Job Mela: మెగా జాబ్‌మేళా... 350 మందికి ఆఫర్‌ లెటర్లు

అనంతపురం ఎడ్యుకేషన్‌: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హరీష్‌కుమార్‌ యాదవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 28న‌ నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది.

అనంతపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 మంది హాజరయ్యారు. ఐటీ, బీపీఓ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ తదితర రంగాలకు చెందిన దాదాపు 70 కంపెనీల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఎంపిక చేశారు.

వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయి. వీరిలో 350 మందికి యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ హరీశ్‌ కుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా ఆఫర్‌ లెటర్లు అందజేశారు. మిగిలిన వారికి రెండు, మూడు రోజుల్లో నియామక పత్రాలను కంపెనీ నిర్వాహకులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా హరీష్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో తాను గతంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. తన ఫౌండేషన్‌ ద్వారా ఇంత మందికి ఉద్యోగ అవకాశాలు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.

చదవండి: Andhra Pradesh Jobs: ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 300 ఉద్యోగాలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇవాళ ఉద్యోగం రానివారు నిరుత్సాహపడకుండా మరో ప్రయత్నానికి సిద్ధం కావాలన్నారు. వారికి మున్ముందు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కళాశాల యాజమాన్యం, ‘అపిత’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించగా టెక్‌ మహీంద్ర కంపెనీకి 78 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆ కళాశాల చైర్మన్‌ సి.సోమశేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సి.చక్రధర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.మధుసూదన్‌రెడ్డి, ‘అపిత’ పౌండేషన్‌ డైరెక్టర్‌ రాజగోపాల్‌ తెలిపారు.

కార్యక్రమంలో నగరపాలక డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

#Tags