Skip to main content

Group-2 Prelims Reference Books: గ్రూప్-2 కి ఈ పుస్తకాలు చదివితే మీదే విజయం... కానీ ఇలాంటి పుస్తకాలు అసలు చదవకండి!!

APPSC గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష25వ తేదీన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ చాలా మంది అభ్యర్థులకు ఎలాంటి పుస్తకాలు చదవాలనే కన్ఫ్యూషన్ లో ఉంటారు. కింద పేర్కొన్న గ్రూప్-2 ప్రిలిమ్స్ రిఫరెన్స్ బుక్స్ మీ కోసం.
APPSC Group2 Reference Books group 2 new syllabus books

ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 897 పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లు, 566 నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి తొలి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. గ్రూప్‌–2 పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. తొలి దశలో స్క్రీనింగ్‌ టెస్ట్, తర్వాత దశలో మెయిన్‌ పరీక్ష ఉంటాయి. ఈ రెండు పరీక్షలు కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి. మెయిన్‌లో మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే గ్రూప్‌2 కొలువు ఖరారవుతుంది.

150 మార్కులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌
ఎంపిక ప్రక్రియ తొలి దశలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఒకే పేపర్‌గా 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ అంశాలపై మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు. 2024 ఫిబ్రవరి 25న గ్రూప్‌2 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. 

APPSC 2023 Notification Full Details: Group 1 | Group 2

ఈ పుస్త‌కాల జోలికి అసలు వెళ్లవద్దు..
కేవలం పరీక్షల కోసం మార్కెట్‌లోకి వేల పుస్తకాలు వచ్చాయి. పుస్తకాలు తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆబ్జెక్టివ్ టైప్ పుస్తకాలకు వెళ్లవద్దు. 90 శాతం షూర్ అంటూ అమ్ముతుంటారు. వాటి జోలికి వెళ్లవద్దు. వాటిల్లో నాలుగు రకాల ప్రమాదం ఉంటుంది. ప్రశ్న ఇవ్వడమే తప్పుగా ఉండొచ్చు. జవాబులు తప్పుగా ఉండొచ్చు. ప్రశ్నకు ఇచ్చిన జవాబుల్లో రెండూ ఉండొచ్చు. లేదా జవాబు ఉండకపోవచ్చు. అలాంటి వాటి జోలికి వెళ్లవద్దు. యూనివర్సిటీలు ప్రచురించినవో, ప్రొఫెసర్లు రాసినవో, తెలుగు అకాడమీ ముద్రించినవో తీసుకొని చదువుకోవాలి. ప్రణాళికే ప్రధానం. అది సరిగ్గా ఉంటే పరీక్షకు 50 శాతం సిద్ధం అయిపోయినట్లే.

ఇలాంటి కోచింగ్ సెంటర్లను నమ్మొదు..:
గ్రూప్-2కు ఆబ్జెక్టివ్‌లో చదువుకుంటే నష్టపోతారు. విషయంపై సంపూర్ణ అవగాహన లేకపోతే ఆబ్జెక్టివ్‌లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేరు. కోచింగ్ కేంద్రాలు చెబుతున్నట్లుగా కాకుండా సొంతంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని చదువుకోవాలి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. అప్పుడే సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది. ఏ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ కచ్చితంగా చదవాలి.

Group-2 Prelims Preparation: ఈ నెల రోజుల ప్లాన్ ఫాలో అవండి... ప్రిలిమ్స్ కొట్టండి!!

