Skip to main content

Good news for Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్‌ భారీగా ఉద్యోగాలు

Anganwadi jobs news
Anganwadi jobs news

మంచిర్యాలటౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీచర్లు, ఆయాల రిటైర్మెంట్‌ ప్రక్రియకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల(ఆయా) వివరాలను ప్రాజెక్టుల వారీగా, వారి పుట్టిన తేదీ, వయస్సు తదితర వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో జిల్లా సంక్షేమశాఖ అధికారి నుంచి క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి(సీడీపీఓ) ద్వారా సేకరిస్తోంది.

గతంలోనే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించినా.. వారు రిటైర్మెంట్‌ సమయానికి ఇచ్చే ప్యాకేజీపై రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. దీంతో గత కొన్నాళ్లుగా రిటైర్మెంట్‌ ప్రక్రియ నిలిచిపోయింది.

ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 80 ఏళ్లు పైబడిన వారిలో ఐదుగురు ఉండగా, అందులో నలుగురు అంగన్‌వాడీ ఆయాలు, ఒక టీచరు ఉన్నారు. 70 ఏళ్లు పైబడిన వారిలో 63 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 65 ఏళ్లు దాటిన వారు 127 మంది ఉన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని మూడేళ్లు పెంచడంతో అన్ని రకాల పదవీ విరమణలు ఆగిపోయాయి.

వాటితోపాటు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్లూ నిలిచిపోయాయి. గత మార్చి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు ప్రారంభం కావడంతో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వయస్సు 65 ఏళ్లు నిండితే వారికి రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసమే అన్ని జిల్లాల నుంచి టీచర్లు, ఆయాలకు సంబంధించిన వివరాలు, వారి పుట్టిన తేదీ వివరాలను ఒక ప్రొఫార్మాలో తీసుకుని సిద్ధం చేశారు.

ప్యాకేజీపైనే అభ్యంతరాలు..!

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు రిటైర్మెంటుకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించే అంశం లేకపోవడంతో వారికి ప్యాకేజీని అందించి వారి వయస్సు 65 ఏళ్లు దాటితే రిటైర్మెంట్‌ చేయాలని భావిస్తోంది.

ఏప్రిల్‌ నెలతో 65 ఏళ్లు దాటిన వారి వివరాలను సేకరించగా, రిటైర్మెంట్‌ అయ్యే అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌కు రూ.50 వేల ప్యాకేజీ కింద అందించడంతోపాటు రిటైర్మెంట్‌ సమయం నుంచి వారికి ఆసరా పింఛన్‌ ఇచ్చేలా ప్యాకేజీలో ఉంది.

దీనిపై గతంలోనే అంగన్‌వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌(ఆయా)లకు రూ.లక్ష ఇవ్వాలన్న డిమాండ్‌ ఉండగా, ప్రభుత్వ ప్యాకేజీపై తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ తర్వాత రిటైర్మెంట్‌ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఇన్నాళ్లు ప్యాకేజీ అంశంపై టీచర్లు, ఆయాలు మౌనంగానే ఉన్నారు.

పెరగనున్న ఖాళీలు

అంగన్‌వాడీ కేంద్రాలు జిల్లాలో 969 ఉన్నాయి. టీచర్లు 893 మంది మాత్రమే పనిచేస్తుండగా 76 పోస్టులు ఖాళీ ఉన్నాయి. హెల్పర్‌(ఆయా) పోస్టులు 729 ఉండగా, 240 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెల లేదా వచ్చే నెలలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్‌ను ప్రకటిస్తే మాత్రం మరో 17 మంది టీచర్లు, 110 మంది ఆయాలు రిటైర్‌ అవుతారు.

దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాదిగా టీచర్‌, ఆయా పోస్టుల ఖాళీలను భర్తీ చే స్తామని అధికారులు చెబుతున్నా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఖాళీగా ఉన్న కేంద్రాలను సమీపంలోని ఇతర అంగన్‌వాడీ టీచర్లకు అప్పగించి నిర్వహిస్తున్నారు.

నిత్యం చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే టీచర్లకు.. వారి కేంద్రంతోపాటు మరో కేంద్రానికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం వల్ల రెండు కేంద్రాల్లో పూర్తిస్థాయి విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం ఉన్న ఖాళీల ను భర్తీ చేస్తే టీచర్లు, ఆయాలు రిటైర్‌ అయినా కొంత ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

Published date : 15 May 2024 08:24PM

Photo Stories