Govt Jobs: టీఎస్ 80,039, ఏపీలో 66,309 పోస్ట్‌ల భర్తీ సన్నాహాలు.. సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలంటే..
తెలుగు రాష్ట్రాల్లో.. సర్కారీ కొలువుల ఆశావాహులు తమ స్వప్నం సాకారం చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది! ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సన్నద్ధత ప్రారంభించాల్సిన తరుణం వచ్చింది! ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. తెలంగాణాలో.. 80,039, ఆంధ్రప్రదేశ్‌లో 66,309 పోస్ట్‌లకు.. భర్తీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెలువడుతున్న అధికారిక ప్రకటనలే ఇందుకు నిదర్శనం!! ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గ్రూప్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించడం ఉద్యోగార్థులకు అత్యంత తీపి కబురుగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో.. టీఎస్, ఏపీల్లో ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం...
- తెలంగాణ, ఏపీలో ప్రభుత్వ కొలువుల భర్తీకి సన్నాహాలు
- టీఎస్‌లో 80 వేలకుపైగా పోస్ట్‌లు భర్తీ చేయనున్నట్లు ప్రకటన
- ఏపీలో 60 వేలకుపైగా పోస్ట్‌లు, భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడి
- ఏపీలో గ్రూప్1లో 110, గ్రూప్2లో 182 పోస్టుల భర్తీకి తాజాగా గ్రీన్ సిగ్నల్
- సన్నద్ధత ప్రారంభించాలంటున్న నిపుణులు
- 80,039: తెలంగాణలో ఆయా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్న ఖాళీలు. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌లు, పరీక్ష క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటన.
- 60,309: ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు. వీటిలో ఇప్పటికే 10,143 పోస్ట్‌లకు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. కొన్ని పోస్ట్‌ల భర్తీ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. మరో 22,306 పోస్ట్‌ల భర్తీకి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించింది. వీటికి కూడా త్వరలోనే క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా ఏపీలో గ్రూప్1, గ్రూప్2లు కలిపి మొత్తం 292 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.
- పై సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులు.. తమ కల నెరవేర్చుకునేందుకు ఇంతకంటే మంచి సమయం లేదని చెప్పొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా సరైన ప్రణాళిక, సన్నద్ధతలో తడబాటు లేకుండా ముందుకు సాగడమే!
గ్రూప్స్ లక్ష్యంగా
- వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలనగానే ఎక్కువ మంది గ్రూప్స్‌పైనే గురి పెడతారు. ముఖ్యంగా గ్రూప్1తోపాటు గ్రూప్–2,3,4 కేటగిరీలకు కూడా పోటీ పడతారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్–1లో 503 పోస్ట్‌లు, గ్రూప్–2లో 582 పోస్ట్‌లు, గ్రూప్–3లో 1,373 పోస్ట్‌లు,గ్రూప్–4లో 9,168 పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
- ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రూప్స్ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా గ్రూప్1లో 110 పోస్టులు, గ్రూప్2లో 182పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి అనుమతించారు. దాంతో ఏపీపీఎస్సీ త్వరలో గ్రూప్1,గ్రూప్2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
- గ్రూప్స్ లక్ష్యంగా పెట్టుకుంటే.. ఒకే సమయంలో పలు పోస్ట్‌లకు సన్నద్ధత పొందే అవకాశం లభిస్తోంది. గ్రూప్–1ను లక్ష్యంగా చేసుకొని ప్రిపరేషన్ సాగిస్తూ.. అదే సన్నద్ధతతో గ్రూప్–2, గ్రూప్–3, 4లకు హాజరుకావచ్చు. ఆయా సిలబస్ అంశాలను పరీక్ష సరళికి అనుగుణంగా అనుసంధానం చేసుకుంటే.. ఒకే సమయంలో వివిధ పోస్ట్‌లకు పోటీ పడే సన్నద్ధత లభిస్తుంది.
చదవండి: తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి. ఏ పుస్తకాలు చదవాలి?
