Job Trends: స్కిల్ ఉంటేనే.. కొలువు!
- ఐటీలో తగ్గనున్న ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్
- స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకుంటేనే అవకాశాలు
- బీఎఫ్‌ఎస్‌ఐ, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్‌లో జాబ్స్
ఐటీ రంగంలో ఈ ఏడాది నియామకాలు తక్కువగా ఉంటాయని ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి. మరోవైపు ఐటీని మినహాయించి.. ఇతర రంగాల్లో రిక్రూట్‌మెంట్స్‌లో వృద్ధి కనిపించనుందని, విద్యార్థులు సదరు రంగాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆ మూడు సెక్టార్లు
తాజా జాబ్ మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే.. ముఖ్యంగా మూడు రంగాలు నియామకాల్లో ముందున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్,హాస్పిటాలిటీ రంగాల్లో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్ పెరగనున్నాయి. దీంతోపాటు ఈ-కామర్స్, టెక్ స్టార్టప్స్, టెలి కమ్యూనికేషన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోనూ ఫ్రెషర్స్ నియామకాల్లో వృద్ధి కనిపించనుంది.
నౌకరీ డాట్ కామ్ నివేదిక ప్రకారం-సెప్టెంబర్ చివరికి బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్ సెక్టార్ల నియామకాల్లో ఏడు శాతం పెరుగుదల కనిపించింది. బీఎఫ్‌ఎస్‌ఐలోని బ్యాంకింగ్ విభాగంలో గత సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో నియామకాల్లో 40 శాతం వృద్ధి కనిపించింది. ఈ రంగంలో మొత్తం ఏడు శాతం వృద్ధి కనిపించగా.. ఇందులో ఇన్సూరెన్స్ విభాగంలో నాలుగు శాతం మేరకు ఉద్యోగాలు తగ్గడం గమనార్హం. ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్‌లో 22 శాతం, ఫార్మా/బయోటెక్/క్లినికల్ రీసెర్చ్ విభాగంలో 11 శాతం; ఆటోమోటివ్స్, ఆయిల్ అండ్ గ్యాస్/పవర్ సెక్టార్లలో ఆరు శాతం చొప్పున నియామకాల్లో వృద్ధి నమోదైంది.ఐటీ సాఫ్ట్‌వేర్/సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌లో మాత్రం 43 శాతం మేర నియామకాలు తగ్గడం గమనార్హం.
చదవండి: Free Certificate Courses: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉచిత సర్టిఫికేట్ కోర్సు... ఎక్కడంటే
ఈ-కామర్స్, టెక్ స్టార్టప్స్
ఈ ఏడాది ఫ్రెషర్స్ నియామకాల్లో ఈ-కామర్స్ అగ్రస్థానంలో ఉంటుందని టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. ఈ మేరకు కెరీర్ ఔట్‌లుక్ రిపోర్ట్ 2023-హెచ్‌వై2 (జూలై-డిసెంబర్) పేరుతో ప్రత్యేక నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం- ఈ-కామర్స్, టెక్ స్టార్టప్స్‌లో ఈ ఏడాది ద్వితీయార్థంలో 59 శాతం మేరకు ఫ్రెషర్స్ నియామకాలు జరగనున్నాయి. అదే విధంగా టెలికమ్యూనికేషన్స్‌లో 53 శాతం; ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 50 శాతం చొప్పున రిక్రూట్‌మెంట్స్‌లో పెరుగుదల కనిపించనుంది. ఐటీ విభాగంలో 49 శాతం; హెల్త్‌కేర్/ఫార్మా రంగంలో 42 శాతం; కన్‌స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లో 21 శాతం; ఎఫ్‌ఎంసీజీలో 24 శాతం; కన్సల్టింగ్‌లో 13 శాతం చొప్పున నియామకాల్లో పెరుగుదల నమోదైంది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థంలో మూడు శాతం మేర ఫ్రెషర్ నియామకాలు పెరుగుతాయని నివేదిక స్పష్టం చేసింది.
హాస్పిటాలిటీలో 60 శాతం!
ఈ ఏడాది ద్వితీయార్థంలో హాస్పిటాలిటీ రంగంలో నియామకాల్లో 60 శాతం వృద్ధి నమోదవుతుందని పలు సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హెల్త్ టూరిజం, బిజినెస్ ట్రావెల్, డొమెస్టిక్ పర్సనల్ టూర్స్‌లో పెరుగుదల కనిపిస్తుండడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. ఈవెంట్ కో ఆర్డినేటర్, జూనియర్ చెఫ్, ట్రావెల్ ఏజెంట్స్, రిసార్ట్ మేనేజర్స్, హోటల్ స్టాఫ్, హౌస్ కీపింగ్ విభాగాల్లో మానవ వనరులకు డిమాండ్ ఏర్పడనుంది. ఇదే సమయంలో స్కిల్ గ్యాప్ సమస్య కూడా ఈ రంగంలో ఉందని, సంబంధిత కోర్సుల అభ్యర్థులకు అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.
