Skip to main content

After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్‌ హోదా పొందొచ్చు...

After Inter BiPC: Veterinary Science Courses, Career Opportunities
After Inter BiPC: Veterinary Science Courses, Career Opportunities

బైపీసీ విద్యార్థులా.. మెడికల్‌ సీటు కోసం నీట్‌కు ప్రిపరేషన్‌ సాగిస్తున్నారా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో.. సీటు రాకుంటే.. ఏం చేయాలి అనే ఆందోళన మొదలైందా.. భవిష్యత్తు అవకాశాల గురించి బెంగ పడుతున్నారా..?! వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టెయొచ్చు అంటున్నారు నిపుణులు. కాసింత విస్తృత దృష్టితో ఆలోచిస్తే.. బైపీసీ విద్యార్థుల ముంగిట చక్కటి ప్రత్యామ్నాయ కోర్సు ఉంది! అదే.. వెటర్నరీ సైన్స్‌(పశు సంవర్ధక శాస్త్రం)!! ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. పేరు ముందు డాక్టర్‌ హోదా లభించడమే కాకుండా.. విస్తృత అవకాశాలు అందుకోవచ్చు. గత కొన్నేళ్లుగా వెటర్నరీ సైన్స్‌ విభాగంలో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. బైపీసీ విద్యార్థులకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న వెటర్నరీ సైన్స్‌తో విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం...  

 • బైపీసీ విద్యార్థులకు మెరుగైన మార్గం వెటర్నరీ సైన్స్‌
 • బీవీఎస్సీతో డాక్టర్‌ హోదా పొందొచ్చు
 • ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలూ బేష్‌

బైపీసీలో చేరిన విద్యార్థులను మీ లక్ష్యం ఏంటి? అని అడిగితే.. టక్కున వచ్చే సమాధానం.. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో చేరడం! ఆ తర్వాత వైద్య రంగంలో స్థిరపడడం!! దేశంలో అందుబాటులో ఉన్న మెడికల్‌ సీట్లు, కళాశాలలను పరిగణనలోకి తీసుకుంటే.. చాలా తక్కువ మందికి మాత్రమే సీటు లభించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సు.. వెటర్నరీ సైన్స్‌. ఇంటర్మీడియెట్‌ అర్హతతో బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ)లో ప్రవేశం పొందొచ్చు. ఈ కోర్సును జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక యూనివర్సిటీలు అందిస్తున్నాయి.

చ‌ద‌వండి: After 10+2: ఇంటర్మీడియెట్‌ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ కోర్సు తెలుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా వెటర్నరీ యూనివర్సిటీలను నెలకొల్పారు. ఏపీలో ఏపీఈఏపీ సెట్‌(బైపీసీ స్ట్రీమ్‌), తెలంగాణలో ఎంసెట్‌ (బైపీసీ స్ట్రీమ్‌) ర్యాంకుల ఆధారంగా సీట్ల భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (తిరుపతి); తెలంగాణలో పీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీల ఆధ్వర్యంలో బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సుల ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.. సదరు యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరై అడ్మిషన్‌ పొందొచ్చు. 

వెటర్నరీ డాక్టర్‌గా కొలువు

అయిదున్నరేళ్ల వ్యవధిలోని బీవీఎస్సీ కోర్సును పూర్తి చేసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ డాక్టర్‌గా కొలువు సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలోనూ జూపార్క్‌లు, ఇతర జంతు సంరక్షణ కేంద్రాల్లో వెటర్నరీ డాక్టర్లుగా కొలువుదీరొచ్చు.

ఉన్నత విద్య

బీవీఎస్సీ తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి పీజీ, పీహెచ్‌డీ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మాస్టర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌(ఎంవీఎస్సీ) పేరుతో పలు స్పెషలైజేషన్లతో పీజీ పూర్తి చేసుకోవచ్చు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌)కు సంబంధించిన పీజీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి. 

