IIFT MBA(IB) Entrance Test: అంతర్జాతీయ నైపుణ్యాలకు ఐఐఎఫ్‌టీ.. పూర్తి వివరాలు ఇవే..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్.. సంక్షిప్తంగా.. ఐఐఎఫ్‌టీ!! కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) అందించే.. ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. ఐఐఎఫ్‌టీ ఎంబీఏ(ఐబీ) ప్రవేశ పరీక్షలో విజయం ద్వారా అడ్మిషన్ లభిస్తుంది. 2023-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ(ఐబీ)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్‌టీ ప్రత్యేకత, సీట్లు, ఎంపిక ప్రక్రియ, ప్రవేశ పరీక్ష వివరాలు తెలుసుకుందాం..
- అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంబీఏ కోర్సు
- ఢిల్లీ, కోల్‌కతలలో ఐఐఎఫ్‌టీ క్యాంపస్‌లు
- 2023-25కుగాను ప్రారంభమైన ప్రవేశ ప్రక్రియ
- డిసెంబర్ 18న పరీక్ష నిర్వహించనున్న ఎన్‌టీఏ
ఐఐఎఫ్‌టీ.. దాదాపు అరవై ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ ఆధ్యరంలో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్. అంతర్జాతీయ వాణిజ్య నిర్వహణకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రత్యేకంగా నెలకొల్పిన విద్యాసంస్థ ఇది. ప్రస్తుతం ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ(ఐబీ) పూర్తిచేసిన విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.
రెండు క్యాంపస్‌లు
ఢిల్లీ ప్రధాన క్యాంపస్‌గా ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్.. తర్వాత కోల్‌కతలోనూ మరో క్యాంపస్‌ను నెలకొల్పింది. రెండు క్యాంపస్‌లలో కలిపి ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)లో 725 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోనూ కొత్తగా క్యాంపస్‌ను నెలకొల్పారు. ఇక్కడ ఇంకా ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రవేశ పెట్టలేదు. ప్రస్తుతం అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సును మాత్రమే అందిస్తున్నారు.
ఎంట్రన్స్ ద్వారా ప్రవేశం
ఐఐఎఫ్‌టీ-ఢిల్లీ, కోల్‌కత క్యాంపస్‌లలోని ఎంబీఏ(ఐబీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రత్యేకంగా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. తాజాగా 2023-25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్‌కు సంబంధించి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో డిసెంబర్ 18న ఈ పరీక్ష జరుగనుంది.
నాలుగు విభాగాలు
ఐఐఎఫ్‌టీ-ఎంబీఏ(ఐబీ)ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో మొత్తం నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ అనాలసిస్, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వెర్బల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.
మలి దశలో.. జీడీ, పీఐ
- ఎంబీఏ(ఐబీ) ప్రవేశ పరీక్షలో నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన వారితో మెరిట్ జాబితా రూపొందిస్తారు. సదరు అభ్యర్థులకు మలి దశలో మరో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- మలి దశ ఎంపిక ప్రక్రియలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
- ఈ ప్రక్రియలోనూ విజయం సాధించిన వారికి ప్రవేశాలు ఖరారు చేస్తారు.
వెయిటేజీ విధానం
- ఐఐఎఫ్‌టీ ఎంబీఏ(ఐబీ)లో మలి దశ ప్రక్రియకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నారు.
- ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్ష స్కోర్‌కు 73 పాయింట్లు, పదో తరగతిలో పొందిన మార్కులకు పది స్కోర్ పాయింట్లు, ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కులకు పది స్కోర్ పాయింట్లు, అకడమిక్ డైవర్సిటీ పేరిట నాన్-ఇంజనీరింగ్ అభ్యర్థులకు అయిదు స్కోర్ పాయింట్లు, జండర్ డైవర్సిటీ పేరుతో మహిళా అభ్యర్థులకు రెండు స్కోర్ పాయింట్లు చొప్పున కేటాయించారు.
- ఈ వెయిటేజీ విధానానికి అనుగుణంగా అభ్యర్థులను మలిదశ ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు.
తుది జాబితాలోనూ
- మలి దశలో జీడీ, పీఐ, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లు ముగిసిన తర్వాత తుది జాబితా రూపకల్పనలోనూ వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నారు.
- ఐఐఎఫ్‌టీ స్కోర్‌కు 45 పాయింట్లు, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌కు 10 పాయిట్లు, గ్రూప్ డిస్కషన్‌కు 10 పాయింట్లు, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 పాయింట్లు, జండర్ డైవర్సిటీకి 2 పాయింట్లు, అకడమిక్ డైవర్సిటీకి 2 పాయింట్లు, పని అనుభవానికి 3 పాయింట్లు, పదో తరగతిలో మార్కులకు 4 పాయింట్లు, ఇంటర్మీడియెట్‌లో ప్రతిభకు 4 పాయింట్లు చొప్పున మొత్తం 100 పాయింట్లకు వెయిటేజీని గణిస్తారు.
