౌండ్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
  • కేవలం సినీ రంగంలోనే కాకుండా.. టెలివిజన్‌ విభాగంలోనూ కొలువులు లభిస్తున్నాయి. అదే విధంగా ఇటీవల కాలంలో ఓటీటీ కల్చర్‌ విస్తరిస్తూ.. పలు వెబ్‌ సిరీస్‌లు విడుదలవుతున్న నేపథ్యంలో.. వాటిలోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితోపాటు ప్రభుత్వ రంగంలో దూరదర్శన్, లోక్‌సభ, రాజ్యసభ ఛానెళ్లలోనూ టెక్నికల్, నాన్‌-టెక్నికల్‌ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకునే వీలుంది. 

ప్రతిభ ప్రధానం

సినీ రంగంలో గుర్తింపు పొందాలంటే.. వ్యక్తిగత ప్రతిభ ఎంతో ముఖ్యం. సన్నివేశానికి తగినట్లుగా యాక్టింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, స్క్రీన్‌ ప్లే, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ వంటి వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు పర్సనల్‌ టాలెంట్‌ అవసరం. ప్రతిభ, ప్రొడక్షన్‌ హౌస్‌ని బట్టి ఆయా విభాగాల్లో నెలకు రూ.50 వేల వరకూ అందుకునే అవకాశం ఉంది.

ఉపాధి వేదికలు

సినీ, టెలివిజన్‌ సంబంధిత కోర్సులు పూర్తి చేసిన వారికి సినీ, టీవీ రంగాలు, వార్తా ఛానళ్లు, ప్రకటన సంస్థలు, మల్టీ మీడియా సంస్థలు, Ðð బ్‌ డిజైనింగ్‌ కంపెనీలు, నెట్‌ పోర్టల్స్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 4, 2023
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: మార్చి 10 - మార్చి 17, 2023
  • జెట్‌ పరీక్ష తేదీలు: మార్చి 18 - 19(మార్చి 18న గ్రూప్‌-ఎ కోర్సులకు, మార్చి 19 ఉదయం 9 నుంచి 12 వరకు గ్రూప్‌-బి కోర్సులకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు గ్రూప్‌-సి కోర్సులకు పరీక్ష).
  • తెలుగు రాష్ట్రాల్లో జెట్‌ పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://applyadmission.net/jet2022_23/
Published date : 21 Feb 2023 04:48PM

Photo Stories