సిలబస్‌కు సరితూగే పుస్తకాలు

ప్రస్తుతం మార్కెట్లో ప్రతి సబ్జెక్ట్‌కు సగటున పదుల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. దాంతో పుస్తకాల ఎంపికలో అభ్యర్థులు కొంత అయోమయానికి గురవుతున్నారు. ఇన్ని పుస్తకాల్లో దేన్ని ఎంచుకోవాలి? అనేది అత్యంత ప్రధానమైన సమస్యగా మారుతోంది. దీనికి పరిష్కారంగా అభ్యర్థులు తొలుత పరీక్ష సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. వాటి ఆధారంగా పుస్తకాలను ఎంచుకోవాలి. ఒక పుస్తకాన్ని ఎంచుకునే ముందు సిలబస్‌లోని అన్ని అంశాలు అందులో ఉన్నాయా? లేదా? అని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. అదే విధంగా ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి సమకాలీన అంశాలతో ప్రచురితమవుతున్న మోనోగ్రాఫ్‌లను కూడా చదివేలా వాటిని సేకరించుకోవాలి. ఒకవేళ ఒక ప్రామాణిక పుస్తకంలో సిలబస్‌లోని అన్ని అంశాలు లేవని గుర్తిస్తే..దీనికి అదనంగా మరో ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకోవచ్చు. 

ప్రాథమిక అవగాహనకు ఎన్‌సీఈఆర్‌టీ

గ్రూప్స్‌ అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రాథమిక అవగాహనను అందించే పుస్తకాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. అందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12వ తరగతి పుస్తకాలను చదవాలి. దీనివల్ల హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి అంశాల్లో ప్రాథమిక భావనలపై అవగాహన వస్తుంది. వాస్తవానికి గ్రూప్స్‌కు పోటీ పడే అభ్యర్థుల్లో ఎక్కువ మంది డిగ్రీ తర్వాత అకడమిక్స్‌కు దూరమవుతారు. ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల్లో ఉంటారు. ఇలాంటి వారు తమకున్న సబ్జెక్ట్‌ అవగాహనను పునరావలోకనం చేసుకునేందుకు ప్రాథమిక భావనలతో ప్రిపరేషన్‌ ప్రారంభించడం మేలు చేస్తుంది. ఇందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురణలను చదవడం మేలు చేస్తుందని గత విజేతల అభిప్రాయం.

అకాడమీ పుస్తకాలు

గ్రూప్స్‌ అభ్యర్థులు కోర్‌ సబ్జెక్ట్‌లపై పట్టు కోసం ముఖ్యంగా హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీకి డిగ్రీ స్థాయిలోని అకాడమీ పుస్తకాలను చదవాలి. అకాడమీ పుస్తకాలు ప్రభుత్వ ప్రచురణలు కావడంతో.. వీటిలో పొరపాట్లకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆయా అంశాలకు సంబంధించి వాస్తవిక సమాచారం విషయంలో కచ్చితత్వం కూడా ఉంటుంది. ప్రాంతీయ ప్రాధాన్యమైన అంశాలుగా భావించే.. రాష్ట్ర చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ వంటి విషయాల్లో కచ్చితత్వంతో కూడిన సమాచారం లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అకాడమీ పుస్తకాలను చదవాలి. అదేవిధంగా అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పుస్తకాలు, ఇగ్నో పుస్తకాలను చదవడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

APPSC Group 2 History : APPSC గ్రూప్స్‌-2 ప‌రీక్ష‌ల్లో హిస్ట‌రీ నుంచి..వ‌చ్చే ప్ర‌శ్న‌లు ఇవే..

ప్రభుత్వ ప్రచురణలు

గ్రూప్స్‌ అభ్యర్థులు సమకాలీన అంశాలపై పట్టు కోసం ప్రభుత్వ ప్రచురణలను చదవడం ముఖ్యమని గుర్తించాలి. యోజన, ఇండియా ఇయర్‌ బుక్, రాష్ట్ర ప్రభుత్వ సామాజిక–ఆర్థిక సర్వే, బడ్జెట్‌ ప్రచురణలు చదవాలి. వీటిని చదవడం ద్వారా ఇటీవల కాలంలో ఆయా రంగాల్లో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, కేటాయింపులు, లక్షిత వర్గాలు.. వంటి వాటిపై సమగ్ర అవగాహన లభిస్తుంది. గణాంకాలతో కూడిన సమాచారంపై స్పష్టత వస్తుంది. అదే విధంగా ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ వంటి మ్యాగజైన్లు చదవడం కూడా తాజా పరిణామాలపై అవగాహనకు దోహదం చేస్తుంది.