చదవండి: TCS NQT Exam: 1.6 లక్షల పోస్టులకు అవకాశం.. పరీక్షలో విజయానికి మార్గాలు..
బీఎఫ్‌ఎస్‌ఐలోనూ ఇదే జోరు
బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో ముఖ్యంగా.. బ్యాంకింగ్ విభాగంలో నియామకాలు గతేడాది మాదిరిగానే కొనసాగుతాయని అంచనా. క్రెడిట్ కార్డ్ సేల్స్, కస్టమర్ సర్వీస్ ఏజెంట్స్, బ్రాంచ్ మేనేజర్స్ హోదాల్లో ఎక్కువ నియామకాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ ఆధారిత సేవలు పెరగడం కూడా ఈ రంగంలో నియామకాలకు ఊతంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.
కన్సల్టింగ్.. తయారీ
ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సెక్టార్‌లోనూ నూతన నియామకాల్లో జోరు కొనసాగనుంది. బిజినెస్ ఆపరేషన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, డేటా సైన్స్ తదితర విభాగాల్లో అయిదు వేలకుపై నియామకాలు జరగనున్నాయి. ఇక దేశ జీడీపీలో కీలకమైన తయారీ రంగం.. నియామకాలకు ఊతంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రంగంలో దాదాపు 20 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు సెప్టెంబర్-డిసెంబర్ మధ్య కాలంలో లభిస్తాయని అంచనా. 5జీ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, ఇండస్ట్రియల్ ఐఓటీ, ఆర్ అండ్ డీ కార్యకలాపాల్లో పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
చదవండి: Engineering Jobs: స్టార్టప్ ఆఫర్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఐటీలో ఇలా
దేశ ఐటీ రంగంలో దాదాపు 50 వేల ఉద్యోగాలు ఫ్రెషర్స్‌కు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. దిగ్గజ సంస్థలతో పోల్చితే మధ్య తరహా ఐటీ సంస్థల్లో నియామకాలు కొంత ఎక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. బిగ్ డేటా టెస్టింగ్ ఇంజనీర్, ఐటీ ఆపరేషన్స్ మేనేజర్ వంటి జాబ్ ప్రొఫైల్స్‌కు డిమాండ్ నెలకొంది.
జాబ్ ప్రొఫైల్స్
డెవాప్స్ ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఎస్‌ఈఓ అనలిస్ట్, యుఎక్స్ డిజైనర్ వంటి జాబ్ ప్రొఫైల్స్‌కు డిమాండ్ నెలకొంది. అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఉద్యోగాలు కూడా ఎక్కువగా లభించనున్నాయి.
బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో.. బ్రాంచ్ మేనేజర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ హోదాలకు డిమాండ్ ఉంది. హెల్త్‌కేర్ అండ్ ఫార్మా రంగంలో.. రీసెర్చర్స్, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ నెలకొంది.
ఈ స్కిల్స్‌కు డిమాండ్
డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్ చైన్, బిజినెస్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్కిల్స్ ఉన్న వారికి జాబ్ మార్కెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫ్రెషర్స్ నియామకాల్లో సాఫ్ట్ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. క్రిటికల్ థింకింగ్, గ్రోత్ మైండ్ సెట్, టైమ్ మేనేజ్‌మెంట్, యాక్టివ్ లెర్నింగ్ దృక్పథం ఉన్న అభ్యర్థులకు అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు.
చదవండి: Humane AI Pin: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే..
అప్ స్కిల్లింగ్ మంత్ర
ఐటీలో తగ్గుతూ.. ఇతర రంగాల్లో నియామకాలు పెరుగుతున్న తరుణంలో విద్యార్థులు అప్ స్కిల్లింగ్‌కు ప్రాధాన్యం ఇస్తేనే ఉద్యోగ సాధనలో ముందుంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ కీలకంగా మారిన ఏఐ/ఎంఎల్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు పొందేలా కృషి చేయాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు కోరుకునే వారు ఏఐ/ఐఓటీ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని.. డెవాప్స్, యుఎక్స్ డిజైన్ వంటి నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలంటున్నారు.
ఎన్నో మార్గాలు
ఫ్రెష్ రిక్రూట్‌మెంట్స్‌లో కీలకంగా నిలుస్తున్న ఏఐ, ఐటీ స్కిల్స్‌ను సొంతం చేసుకునేందుకు ప్రస్తుతం పలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఒరాకిల్, ఐబీఎం వంటి సంస్థలు అందిస్తున్న ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా సంబంధిత సర్టిఫికేషన్స్ సొంతం చేసుకుంటే.. ఉద్యోగ సాధనలో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది.