Skip to main content

Career After Inter BiPC: బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల.. కెరీర్‌ అవకాశాలు ఇవే..

నర్సింగ్‌.. వైద్య రంగంలో మహోన్నతమైన వృత్తిగా గుర్తింపు! అలాంటి నర్సింగ్‌Š కెరీర్‌పై ఆసక్తి కలిగిన ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు భారత ఆర్మీ చక్కటి అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఆరు కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ కోర్సులో ప్రవేశం దక్కితే.. ఆర్మీలో ఉద్యోగం ఖాయమైనట్లే!! తాజాగా 2023 సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్మీలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు.. ప్రవేశ ప్రక్రియ.. కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం..
Career After Inter BiPC: bsc nursing course in indian army
 • 2023 సంవత్సరానికి మొదలైన ప్రవేశ ప్రక్రియ
 • జాతీయ స్థాయిలో ఆరు కళాశాలల్లో 220 సీట్లు
 • నీట్‌ ర్యాంకు ఆధారంగా మలి దశ ఎంపిక
 • కోర్సు అనంతరం ఆర్మీలో కమిషన్డ్‌ ర్యాంకుతో కొలువు
 • రూ.15,600-రూ.39,400 శ్రేణితో ప్రారంభ వేతనం

ఇండియన్‌ ఆర్మీ ప్రత్యేకంగా.. జాయింట్‌ మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ పేరుతో.. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీస్‌ విభాగం ద్వారా నర్సింగ్‌ కోర్సులను నిర్వహిస్తోంది. కోర్సు అనంతరం వారికి ఇండియన్‌ ఆర్మీలోనే కొలువులు ఖరారు చేస్తోంది. ఇండియన్‌ మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ అందించే బీఎస్సీ నర్సింగ్‌లో చేరడం ద్వారా ఇంటర్మీడియెట్‌తోనే నర్సింగ్‌ కెరీర్‌ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మెడికల్‌ కోర్సులు లక్ష్యంగా నీట్‌లో ఉత్తీర్ణత సాధించినా.. సీటు అవకాశాలు చేజారిన వారికి చక్కటి ప్రత్యామ్నాంగా ఈ కోర్సును పేర్కొనొచ్చు.

ఆరు కళాశాలలు.. 220 సీట్లు

 • ప్రస్తుతం మొత్తం ఆరు నర్సింగ్‌ కళాశాలల్లో 220 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అవి..
 • కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌-ఏఎఫ్‌ఎంసీ పుణె-40 సీట్లు.
 • కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌-కమాండ్‌ హాస్పిటల్, ఈస్ట్రన్‌ కమాండ్, కోల్‌కత-30 సీట్లు
 • కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌-ఇండియన్‌ నేవల్‌ హాస్పిటల్‌ షిప్‌ అశ్విని, ముంబై-40 సీట్లు
 • కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌-ఆర్మీ హాస్పిటల్‌(రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌), ఢిల్లీ-30 సీట్లు
 • కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌-కమాండ్‌ హాస్పిటల్‌(సెంట్రల్‌ కమాండ్‌), లక్నో-40 సీట్లు
 • కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌-కమాండ్‌ హాస్పిటల్‌(ఎయిర్‌ఫోర్స్‌), బెంగళూరు-40 సీట్లు

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

అర్హతలు

 • 2023లో బైపీసీ గ్రూప్‌తో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణతతోపాటు.. నీట్‌-యూజీలో అర్హత పొందాలి. ఇంటర్‌ తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత తప్పనిసరి. అవివాహిత, వితంతు మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
 • వయసు: అక్టోబర్‌ 1, 1998 -సెప్టెంబర్‌ 30, 2006 మధ్యలో జన్మించి ఉండాలి.
 • శారీరక ప్రమాణాలు: కనీసం152 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి.

ఎంపిక ఇలా

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరిధిలోని ఆరు కళాశాల్లోని సీట్ల భర్తీకి నీట్‌-యూజీ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. నీట్‌లో ర్యాంకు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బేస్‌ హాస్పిటల్‌లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. స్క్రీనింగ్‌ ప్రక్రియలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

రాత పరీక్ష కూడా

నీట్‌ ర్యాంకు ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు మరోసారి ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌(టీఓజీఐజీఈ) పేరుతో పరీక్ష ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగాల నుంచి ప్ర­శ్నలు అడుగుతారు. 40 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.

చ‌ద‌వండి: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!

సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ

ఇండియన్‌ ఆర్మీ మెడికల్‌ విభాగం నిర్వహించే రాత పరీక్షలో ప్రతిభ చూపి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి మలి దశలో సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థులకున్న సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ను, జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌పై అవగాహనను పరిశీలిస్తారు. దీంతోపాటు వ్యక్తిగత ఆసక్తి, అలవాట్లతోపాటు నర్సింగ్‌ కెరీర్‌ పట్ల ఉన్న అంకిత భావాన్ని పరిశీలించేలా ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా.. అభ్యర్థుల వ్యవహార శైలి, వ్యక్తిగత వైఖరి, దృక్పథం వంటి వాటిని పరిశీలిస్తారు.