ఒకే సమయంలో ఎలా..
బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఉండే గ్రూప్స్ పోస్ట్‌ల అభ్యర్థులకు తలెత్తే సందేహం.. ఒకే సమయంలో అన్ని సర్వీసులకు పోటీ పడడం సాధ్యమేనా? అనేది. ఇందుకోసం చేయాల్సిందల్లా..అన్ని సర్వీసులకు సంబంధించి నియామక ప్రక్రియపై ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సిలబస్ అంశాలను సరిపోల్చి చూసుకోవాలి. ప్రతి సర్వీసుకు సంబంధించి ప్రత్యేకంగా ఉన్న సిలబస్ అంశాలతో జాబితా రూపొందించుకోవాలి. ఫలితంగా ఉమ్మడి అంశాలు ఏంటనే విషయంపై స్పష్టత వస్తుంది. ఇలా అవగాహన లభించిన తర్వాత ఉమ్మడి అంశాలు, ప్రత్యేకంగా ఉన్న అంశాల సన్నద్ధతకు వేర్వేరుగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి.
డిస్క్రిప్టివ్‌లోనా.. ఆబ్జెక్టివ్‌లోనా..
గ్రూప్స్ అభ్యర్థులు ఎదుర్కొనే ప్రధాన సమస్య.. డిస్క్రిప్టివ్‌లో ప్రిపరేషన్ సాగించాలా? లేదా ఆబ్జెక్టివ్ విధానంలోనా?అనేది. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం గ్రూప్–1 మెయిన్స్ మినహా అన్నీ పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉండటమే. అయితే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు సైతం లోతైన విషయ అవగాహన ఉంటేనే సమాధానం ఇచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి డిస్క్రిప్టివ్ దృక్పథంతో అధ్యయనం చేస్తే లోతైన పరిజ్ఞానం లభిస్తుంది. ఫలితంగా ప్రశ్నలను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే నేర్పు సొంతమవుతుంది.
సిలబస్ అవగాహన
ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా సదరు పరీక్ష సిలబస్‌ను పరిశీలించాలి. ఆ తర్వాత పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల సిలబస్ అంశాలపై అవగాహన లభిస్తుంది. దాంతోపాటు ఏఏ అంశాలకు ఎంత వెయిటేజీ ఉందో తెలుస్తుంది. ఇలా సిలబస్, వెయిటేజీపై స్పష్టత వచ్చాక.. ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. వాటిని తాజా పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
ఆబ్జెక్టివ్ పరీక్షలకూ
ప్రస్తుతం గ్రూప్–2, 3, 4 సర్వీసుల పరీక్షలన్నీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. దాంతో ఈ సర్వీసులను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు.. ఆబ్జెక్టివ్ తరహా ప్రిపరేషన్‌కే ప్రాధాన్యం ఇస్తుంటారు. కాని ఆబ్జెక్టివ్ తరహా బహుళైచ్చిక ప్రశ్నలతో జరిగే ఈ పరీక్షలు సైతం అభ్యర్థులకు ఆయా అంశాలపై పరిపూర్ణ అవగాహనను పరిశీలించే విధంగా ఉంటున్నాయి. అంటే.. ప్రశ్నలు విశ్లేషణాత్మక అధ్యయనంతోనే సమాధానాలు ఇచ్చే విధంగా ఉంటున్నాయి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలోనే సదరు అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలు, ఉద్దేశం, ప్రస్తుత పరిస్థితి, వాస్తవ పరిస్థితుల్లో అన్వయిస్తున్న తీరుపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. అభ్యర్థులు ఆబ్జెక్టివ్ పరీక్షలకు కూడా డిస్క్రిప్టివ్ విధానంతో ముందుకు సాగితేనే విజయాకాశాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: Telangana Govt Jobs 2022: అన్ని ఉద్యోగాలకు ప్రిపరేషన్.. నోటిఫికేషన్ దగ్గర్నుంచి.. పరీక్షల తేదీ వరకు..