- ఈ వెయిటేజీ విధానానికి అనుగుణంగా.. అభ్యర్థులు పొందిన స్కోర్‌ను క్రోడీకరించి తుది జాబితా రూపొందించి ఎంబీఏ(ఐబీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు ఖరారు చేస్తారు.
విజయానికి ఇలా
ఐఐఎఫ్‌టీ-ఎంబీఏ(ఐబీ) ఎంట్రన్స్ టెస్ట్‌లో విజయానికి అభ్యర్థులు విభాగాల వారీగా నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్వాంటిటేటివ్ అనాలిసిస్
ఈ విభాగం మ్యాథమెటికల్, అర్థమెటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలంటే.. అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్-టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్ మ్యాథ్స్, జామెట్రీ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వెర్బల్ ఎబిలిటీ
ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడిగే రీడింగ్ కాంప్రహెన్షన్‌లో రాణించాలంటే.. అసెంప్షన్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా వెర్బల్ ఎబిలిటీలో స్కోర్ కోసం యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్ గ్రామర్‌పై దృష్టిపెట్టాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్ పారాగ్రాఫ్స్‌లను ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్
అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక విశ్లేషణను పరిశీలించే విభాగం ఇది. ఇందులో మెరుగైన స్కోర్ సాధించేందుకు టేబుల్స్,గ్రాఫ్స్, చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్‌లో రాణించేందుకు క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ అవేర్‌నెస్
ఈ విభాగానికి సంబంధించి అభ్యర్థులు సమకాలీన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా జాతీయ,అంతర్జాతీయంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లోని తాజా పరిణామాలు, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ చర్యలు, బ్యాంకింగ్ విధానం తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
మలి దశ కూడా ముఖ్యమే
- రిటెన్ ఎబిలిటీ టెస్ట్: నిర్దిష్టంగా ఏదైనా ఒక అంశాన్ని పేర్కొని అభ్యర్థుల అభిప్రాయం చెప్పమంటారు. దీనికోసం సబ్జెక్ట్ నాలెడ్జ్, సోషల్ అవేర్‌నెస్ సొంతం చేసుకోవాలి. ఇంగ్లిష్ దినపత్రికల వ్యాసాలు, ఎడిటోరియల్స్ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
- గ్రూప్ డిస్కషన్: గ్రూప్ డిస్కషన్‌లో రాణించేందుకు.. కోర్ నుంచి కాంటెంపరరీ వరకు ముఖ్యమైన అంశాలపై పట్టుసాధించాలి. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
- పర్సనల్ ఇంటర్వ్యూ: గ్రూప్ డిస్కషన్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్‌లో విజయం సాధించిన వారు చివరిగా ఎదుర్కోవాల్సిన ప్రక్రియ.. పర్సనల్ ఇంటర్వ్యూ.సదరు అభ్యర్థికి మేనేజ్‌మెంట్ విద్య పట్ల ఉన్న వాస్తవ ఆసక్తి, అతని భవిష్యత్తు లక్ష్యాలు, వాటిని అందుకునేందుకు ఎంచుకున్న మార్గాలు తదితర అంశాలను నిపుణులైన ప్రొఫెసర్స్ కమిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఐఐఎఫ్‌టీలో చేరడానికి కారణాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి స్పష్టత పెంచుకోవాలి.
ఆకర్షణీయ ప్యాకేజీలతో ఆఫర్లు
ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ(ఐబీ) పూర్తి చేసిన అభ్యర్థులకు అద్భుత ప్యాకేజీలతో ఆఫర్లు లభిస్తున్నాయి. గతేడాది క్యాంపస్ డ్రైవ్స్‌లో సగటు వార్షిక వేతనం రూ.21 లక్షలుగా నమోదైంది. అత్యధిక వార్షిక వేతనం రూ.46.5 లక్షలుగా ఉంది. దాదాపు 117 సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఆఫర్లు ఖరారు చేశాయి. ఇంటర్న్‌షిప్ కోసం నిర్వహించే సమ్మర్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లోనూ సగటు స్టయిఫండ్ రూ.1.61 లక్షలుగా ఉండటం విశేషం. అత్యధిక స్టయిఫండ్ రూ.3.2 లక్షలుగా ఉంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 14, 2022
- దరఖాస్తులో సవరణలకు అవకాశం: నవంబర్ 16 - నవంబర్ 20
- ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్ష తేదీ: డిసెంబర్ 18, 2022
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://iift.nta.ac.in