Skip to main content

హెల్త్ యూనివర్సిటీల కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి...

ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత.. రాష్ట్రాల స్థాయిలో ఆయా హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాయి.
వీటికి విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ మూడు రౌండ్లలో జరిగే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్‌లైన్‌లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ఆన్‌లైన్ విధానంలోనే..
హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశిత వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం.. ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకు అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.

తెలుగు రాష్ట్రాల్లో సీట్లు.. ఇలా
-{పస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల విషయానికొస్తే.. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం- ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో కలిపి మొత్తం 5,040 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఎస్‌ఐ కళాశాలను కలుపుకుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లున్నారుు. 18 ప్రైవేట్ కాలేజీల్లో 2,750, 4 మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 550 సీట్లు ఉన్నట్లు తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. 

- డెంటల్ కళాశాల పరంగా 2019 గణాంకాల ప్రకారం- అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: 1040

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 5,010, దంత వైద్య కళాశాలల్లో 1,440 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు కేటాయిస్తారు. మిగతా 85 శాతం సీట్లను స్టేట్ కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తారు. 

- ఆయుష్ కోర్సులను పరిగణనలోకి తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు కలిపి బీహెచ్‌ఎంఎస్‌లో 320, బీఏఎంఎస్‌లో 56, నేచురోపతిలో 200, యునాని కోర్సులో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

- అదే విధంగా తెలంగాణలో ఆయుర్వేదలో 100 సీట్లు, హోమియోపతిలో 100 సీట్లు,యునానీలో 75సీట్లు, నేచురోపతిలో 30సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫీజులు ఇలా..
ఎంబీబీఎస్‌కు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో రూ.60 వేలు; ప్రైవేటు బీ కేటగిరీలో 12.10 లక్షల వార్షిక ఫీజును గత ఏడాది నిర్ణయించారు. ఇక..సీ కేటగిరీ సీట్లకు గరిష్టంగా 22 లక్షల వరకు వార్షిక ఫీజు నిర్ణయించారు. బీడీఎస్ కోర్సులకు కన్వీనర్ కోటాలో 45 వేలు, ప్రైవేట్-బీ కేటగిరీలో 2.7 లక్షలు, సీ-కేటగిరీలో 2.7లక్షలుగా గత ఏడాది నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు-బీ కేటగిరీలో ఎంబీబీఎస్‌కు గతేడాది రూ.13,37,057 వార్షిక ఫీజును నిర్ణయించగా.. ప్రైవేట్-బీ కేటగిరీలో బీడీఎస్‌కు రూ.5,46,978ని వార్షిక ఫీజుగా గతేడాది కౌన్సెలింగ్ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక.. సీ-కేటగిరీలో ఎంబీబీఎస్‌కు గరిష్టంగా రూ.40 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. బీడీఎస్‌కు సీ- కేటగిరీలో రూ.7.5 లక్షలను వార్షిక ఫీజుగా పేర్కొన్నారు. ఈ ఏడాది మేనేజ్‌మెంట్ కోటా ఫీజుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

గమనిక :
సీట్ల వివరాలు..
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం, గత ఏడాది కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచిన వివరాల ప్రకారం పేర్కొనడం జరిగింది. కౌన్సెలింగ్ మొదలయ్యే సమయానికి సీట్ల సంఖ్యలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఫీజుల వివరాలు.. గత ఏడాది కౌన్సెలింగ్ ప్రకటన సమయంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఫీజులను తెలియజేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కౌన్సెలింగ్ సమయానికి ఫీజుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కౌన్సెలింగ్ నోటిఫికేషన్ సమయానికి స్పష్టత..
ఏపీలోని మెడికల్ కళాశాలల్లో సీట్లు, ఫీజుల విషయంలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ సమయానికి స్పష్టత వస్తుంది. ఈసారి మేనేజ్‌మెంట్ కోటాలో ఫీజులు తగ్గే అవకాశముంది. కౌన్సెలింగ్ సమయానికే అన్ని విషయాల్లో స్పష్టతతో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. డీజీహెచ్‌ఎస్ నుంచి జాబితా రాగానే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు చేపడతాం. తెలంగాణ విద్యార్థులు అన్-రిజర్వ్‌డ్ కోటాలో ఉండే 15 శాతం సీట్లకు ఏపీలో దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా స్టేట్‌వైడ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో టీఎస్‌కు నిర్దేశిత శాతంలో రిజర్వేషన్ ఉంది. ఆ మేరకు ఆ సీట్లకు టీఎస్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- డాక్టర్ కె.శంకర్, రిజిస్ట్రార్, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (విజయవాడ)
Published date : 27 Oct 2020 01:55PM

Photo Stories