ఇతర పరీక్షలకూ ఉపకరించేలా
ఇటీవల టీఎస్, ఏపీలలో గుర్తించిన ఖాళీలు, వాటి అర్హత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే.. అత్యున్నత సర్వీసుగా భావించే గ్రూప్–1 మొదలు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్–ఇన్‌స్పెక్టర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటికి బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతతో నియామక పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి డిగ్రీ ఉత్తీర్ణులైన వారందరూ తమ అర్హతకు సరితూగే అన్ని పరీక్షలకు సన్నద్ధమవ్వాలని ఆశించడం సహజం. ఇలాంటి సందర్భంలో ప్రిపరేషన్ కోణంలో కొంత మానసిక ఒత్తిడికి లేదా సమయాభావ సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు అభ్యర్థులు ఆయా పరీక్షల సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ప్రతి పరీక్షకు సంబంధించి ప్రత్యేక సమయం కేటాయించుకుంటూ.. సొంత నోట్స్ రూపొందించుకోవాలి.
పరీక్షల షెడ్యూల్ మేరకు
తమకు అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు.. ఆయా పరీక్షల షెడ్యూల్ మేరకు తమ ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. ముందుగా జరిగే పరీక్షకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. సదరు పరీక్షకు కనీసం నెల రోజుల ముందు నుంచి సంబంధిత పరీక్ష ప్రిపరేషన్‌కే పూర్తి సమయం కేటాయించాలి. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత తదుపరి జరిగే పరీక్షలకు మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించాలి. వాస్తవానికి తొలి పరీక్ష జరిగే సమయానికే అన్ని అంశాలపై సన్నద్ధత పొంది ఉండాలి. ఫలితంగా తదుపరి లభించే సమయంలో ఇతర పరీక్షలకు పునశ్చరణ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌ల హాజరుకు అవకాశం లభిస్తుంది. రివిజన్‌తోపాటు ప్రాక్టీస్ టెస్ట్‌లకు కూడా హాజరవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
వయో భారం.. భావన రానీయకుండా
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి ఓపెన్ కేటగిరీలో టీఎస్‌లో 44 ఏళ్లు, ఏపీలో 42 ఏళ్లుగా ఉంది. రిజర్వేషన్ వర్గాలకు నిబంధల ప్రకారం మరింత సడలింపు లభిస్తుంది. 30ఏళ్లు దాటిన వారంతా ఇప్పటికే ఏదో ఒక రంగంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. సబ్జెక్ట్‌తో టచ్ కూడా పోతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ వయసులో పరీక్షలకు సిద్ధమవడం సాధ్యమేనా.. అనే భావనలో ఉంటారు. ఒకవైపు సర్కారీ కొలువు ఆహ్వానిస్తున్నా.. సన్నద్ధత పొందలేమనే ప్రతికూల భావన ఉంటుంది. వీరు ప్రస్తుతం తమ ఉద్యోగ విధులు ముగిశాక.. మిగిలిన సమయంలో ప్రిపరేషన్ సాగించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవచ్చు.
పుస్తకాలూ.. ప్రధానమే
గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సరైన పుస్తకాలను ఎంపిక చేసుకోవడం కీలకమని గుర్తించాలి. మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్ మెటీరియల్ కంటే విషయ పరిజ్ఞానాన్ని అందించే పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాల తాజా సంచికలను సేకరించుకుని చదవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వీటితోపాటు ప్రాక్టీస్ టెస్ట్స్, మోడల్ టెస్ట్‌లతోనూ మేలు జరుగుతుంది. ఇన్‌స్టంట్ మెటీరియల్‌కే ప్రాధాన్యం ఇస్తే పూర్తి స్థాయి అవగాహన లభించదని గ్రహించాలి. వీటిలో అధిక శాతం కొశ్చన్ అండ్ ఆన్సర్ విధానంలో ఉంటాయి. వీటిని బట్టీ పట్టడం వల్ల వందల సంఖ్యలో ఉండే ప్రశ్నలు గుర్తుంచుకోవడం క్లిష్టంగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్‌స్టంట్ మెటీరియల్‌తో బేసిక్స్‌ను తెలుసుకునే అవకాశం ఉండదు.