ఈ ఎంట్రన్స్‌ను ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ పేరుతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఈ పీజీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. జాతీయ స్థాయిలో ఐసీఏఆర్‌ గుర్తింపు పొందిన వెటర్నరీ కళాశాలల్లో 25 శాతం సీట్లకు పోటీ పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం పీజీ స్థాయిలో యానిమల్‌ బయో టెక్నాలజీ, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ బయో కెమిస్ట్రీ, యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, యానిమల్‌ న్యూట్రిషన్, వెటర్నరీ అనాటమీ అండ్‌ హిస్టాలజీ, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ వంటి పలు స్పెషలైజేషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

రీసెర్చ్‌ అవకాశాలు ఇలా..

వెటర్నరీ సైన్స్‌ విభాగంలో రీసెర్చ్‌ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంవీఎస్సీ అర్హతతో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. సీఏఆర్‌–ఏఐఈఈఏ(పీహెచ్‌డీ) ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.. యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, యానిమల్‌ న్యూట్రిషన్, లైవ్‌ స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ పారాసిటాలజీ, వెటర్నరీ మైక్రోబయాలజీ తదితర ఇరవైకి పైగా విభాగాల్లో పరిశోధన చేసే అవకాశం లభిస్తుంది. ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(పీహెచ్‌డీ) ఎంట్రన్స్‌ ద్వారా ప్రవేశం పొందిన వారికి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ల పేరిట ఆర్థిక ప్రోత్సాహకం కూడా అందుతుంది.

చ‌ద‌వండి: After‌ Inter‌ BiPC: అవకాశాలు భేష్‌!

పెరుగుతున్న డిమాండ్‌

 • వెటర్నరీ సైన్స్‌ విభాగంలో.. బీవీఎస్సీ మొదలు పీహెచ్‌డీ వరకూ.. అన్ని స్థాయిల కోర్సుల ఉత్తీర్ణులకు విస్తృత డిమాండ్‌ కనిపిస్తోంది. దేశంలో వెటర్నరీ హెల్త్‌కేర్‌ రంగం ఏటా పది శాతం చొప్పున వృద్ధి రేటు సాధిస్తోందని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
 • పలు గణాంకాల ప్రకారం–దేశంలో ప్రస్తుతం దాదాపు రెండు లక్షల మంది వెటర్నరీ సైన్స్‌ నిపుణుల అవసరం నెలకొంది. కానీ.. ప్రతి ఏటా సర్టిఫికెట్లతో బయటికి వస్తున్న వారి సంఖ్య 80 వేల వరకు మాత్రమే ఉంటోంది. దీన్నే ఈ విభాగంలో కచ్చితమైన కొలువులకు నిదర్శంగా పేర్కొనొచ్చు. 

లభించే అవకాశాలు ఇవే

 • బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ కోర్సు పూర్తి చేసుకోవడం ద్వారా.. క్షేత్ర స్థాయిలో పశు వైద్యులుగా కెరీర్‌ అవకాశాలు లభిస్తున్నాయి.
 • పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌ చేయడం ద్వారా యానియల్‌ హెల్త్‌కేర్‌కు సంబంధించి వ్యాక్సీన్స్‌ తయారు చేయడం.. అందుకు సంబంధించి పరిశోధనల్లో పాల్గొనవచ్చు. 
 • వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులకు యానిమల్‌ హెల్త్‌కేర్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ సంస్థల్లోనూ కొలువులు దక్కుతున్నాయి. జంతువులకు వచ్చే వ్యాధులను నిర్ధారించేందుకు అవసరమైన ఎక్స్‌–రే ఎక్విప్‌మెంట్‌ సంస్థలు, ఆపరేషన్‌ థియేటర్‌ ఎక్విప్‌మెంట్‌ సంస్థలు, డయాగ్నస్టిక్‌ సంస్థలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీటిలో కొలువు సొంతం చేసుకున్న వారు అర్హతల ఆధారంగా నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు పొందే అవకాశం ఉంది.

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో

వెటర్నరీ సైన్స్‌ కోర్సు ఉత్తీర్ణతతో మన దేశంలో ప్రభుత్వ రంగంలో పశు వైద్య కేంద్రాలు, జూపార్క్‌లు, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు, పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీస్, డిఫెన్స్, అగ్రికల్చర్‌ విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. 

