UPSC Civils Ranker Success Story : వరుసగా మూడు సార్లు ఫెయిల్.. చివరికి ఈ మాటల వల్లే సివిల్స్ కొట్టానిలా..
ఈమె వరుసగా మూడు వైఫల్యాలు నేర్పిన పాఠాలతో నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 103వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారిన్ సర్వీస్ సాధించారు. ఈ నేపథ్యంలో స్నేహజ సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. అప్పట్లో మేం సోమాజిగూడలో ఉండేవాళ్లం. నాన్న జె. వెంకటేశ్వర్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇంటి పక్కనే ఆఫీస్. నన్ను స్కూల్‌కు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం నాన్న బాధ్యతే. ఎన్ని పనులున్నా నాకంటే ముందే సిద్ధంగా ఉండేవారు. అమ్మ సుజాత ప్రభుత్వ ఉద్యోగి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్‌గానూ వ్యవహరించారు.
ఆ స్ఫూర్తితోనే నేను..
చిన్నప్పటి నుంచీ నాన్న సామాజిక, రాజకీయ విషయాలు చెప్పేవారు. సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వాటికి పరిష్కార మార్గాలేమిటి? అనే కోణంలో చర్చించే వారు. స్ఫూర్తిదాయక వాక్యాలు వినిపించేవారు. చదువు విలువను ఉదాహరణలతో వివరించేవారు. ఆ స్ఫూర్తితోనే నేను స్కూల్ టాపర్‌గా నిలిచాను. స్కూల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాను. నా విజయాలను చూసి అమ్మానాన్న సంబరపడేవారు. ఒక్కగానొక్క కూతుర్ని కావడంతో ప్రేమంతా నా మీదే కురిపించేవారు.
ఎడ్యుకేషన్ :
నా చదువంతా ఖైరతాబాద్‌లోని నాసర్ స్కూల్‌లో సాగింది. నాకు మా స్కూల్‌తో విడదీయరాని బంధం ఉంది. ఇప్పటికీ స్కూల్ టీచర్లతో టచ్‌లో ఉంటాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు అందిస్తూ ప్రోత్సహిస్తుంటాను. నాన్న ప్రభావంతో నేనూ సీఏ చేశాను. కోర్సు పూర్తికాగానే ఖైరతాబాద్‌లోని విజయ ఎలక్ట్రికల్స్‌లో ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ తీసుకున్నాను.
నా కెరీర్ ప్రయాణంలో ఎన్నో మలుపులు..
జీవితం ఎంతో విలువైంది.ఫెయిల్యూర్ దగ్గరే ఆగిపోవద్దు. సంపాదన, హోదా కంటే.. ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైనసంతృప్తి ఉంది అని యువతకు సూచిస్తారు జొన్నలగడ్డ స్నేహజ ఐఎఫ్‌ఎస్. మూడు వైఫల్యాలు నేర్పిన పాఠాలతో నాలుగో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 103వ ర్యాంక్ సాధించి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఫారిన్ సర్వీస్ సాధించారు స్నేహజ. ప్రస్తుతం హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నేను సివిల్స్ వైపు ఎందుకు వచ్చానంటే..?
నాన్నకు సివిల్స్ అంటే ఆసక్తి. కానీ గైడెన్స్ ఇచ్చేవారు లేక లక్ష్యానికి దూరంగా ఉండిపోయారు. ఆ వెలితిని నాతో పంచుకునేవారు. ఆ సమయానికి నేను సీఏ విద్యార్థులకు ఆడిటింగ్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ పాఠాలు చెప్పేదాన్ని. దాంతోపాటే ఓ ఆడిట్ కంపెనీలో ఉద్యోగం చేసేదాన్ని. నాకు సమాజ సేవపై ఆసక్తి ఉండేది. దీంతో చిన్నారుల సంరక్షణకు కృషిచేసే ఓ ఎన్జీవోతో కలిసి పనిచేశాను. అప్పుడే నాన్న ఆశయాన్ని నేను ఎందుకు పూర్తి చేయకూడదు ? అనిపించింది. మన నైపుణ్యం మనకే కాదు, సమాజానికీ ఉపయోగపడాలి. అలా సివిల్స్‌పై దృష్టి సారించాను.