స్థానిక అంశాలపై పట్టు
అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. తెలంగాణలో తెలంగాణ చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక అంశాలు, అదే విధంగా తాజా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక.. మిగత అంశాల విషయంలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో ప్రిపరేషన్ మొదలు పెట్టి.. సదరు టాపిక్స్‌లోని బేసిక్స్‌పై అవగాహన పొందాలి. ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బేసిక్ సైన్స్‌ల విషయంలో ఇది ఎంతో కలిసొస్తుంది. ఇక.. తెలంగాణ రాష్ట్ర చరిత్రకు సంబంధించి ముల్కీ నిబంధనల నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకూ.. ఆయా కీలక ఘట్టాల గురించి తెలుసుకోవాలి. శ్రీబాగ్ ఒడంబడిక, పెద్ద మనుషుల ఒప్పందం వంటి వాటిపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి.
- ఇదే తరహాలో ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చదవాలి.
- జై ఆంధ్రా ఉద్యమం మొదలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం వరకూ.. అన్ని కీలక అంశాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఏపీ పునర్విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్యా విధానం, నవరత్నాలు, ఐటీ పాలసీ, పారిశ్రామిక విధానం తదితర అంశాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
- ఇలా.. ప్రతి విషయంలోనూ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే.. సర్కారీ కొలువు కల సాకారం చేసుకోవడంలో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది.
చదవండి: Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!
మెమొరీ టిప్స్ పాటిస్తూ
గ్రూప్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో నిర్దిష్ట వ్యూహాలు అనుసరించాలి. ప్రధానంగా మెమొరీ టిప్స్ పాటించాలి. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రమ్స్, ముఖ్యమైన గణాంకాలు నోట్ చేసుకుంటే..ఆయా అంశాలు సులభంగా గుర్తుంటాయి. సిలబస్‌ను విశ్లేషించుకంటూ.. ప్రతి రోజు ప్రిపరేషన్‌కు కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా సమయం కేటాయించుకోవాలి. కోచింగ్ తీసుకున్నా.. తీసుకోకపోయినా.. స్వీయ దృక్పథం అవసరం.
– చైత్ర వర్షిణి, గ్రూప్–1 గత విజేత
ఇష్టపడి.. చదవాలి
గ్రూప్స్ అభ్యర్థులు ఇష్టంగా చదవాలి. కొన్ని అంశాలు క్లిష్టంగా, అర్థం కాకుండా ఉంటాయి. అలాంటి వాటి విషయంలో ఆందోళన వీడాలి. గ్రూప్స్‌లో ప్రశ్నలు అడిగే తీరు మారుతోంది. ఇన్–డైరెక్ట్ ప్రశ్నల స్థాయి పెరుగుతోంది. ప్రిపరేషన్ సమయంలో కాన్సెప్ట్స్ ప్లస్ కాంటెంపరరీ అప్రోచ్‌తో అడుగు వేయాలి. విశ్లేషణాత్మక అధ్యయనం చేయాలి. తద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలిచ్చే çసన్నద్ధత లభిస్తుంది. పుస్తకాల్లోని ప్రతి అక్షరం చదవాలనే అపోహ వీడి.. శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి. ఇందుకు గత ప్రశ్న పత్రాలు, మోడల్ పేపర్లను సాధనంగా చేసుకోవాలి.
– జె.ఆర్.అప్పలనాయుడు, ఏపీపీఎస్సీ గ్రూప్–2 (2016) విజేత
చదవండి:
APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test - 11
APPSC Previous Papers
APPSC-TSPSC-Online-Tests
APPSC Groups Practice Tests
TSPSC Previous Papers
TSPSC Bitbank