Study Plan for MAT Exam 2023: మేనేజ్‌మెంట్ పీజీకి మార్గం.. మ్యాట్!
- మ్యాట్ స్కోర్‌తో మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
- ఏఐఎంఏ ఆధ్వర్యంలో మ్యాట్ పరీక్ష నిర్వహణ
- సెప్టెంబర్ 2023 సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- అందుబాటులో వందకు పైగా బి-స్కూల్స్
ఎంబీఏ లేదా మేనేజ్‌మెంట్ పీజీ అనగానే విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఐసెట్, జాతీయ స్థాయిలో క్యాట్‌పైనే దృష్టి పెడతారు. కాని మేనేజ్‌మెంట్ కోర్సుల అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి అవకాశం.. మ్యాట్. ఐసెట్, క్యాట్ ప్రిపరేషన్‌లతోనే మ్యాట్‌కు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.తద్వారా జాతీయ స్థాయిలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలకు మార్గం సుగమం చేసుకోవచ్చు.
ఏఐఎంఏ
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ).. మేనేజ్‌మెంట్ విభాగానికి సంబంధించి నైపుణ్య శిక్షణ కార్యకలాపాలను నిర్వహించే సంస్థ. భవిష్యత్తు మేనేజ్‌మెంట్ లీడర్లను తీర్చిదిద్దాలనే సంకల్పంతో 1998లో మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ పరీక్ష విధానంలో పాటిస్తున్న ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్న పలు బిజినెస్ స్కూల్స్.. మ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు సిద్ధమయ్యాయి. తాజా ప్రకటనలో 94 ఇన్‌స్టిట్యూట్స్‌నే పేర్కొన్నప్పటికీ.. ఈ స్కోర్‌తో మరెన్నో విద్యాసంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
అర్హత
- బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: Management Entrance Test: ఎక్స్‌ఏటీతో మేనేజ్‌మెంట్ విద్య
మూడు విధానాల్లో పరీక్ష
- మ్యాట్ సెప్టెంబర్ సెషన్‌ను మూడు విధానాల్లో నిర్వహించనున్నారు. అవి..
- పేపర్ బేస్డ్ టెస్ట్: అభ్యర్థులు నిర్దేశిత తేదీలో పరీక్ష కేంద్రంలో ఓఎంఆర్ షీట్ పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: నిర్దేశిత తేదీల్లో.. పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ టెస్ట్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.
- ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్: ఈ విధానంలో అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో ఇంటర్నెట్ ఆధారంగా.. తమకు అనుకూలమైన చోటు నుంచే పరీక్షకు హాజరుకావచ్చు.
- ఈ మూడు విధానాల్లో ఏ విధానంలో పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్‌లకు నిర్దిష్టంగా ఏఐఎంఏ తేదీలను ప్రకటిస్తుంది. వాటిని పరిశీలించి తమకు అనుకూలమైన తేదీ, స్లాట్‌ను కూడా దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. సెప్టెంబర్ సెషన్‌కు సంబంధించి ఆయా తేదీలను కూడా ప్రకటించారు.
అయిదు విభాగాలు.. 200 మార్కులు
మ్యాట్ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, మ్యాథమెటికల్ స్కిల్స్ 40 ప్రశ్నలు-40 మార్కులు, డేటాఅనాలిసిస్ అండ్ సఫిషియన్సీ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ 40 ప్రశ్నలు-40 మార్కులు.. ఇలా మొత్తం 200 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కును తగ్గిస్తారు.
చదవండి: దేశవ్యాప్తంగా బీస్కూల్స్‌లో మేనేజ్‌మెంట్ విద్యకు ఏటీఎంఏ.. సాధిస్తే మంచి భవిష్యత్తుకు..
మెరుగైన స్కోర్ ఇలా
మ్యాట్‌లో మెరుగైన స్కోర్‌కు అభ్యర్థులు విభాగాల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్
ఈ విభాగంలో రాణించేందుకు అభ్యర్థులు ఇంగ్లిష్ నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. స్పీడ్ రీడింగ్‌తోపాటు ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే.. అందులోని కీలక అంశాలను గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. పంక్చుయేషన్స్ నుంచి ప్యాసేజ్ మెయిన్ కాన్సెప్ట్ వరకూ.. అన్నింటిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
అర్థాలు, సమానార్థాలు, ఫ్రేజెస్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ ఫార్మేషన్‌లపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీటితోపాటు వొకాబ్యులరీపైనా పట్టు సాధించాలి. ఫలితంగా ఆయా ప్యాసేజ్‌ల్లోని పదజాలాన్ని వేగంగా అర్థం చేసుకుని నిర్దేశిత సమయంలో సమాధానాలిచ్చే నైపుణ్యం లభిస్తుంది. దీంతోపాటు ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవడం అలవర్చుకోవాలి. చదివేటప్పుడు అందులోని ముఖ్య సమాచారం, ప్రశ్నార్హమైన అంశాలు, కీలక పదాలు గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. అందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదవాలి.
ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్
ఈ విభాగంలో ప్రశ్నలు స్వీయ విశ్లేషణ, సూక్ష్మ పరిశీలన ఆధారంగా సమాధానం రాబట్టేవిగా ఉంటాయి. కాబట్టి సమాచారాన్ని సునిశితంగా పరిశీలించడం, పోలికలు, భేదాలు వంటి వాటిని గుర్తించే నైపుణ్యం ఉండాలి.
మ్యాథమెటికల్ స్కిల్స్
దీనికి సంబంధించి అభ్యర్థులు పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ టాపిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రాబబిలిటీ, పెర్ముటేషన్స్/కాంబినేషన్స్, నెంబర్స్, అల్‌జీబ్రా, జామెట్రీ విభాగాలపై దృష్టి పెట్టాలి. ఫార్ములా బేస్డ్ ప్రశ్నల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత సమయంలో సబ్జెక్ట్ ప్రిపరేషన్‌తోపాటు ఆయా సెక్షన్లలో ప్రీవియస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీ
ఈ విభాగంలోని ప్రశ్నలు.. గ్రాఫ్‌లు, ప్యాసేజ్‌లను పేర్కొని అందులో సమాచారం, గణాంకాల ఆధారంగా విశ్లేషించాల్సినవిగా ఉంటాయి. కాబట్టి ఆయా కాన్సెస్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. పర్సంటేజెస్, యావరేజెస్‌పై పట్టు సాధించాలి. ఇందుకోసం ఏదైనా ప్రామాణిక మెటీరియల్ లేదా ఆన్‌లైన్ టెస్ట్‌లోని ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కేవలం ఒకే తరహా ప్రశ్నలు కాకుండా.. విభిన్న క్లిష్టతతో కూడిన సమస్యలను సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్
ఈ విభాగంలో మంచి స్కోర్ కోసం సమకాలీన అంశాలపై దృష్టి సారించాలి. అదే విధంగా స్టాక్ జీకేపైనా పట్టు సాధించాలి. సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న జాతీయ, అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
చదవండి: ఐఐఎంల్లో గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వూ.. ప్రిపరేషన్ సాగించండిలా..
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- పేపర్ బేస్డ్ టెస్ట్ దరఖాస్తు చివరి తేదీ: 29.08.2023
- పేపర్ బేస్డ్ టెస్ట్ తేదీ: 03.09.2023
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దరఖాస్తు చివరి తేదీ: 12.09.2023
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీలు: 17.09.2023
- ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ దరఖాస్తు చివరి తేదీ: 17.08.2023
- ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ పరీక్ష తేదీ: 20.08.2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://mat.aima.in/