మా పేరెంట్స్‌తో వీళ్లు..
మొదటి రెండు ప్రయత్నాలు ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాలేదు. బాధగా అనిపించింది. అమ్మానాన్న ధైర్యం చెప్పారు. నాతోపాటు సీఏ చేసినవాళ్లంతా అప్పటికే పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మీ అమ్మాయి సివిల్స్ కోసం సమయం ఎందుకు వృథా చేసుకుంటున్నది అనేవారు మా పేరెంట్స్‌తో. ఆ సమయంలో నాన్న నాకు మద్దతుగా మాట్లాడేవారు. నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు. మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్‌లో గ్రూప్ బీ సర్వీస్ వచ్చింది. నేను జాయిన్ కాలేదు. నాలుగోసారి జాతీయ స్థాయిలో 103వ ర్యాంకు సాధించాను. పెద్దల ఆనందానికి అవధుల్లేవు. అప్పటిదాకా విమర్శించినవారే ప్రశంసించారు. 2016 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారిగా నా ప్రయాణం మొదలైంది.
వీరి ప్రోత్సాహము మరువలేనిది..
మా వారు రోహిత్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) అధికారి. ఢిల్లీలో ఉద్యోగం. పాప పేరు సహస్ర. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఉద్యోగిగా నేను ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. రోహిత్ అండతో కెరీర్‌లోని సవాళ్లను అధిగమిస్తున్నాను. మా అత్తమ్మ, మామయ్య ప్రోత్సాహమూ మరువలేనిది. చైనాలో సెకండ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించాను.
ఈ మార్గాన్ని ఎంచుకున్నందుకు..
కరోనా సమయంలో వుహాన్ నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఢిల్లీలో డెస్క్ ఆఫీసర్ (బంగ్లాదేశ్-మయన్మార్)గా పనిచేశాను. విజిలెన్స్ విభాగంలో విధులు నిర్వర్తించాను. ఇప్పుడు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేస్తున్నాను. సామాన్య ప్రజలు సైతం ఎలాంటి ఇబ్బందులూ పడకుండా, మధ్యవర్తుల బెడదే లేకుండా.. పాస్‌పోర్ట్ పొందేందుకు నా వంతు సహకారం అందిస్తున్నా. ఫేక్ డాక్యుమెంట్లకు అడ్డుకట్ట వేస్తున్నా. సివిల్ సర్వీసెస్.. సామాజిక బాధ్యతతో కూడిన కెరీర్. ఈ మార్గాన్ని ఎంచుకున్నందుకు గర్వంగా ఉంది.
దీనిని నేను గట్టిగా నమ్ముతాను.
విద్య.. తిరుగులేని ఆయుధం. చదువు తోనే మహిళలు జీవిత లక్ష్యాలను చేరుకోగలరు. డాక్టర్ జేమ్స్ ఎమెన్యూయెల్ క్వెగ్యిర్ యు ఎడ్యుకేట్ ఏ ఉమెన్. యు ఎడ్యుకేట్ ఏ నేషన్ నినాదాన్ని నేను గట్టిగా నమ్ముతాను. ఆడవారికి కావాల్సింది బంగారమో, డబ్బో కాదు.. ధైర్యం. ప్రతి మహిళకూ ఆ శక్తి అందాలి. సివిల్స్ ప్రక్రియ నన్ను వాస్తవంలోకి తీసుకొచ్చింది. ప్రతి హోదా గొప్పదే. ప్రతి బాధ్యతా కీలకమైందే. మనం ఆ స్థానాన్ని ఎంత గౌరవిస్తున్నాం అనేదే ముఖ్యం. జీవితం ఎంతో విలువైంది.ఫెయిల్యూర్ దగ్గరే ఆగిపోవద్దు. సంపాదన, హోదా కంటే.. ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైనసంతృప్తి ఉంద’ అని యువతకు సూచిస్తారు జొన్నలగడ్డ స్నేహజ ఐఎఫ్‌ఎస్ అధికారి.