సొంత నోట్స్‌.. ఎంతో మేలు

  • పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సొంత నోట్స్‌ రాసుకునే విధానాన్ని పాటించాలి. ఇది వారికి మలి దశలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు, గత విజేతలు చెబుతున్నారు. ఈ సొంత నోట్స్‌ రాసుకునే విషయంలో కూడా అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి అభ్యర్థులు.. ఏదైనా అంశాన్ని చదువుతున్నప్పుడు ముందుగా వాటి ప్రాథమిక భావనలు నోట్స్‌లో పొందుపరుచుకోవాలి. ఆ తర్వాత వాటిని సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ.. తగిన సమాచారాన్ని సదరు నోట్స్‌లో రాసుకోవాలి.
  • గణాంకాలు, ముఖ్యమైన ఘట్టాలు, సంవత్సరాలు ఉండే ఎకానమీ, హిస్టరీ వంటి వాటికి ఆయా సంవత్సరాల్లో జరిగిన సంఘటనల ప్రాధాన్యతను బట్టి నోట్స్‌లో రాసుకోవాలి.
  • ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు.. ఆయా పథకాల లక్ష్యం, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, ఆర్థిక కేటాయింపులు, సదరు పథకాల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను నోట్స్‌లో రాసుకోవాలి.
  • బడ్జెట్, సామాజిక సర్వేల్లో ఎక్కువగా గణాంకాలే ఉంటాయి. కాబట్టి పరీక్ష ప్రాధాన్యత ఆధారంగా వాటిని నోట్స్‌గా పొందుపర్చుకోవాలి. వాటికి సమకాలీన అంశాలను అనుసంధానం చేసుకునేలా వ్యవహరించాలి.

గ్రూప్-2 ప్రిలిమ్స్ రిఫరెన్స్ బుక్స్

  • ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు(6 నుంచి 12వ తరగతి వరకు)
  • అకాడమీ పుస్తకాలు
  • బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి పుస్తకాలు
  • కేంద్ర, రాష్ట్ర సామాజిక– ఆర్థిక సర్వేలు, బడ్జెట్‌ ప్రచురణలు
  • ఇండియా ఇయర్‌ బుక్, యోజన, ఈపీడబ్ల్యూ
  • జాగ్రఫీ: ఇండియన్‌ జాగ్రఫీ–మాజిద్‌ హుస్సేన్, వరల్డ్‌ జాగ్రఫీ–మాజిద్‌ హుస్సేన్‌
  • ఎకానమీ: ఇండియన్‌ ఎకానమీ–ఉమా కపిల; ఇండియన్‌ ఎకానమీ–మిశ్రా అండ్‌ పూరి; ఎకనామిక్స్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌–ఎం.ఎల్‌.జింగన్‌
  • పాలిటీ: ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నమెంట్‌–ఎస్‌.పి.వర్మ; డెమోక్రసీ ఇన్‌ ఇండియా–రషీదుద్దీన్‌ ఖాన్‌; ది కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా–పి.ఎం.భక్షి; ఇన్‌ట్రడక్షన్‌ టు ది కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా–డి.డి.బసు; పబ్లిక్‌ అడ్మినిస్ట్రే్టషన్‌– అవస్థి అండ్‌ మహేశ్వరి చాప్టర్స్‌ ఆన్‌ గుడ్‌ గవర్నెన్స్‌; ఇండియన్‌ పాలిటీ–లక్ష్మికాంత్‌.
  • హిస్టరీ: ఏన్షియంట్‌ ఇండియా–ఆర్‌.ఎస్‌.శర్మ; మిడీవల్‌ ఇండియా–సతీష్‌ చంద్ర; మోడ్రన్‌ ఇండియా–బిపిన్‌ చంద్ర.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: సైన్స్‌ స్పెక్ట్రమ్, యోజన, ప్రభుత్వ ప్రచురణలు.
  • ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలకు సంబంధించిన అంశాలను చదివేటప్పుడు అకాడమీ పుస్తకాలకు, వాటి తాజా ప్రచురణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • అదే విధంగా శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్, రాష్ట్ర పునర్విభజన చట్టం, రాష్ట్రాల విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమలవుతున్న పథకాలు, సమస్యలకు సంబంధించి ప్రభుత్వ ప్రచురణలు చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.

Published date : 24 Jan 2024 06:07PM

Photo Stories