Medical Counselling Committee: ఒకేసారి ఆల్‌ ఇండియా, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌!

సాక్షి, అమరావతి: వైద్య విద్య పీజీ, యూజీ కోర్సుల్లో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆల్‌ ఇండియా, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌ను ఏకకాలంలో నిర్వహించాలని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిషన్‌ (ఎంసీసీ) యోచిస్తోంది.
ఒకేసారి ఆల్‌ ఇండియా, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్‌!

దీంతో పాటు ప్రవేశాల ప్రక్రియలో మరికొన్ని మార్పులను ప్రవేశపెట్టబోతోంది. ఈ క్రమంలో కొత్త విధానంపై రాష్ట్రాలు తమ సూచనలు, సలహాలు తెలియజేయాలంటూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఇటీవల అన్ని రాష్ట్రాల ఆరోగ్య విశ్వవిద్యాలయాలకు లేఖ రాసింది. కిందటి సంవత్సరం వరకూ పీజీ, ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల్లో భాగంగా ఆల్‌ ఇండియా కౌన్సెలింగ్‌ను తొలుత ప్రారంభించేవారు. అనంతరం రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించేవారు. అయితే నూతన విధానంలో రెండు కౌన్సెలింగ్‌లు ఏకకాలంలో చేపట్టనున్నారు. అదే విధంగా సీట్ల బ్లాకింగ్‌కు తావివ్వకుండా డైనమిక్‌ కౌన్సెలింగ్‌ను ప్రతిపాదించారు.

చదవండి: హెల్త్ యూనివర్సిటీల కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి...

ఈ విధానంలో భాగంగా పీజీ, యూజీ సీట్లన్నీ భర్తీ అయ్యే వరకూ కౌన్సెలింగ్‌ చేపడతారు. ఇప్పటి వరకూ రెండు రౌండ్‌ల కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలి పోయిన సీట్లకు మాప్‌–అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. కొత్త విధానంలో సీట్లన్నీ భర్తీ అయ్యే వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూనే ఉండేలా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా మొదటి రెండు కౌన్సెలింగ్‌లలో తమకు వచ్చిన సీట్లలో విద్యార్థులు చేరేది, చేరనిది ఆన్‌లైన్‌లో తెలియజేసేందుకు వీలు కల్పించనున్నారు. మరోవైపు అన్ని ప్రైవేట్‌ కళాశాలలకు కామన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రతిపాదించారు. సింగిల్‌ చాయిస్‌ విధానం ద్వారా అన్ని కౌన్సెలింగ్‌లను నిర్వహించాలనుకుంటున్నారు.

చదవండి: NMC: అనురాగ్‌ ప్రైవేట్‌ వర్సిటీకి మెడికల్‌ కాలేజీ

#Tags