ప్రతిభ ఆధారంగా తుది జాబితా

అభ్యర్థులకు సీట్లు ఖరారు చేసే క్రమంలో.. నీట్‌ స్కోర్, ఆర్మీ మెడికల్‌ బోర్డ్‌ నిర్వహించిన రాత 
పరీక్షలో పొందిన మార్కులు, అదే విధంగా సైకలాజికల్‌ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూలలో పొందిన మార్కులను క్రోడీకరించి.. మెరిట్‌ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.

నాలుగేళ్ల కోర్సు

అన్ని దశల్లోనూ విజయం సాధించిన అభ్యర్థులకు.. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీస్‌ పరిధిలోని కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి నిర్దేశిత యూనివర్సిటీల నుంచి బీఎస్సీ నర్సింగ్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. పుణె, ముంబైలలోని కళాశాలల్లో చదివిన వారికి మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌; కోల్‌కతలో చదివిన వారికి వెస్ట్‌ బెంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌; న్యూఢిల్లీలో చదివిన వారికి ఢిల్లీ యూనివర్సిటీ; లక్నోలో చదివిన వారికి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మెడికల్‌ యూనివర్సిటీ; బెంగుళూరులో చదివిన వారికి రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ నుంచి సర్టిఫికెట్లు అందిస్తారు.

చ‌ద‌వండి: After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్‌ హోదా పొందొచ్చు...

సర్వీస్‌ బాండ్‌

ఆయా కళాశాలల్లో చేరే ముందు అభ్యర్థులు.. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత అయిదేళ్లపాటు ఇండియన్‌ ఆర్మీలో విధులు నిర్వహిస్తామంటూ.. సర్వీస్‌ బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు చెల్లించకుండానే.. బీఎస్సీ నర్సింగ్‌ కోర్సును పూర్తి చేసుకోవచ్చు. స్టయిఫెండ్‌ కూడా అందిస్తారు. 

కమిషన్డ్‌ ఆఫీసర్‌ హోదా

కోర్సు పూర్తి చేసుకున్న వారికి మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో కమిషన్‌ ర్యాంకుతో కొలువు ఖరారు చేస్తా­రు. నిబంధనలను అనుసరించి పర్మనెంట్‌ లేదా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ను కేటాయిస్తారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఎంపికైన వారు తొలుత పదేళ్లు, తర్వాత మరో నాలుగేళ్లు మొత్తం 14 సంవత్సరాలు.. మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో నర్సింగ్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రారంభ వేతన శ్రేణి రూ.15,600-రూ.39,100గా ఉంటుంది. పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకు పొందిన వారు పదవీ విరమణ వయసు వరకు విధులు నిర్వర్తించొచ్చు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో పదవీ విరమణ పొందిన వారు.. ఆ తర్వాత కూడా ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉంటుంది. కార్పొరేట్‌ హాస్పిటల్స్, ఎన్‌జీఓలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

లెఫ్ట్‌నెంట్‌ నుంచి మేజర్‌ జనరల్‌ వరకు

బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో చేరిన వారికి తొలుత లెఫ్ట్‌నెంట్‌ ర్యాంకుతో నర్సింగ్‌ ఆఫీసర్‌ హోదా కల్పిస్తారు. ఆ తర్వాత అదే విభాగంలో కెప్టెన్, మేజర్, లెఫ్ట్‌నెంట్‌ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్‌ జనరల్‌ వంటి హోదాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.

రాత పరీక్షలో విజయానికి ఇలా

 • నీట్‌ ర్యాంకు ఆధారంగా.. తదుపరి దశలో నిర్వహించే జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ రాత పరీక్షలో మంచి మార్కుల కోసం దృష్టి పెట్టాల్సిన అంశాలు..
 • జనరల్‌ ఇంగ్లిష్‌: కాంప్రహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, ఫిల్లింగ్‌ ద బ్లాంక్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, మిస్‌ స్పెల్ట్‌ వర్డ్స్‌పై దృష్టి పెట్టాలి.
 • జనరల్‌ ఇంటెలిజెన్స్‌: అర్థమెటికల్‌ కంప్యుటేషన్, నాన్‌-వెర్బల్‌ సిరీస్, నంబర్‌ సిరీస్, అనాలజీ, డయాగ్రమ్‌ క్లాసిఫికేషన్‌ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

చ‌ద‌వండి: After‌ Inter‌ BiPC: అవకాశాలు భేష్‌!

ముఖ్య సమాచారం

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూలై 4, 2023
 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/
Published date : 03 Jul 2023 05:43PM

Photo Stories