Skip to main content

AFCAT 2022: వాయుసేనలో కొలువు.. శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకు స్టైపెండ్‌

AFCAT 2022 Recruitment Notification
AFCAT 2022 Recruitment Notification

సవాళ్లతో కూడిన కెరీర్‌ను కోరుకునేవారికి సరైన వేదిక.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌. వాయుసేనలో ప్రవేశించడం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశంతోపాటు ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. అందుకు చక్కటి మార్గం.. ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌క్యాట్‌). దీనిద్వారా ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ బ్రాంచ్, గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచ్‌ల్లో కమిషన్డ్‌ ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాల్లో చేరొచ్చు. తాజాగా ఏఎఫ్‌క్యాట్‌–2022కు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఏఎఫ్‌క్యాట్‌ వివరాలు, ఉద్యోగాలు–అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం..

  • ఏఎఫ్‌క్యాట్‌ 2022కు నోటిఫికేషన్‌ విడుదల 
  • ఆన్‌లైన్‌ టెస్ట్, ఏఎఫ్‌ఎస్‌బీ స్టేజ్‌–1,2 పరీక్షల ద్వారా ఎంపిక
  • శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకు పైగా స్టైపెండ్‌

ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌క్యాట్‌)ద్వారా వాయుసేనలో కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేస్తారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), పర్మనెంట్‌ కమిషన్‌(పీసీ) ప్రాతిపదికన ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏఎఫ్‌క్యాట్‌ ప్రతి ఏటా రెండుసార్లు జరుగుతుంది. ఏఎఫ్‌క్యాట్‌–2022 ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌) బ్రాంచ్‌ల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో 10శాతం సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

  • మొత్తం పోస్టుల సంఖ్య: 317

ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ ఖాళీలు

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌– 77.
గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌) బ్రాంచ్‌: ఏరోనాటికల్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్‌): పర్మనెంట్‌ కమిషన్‌–19, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌–76; ఏరోనాటికల్‌ ఇంజనీర్‌(మెకానికల్‌): పర్మనెంట్‌ కమిషన్‌–07, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌–27.
గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌) బ్రాంచ్‌: అడ్మిన్‌: పర్మనెంట్‌ కమిషన్‌–10, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌–41; లాజిస్టిక్స్‌: పర్మనెంట్‌ కమిషన్‌–8, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌–31;
అకౌంట్స్‌: పర్మనెంట్‌ కమిషన్‌–4, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌–17.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ఖాళీలు 
బ్రాంచ్‌: ఫ్లయింగ్‌: ఖాళీలు: సీడీఎస్‌ఈ ఖాళీల్లో 10 శాతం సీట్లను పర్మనెంట్‌ కమిషన్‌ కింద, ఏఎఫ్‌క్యాట్‌ ఖాళీల్లో 10 శాతం సీట్లను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద భర్తీ చేస్తారు. 

చ‌దవండి: NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

అర్హతలు

  • ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. 
  • గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌) పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. 
  • గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌) విభాగంలో.. అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అకౌంట్స్‌ బ్రాంచ్‌ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో బీకాం/బీబీఏ తదితర విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • వయసు: ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు 2023 జనవరి 1 నాటికి 20–24ఏళ్లు, గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచ్‌కు 20–26ఏళ్లు ఉండాలి. 
  • నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 1.6 కిలో మీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో పరుగెత్తాలి. 10 పుష్‌ అప్స్, 3 చిన్‌ అప్స్‌ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. 

పరీక్ష విధానం

  • ఏఎఫ్‌క్యాట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ ఇన్‌ ఇంగ్లిష్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్, మిలిటరీ అప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
  • టెక్నికల్‌ బ్రాంచ్‌ ఎంచుకున్న అభ్యర్థులు ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌(ఈకేటీ) పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనిలో 50 ప్రశ్నలు–150 మార్కులకు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. పరీక్ష సమయం 45 నిమిషాలు. దీనిలో మెకానికల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
  • ఏఎఫ్‌క్యాట్, ఈకేటీలను ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలోనే నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే ఉంటుంది. 
  • నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.


చ‌దవండి: డిగ్రీతో డిఫెన్స్‌ కొలువు.. శిక్షణ‌లోనే రూ.56 వేల‌కు పైగా స్టయిఫండ్‌..

ఎంపిక ఇలా

ఏఎఫ్‌క్యాట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సిద్ధం చేస్తుంది. వారితోపాటు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఏఎఫ్‌ఎస్‌బీ) ఆహ్వానించి మలిదశ పరీక్షలు నిర్వహించి.. మెడికల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తుంది. 