 • ప్రైవేటు రంగంలో.. పౌల్ట్రీ ఫార్మ్స్, హేచరీస్, ఆక్వా ఫామ్స్, బయలాజికల్‌ ప్రొడక్షన్‌ యూనిట్స్, డైరీ ఫామ్స్‌లో కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
 • ఇవే కాకుండా.. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, జంతు ప్రదర్శన శాలల్లో వెటర్నరీ సైన్స్‌ నిపుణులకు చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. వీటితోపాటు లైవ్‌స్టాక్‌ సీడింగ్‌ సంస్థలు, యానిమల్‌ డ్రగ్‌ ప్రొడక్షన్‌ సంస్థలు, డ్రగ్‌ ఫార్ములేషన్‌ సంస్థల్లోనూ వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఖాయం. ఎంట్రీ లెవల్‌లోనే బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు సగటున రూ.40వేలు,పీజీ ఉత్తీర్ణులు వారి స్పెషలైజేషన్‌ ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.60 వేల వేతనంతో కెరీర్‌ ప్రారంభించొచ్చు.

 
స్వయం ఉపాధి

వెటర్నరీ సైన్స్‌ కోర్సు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. సొంతంగా పెట్‌ కేర్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటీవల నగరాల్లో పెట్‌ యానిమల్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. దీంతో వెటర్నరీ వైద్యుల అవసరం ఏర్పడింది. ఇదే వెటర్నరీ రంగంలో స్వయం ఉపాధికి ప్రధానంగా మారుతోంది.

అంతర్జాతీయంగానూ

వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీలో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు విదేశాల్లోనూ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌ అర్హతతోనే విదేశీ అవకాశాలు సొంతం చేసుకునే వీలుంది. ప్రధానంగా యూకే, ఆస్ట్రేలియా, యూఎస్‌లలో భారీ డిమాండ్‌ నెలకొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం– ఈ దేశాలు జీవజాతుల సంరక్షణపై భారీగా వ్యయం చేస్తున్నాయి. నిపుణుల కోసం అంతర్జాతీయంగా అన్వేషణ సాగిస్తున్నాయి. విదేశీ అవకాశాల కోసం ఆయా దేశాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 

వెటర్నరీ సైన్స్‌ కోర్సులు– ముఖ్య సమాచారం

 • టీఎస్‌ ఎంసెట్‌(అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌), ఏపీ–ఈఏపీసెట్‌ (బైపీసీ స్ట్రీమ్‌)లో ర్యాంకు ఆధారంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. బైపీసీ స్ట్రీమ్‌ పేరిట ప్రత్యేక వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపు.
 • పీజీ స్థాయిలో యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ల ఆధారంగా ఎంవీఎస్సీలో అవకాశం
 • ఐసీఏఆర్‌–ఏఐఈఈఏ(పీజీ)లో ర్యాంకు ఆధారంగా.. జాతీయ స్థాయిలో ఐసీఏఆర్‌ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ చదివే అవకాశం.
 • పీహెచ్‌డీతో రీసెర్చ్‌ ల్యాబ్స్, వెటర్నరీ డ్రగ్‌ ఫార్ములేషన్‌ సంస్థల్లో పరిశోధకులుగా కొలువు.
 • పలు గణాంకాల ప్రకారం– వచ్చే రెండేళ్లలో దాదాపు రెండు లక్షల మంది నిపుణుల అవసరం.
 • వెటర్నరీ సంబంధిత విభాగాల్లో టీచింగ్‌/ రీసెర్చ్‌ విభాగాల్లో రెండు వేలకుపైగా నిపుణులు అవసరం.
 • వెటర్నరీ సంబంధిత రంగాల్లో పారా సపోర్టింగ్‌ విభాగాల్లో దాదాపు మూడు లక్షల అవకాశాలు.

తెలుగు రాష్ట్రాల్లోని బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌ కళాశాలల వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌

 • కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌–తిరుపతి
 • ఎన్‌టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌–గన్నవరం
 • కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌–ప్రొద్దుటూరు
 • కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ – గరివిడి

తెలంగాణ

 • కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌–హైదరాబాద్‌
 • కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌–కోరుట్ల
 • కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌–మామ్నూరు


చ‌ద‌వండి: After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!​​​​​​​

Published date : 20 Apr 2022 06:39PM

Photo Stories