శిక్షణ

ఏఎఫ్‌ఎస్‌బీ సిఫార్సు చేసిన అభ్యర్థులు మెడికల్‌ టెస్టులను కూడా దాటితే.. వారికి శిక్షణ ప్రారంభిస్తారు. తాజా ఏఎఫ్‌క్యాట్‌కు సంబంధించి 2023 జనవరి మొదటి వారంలో శిక్షణ మొదలవుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌) బ్రాంచ్‌కు దాదాపు 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌) బ్రాంచ్‌కు దాదాపు 52 వారాలపాటు శిక్షణ కొనసాగుతుంది.

స్టైపెండ్‌/వేతనాలు

శిక్షణ సమయంలో ఏడాదిపాటు రూ.56,100ల నిర్దిష్ట మొత్తాన్ని స్టైపెండ్‌గా పొందుతారు. కమిషన్డ్‌ ఆఫీసర్‌గా చేరిన తర్వాత లెవల్‌ 10 కింద నెలకు రూ.56,100–రూ.1,77,500 పేస్కేలు, ఎంఎస్‌పీ రూ.15,500 లభిస్తాయి. ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తులకు చివరి తేది: 2021 డిసెంబర్‌ 30
పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 12, 13, 14
వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT

ప్రిపరేషన్‌ ఇలా 

  • ఏఎఫ్‌క్యాట్‌ను దేశంలోని కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావిస్తారు. భారత వైమానిక దళంలో అత్యున్నత స్థానంలో పనిచేసే అవకాశం కల్పించే ఈ పరీక్షకు అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఏఎఫ్‌క్యాట్‌ పరీక్షకు ప్రత్యేక సన్నద్ధత తప్పనిసరి. 
  • పరీక్ష ప్రిపరేషన్‌ ప్రారంభించే ముందే ఏఎఫ్‌క్యాట్‌ పరీక్ష విధానం, మార్కుల విధానంపై అవగాహన ఏర్పరచుకోవాలి. సిలబస్‌లోని అన్ని సబ్జెక్టులు, అంశాలను పూర్తిస్థాయిలో ప్రిపేర్‌ అవ్వాలి. 
  • గత ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్టులు ప్రాక్టీస్‌ చేయాలి. గత పరీక్షల్లో కటాఫ్‌ స్కోరులను పరిశీలించి.. స్వీయ అంచనాకు రావాలి. మెరుగైన స్కోరు వచ్చేవరకు ప్రాక్టీస్‌ కొనసాగించాలి.
  • ఇంగ్లిష్‌లో కాంప్రహెన్షన్, ఎర్రర్‌ డిటెక్షన్, సెంటెన్స్‌ కంప్లీషన్‌/సరైన పదాన్ని పూరించడం, పర్యాయపదాలు,వ్యతిరేకపదాలు,పదజాలం,ఇడియ మ్స్, పదబంధాల పరీక్షలను సాధన చేయాలి. 
  • జనరల్‌ అవేర్‌నెస్‌లో భాగంగా చరిత్ర, భూగోళశాస్త్రం, పౌరశాస్త్రం, రాజకీయాలు, కరెంట్‌ అఫైర్స్,పర్యావరణం, రక్షణ, కళలు, సంస్కృతి, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించేందుకు 6 నుంచి 12వ తరగతి వరకూ.. ఎన్‌సీఈఆర్‌టీ చరిత్ర, భౌగోళిక శాస్త్రం సబ్జెక్టుల పుస్తకాలను చదవాలి. రెండు ప్రామాణిక వార్తాపత్రికలను రెగ్యులర్‌గా చదవాలి. 
  • న్యూమరికల్‌ ఎబిలిటీలో దశాంశ భిన్నం, కాలం–పని, సగటు, లాభం–నష్టం, శాతం, నిష్పత్తి–అనుపాతం, సాధారణ వడ్డీ, కాలం–దూరం(రైళ్లు/పడవలు–స్ట్రీమ్‌లు)లలోని సమస్యలను సాధన చేయాలి. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. ఇతర సబ్జెక్టులలోని ప్రశ్నలు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో అడుగుతారు. 
  • ఏఎఫ్‌క్యాట్, ఈకేటీ ప్రాక్టీస్‌ టెస్ట్‌ కోసం https://careerindianairforce.cdac.in  లేదా https://afcat.cdac.in చూడొచ్చు.


చ‌దవండి: Defence Courses

Published date : 09 Dec 2021 05:48PM

Photo Stories