Career Opportunities in Yoga: యోగాతో కొలువులు.. నెలకు రూ.50 వేల వేతనం.. మార్గాలు ఇవే..

Courses and Career Opportunities in Yoga: ఆధునిక జీవితం.. ఉరుకులు, పరుగుల జీవన విధానం! కాలంతో పోటీ పడుతూ.. పరుగెడుతున్న పరిస్థితులు!! దాంతో శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతున్న వైనం! ఈ అలసట నుంచి ఉపశమనానికి సహజ సిద్ధ మార్గమే.. యోగా!! అందుకే ఇటీవల యోగ, నేచురోపతి విధానాలను అనుసరించే వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా యోగ, నేచురోపతి నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న యువత దీన్ని ఉపాధి మార్గంగా కూడా మలచుకుంటోంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్, డిగ్రీ అర్హతతో యోగా, నేచురోపతి కోర్సుల్లో చేరి..కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం...
  • యోగా, నేచురోపతిలో పెరుగుతున్న అవకాశాలు
  • ఇన్‌స్ట్రక్టర్స్, థెరపిస్ట్‌ వంటి ఎన్నో కొలువులు
  • యువతకు వరంగా మారుతున్న యోగ కోర్సులు
  • అకడమిక్‌గా రాణించేందుకు ఎన్నో మార్గాలు

మనుషులు రాకెట్‌ వేగంతో పరుగెడుతున్నారు. విధి నిర్వహణలో లక్ష్యాలు చేరుకునేందుకు ఎన్నో బరువుబాధ్యతలు మోస్తున్నారు. దాంతో మానసికంగా, శారీరకంగా అనేక ఒత్తిళ్లు,వ్యాధులు వేధిస్తున్నా యి. ఇలాంటి వాటికి చక్కటి పరిష్కారం చూపే విధానమే.. యోగా, నేచురోపతి(Yoga, Naturopathy) అంటున్నారు నిపుణులు.

Coding and Programming Jobs: కోడింగ్‌తో కొలువులు.. నైపుణ్యాలు, సొంతం చేసుకునేందుకు మార్గాలు..

యోగా అంటే

యోగా అనగానే మనకు పలు ఆసనాలు, వ్యాయామాలు గుర్తొస్తాయి. వీటి ద్వారా లభించే ప్రయోజనం కంటికి కనిపించదు. కాని మానసిక, శారీరక ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అంతర్గత శాంతిని, సంపూర్ణ స్వస్థతను అందిస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, నేచురోపతిలవైపు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం పలు ఆసనాలు, ధ్యాన ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది.

ఉపాధికి ఊతం

యోగ, నేచురోపతి విధానాల్లో వ్యక్తిగతంగా తమ సమస్యలకు తగిన రీతిలో ఆయా ప్రక్రియలను పూర్తి చేయాలంటే సాధన చేయాలి. ఈ సాధన కూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తేనే సత్ఫలితం లభిస్తుంది. ఆ నిపుణులను తయారు చేసేవే యోగ, నేచురోపతి కోర్సులు. శాస్త్రీయ విధానంలో ఉండే బోధన పద్ధతులతో కూడిన ఈ కోర్సులు పూర్తి చేసిన వారు నిపుణలుగా రాణించగలరు. 

Social Sector Jobs: కార్పొరేట్‌ జాబ్స్‌ వదిలి.. సోషల్‌ సెక్టార్‌ వైపు అడుగులు వేస్తున్న యువత!

అకడమిక్‌ కోర్సులు

  • Yoga and Naturopathy Courses: యోగా, నేచురోపతిలోని మెళకువలను, నైపుణ్యాలను పొందేందుకు ఇప్పుడు అకడమిక్‌గా ఎన్నో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన కోర్సు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌(బీఎన్‌వైఎస్‌). ఈ కోర్సు.. ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి మెడికల్‌ కోర్సులకు చక్కటి ప్రత్యామ్నాయంగా మారుతోంది. అయిదున్నరేళ్ల వ్యవధిలోని బీఎన్‌వైఎస్‌లో చేరితే.. యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. 
  • ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు ఉన్నత విద్యలో నేచురోపతి అండ్‌ యోగాలో ఎండీ కోర్సును అభ్యసించొచ్చు. అదే విధంగా ఎమ్మెస్సీ సైకాలజీ,ఎమ్మెస్సీ క్లినికల్‌ న్యూట్రిషన్,ఎమ్మెస్సీ డైటిటిక్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ వంటి కోర్సుల్లో చేరొచ్చు.
  • బీఎన్‌వైఎస్‌ ఉత్తీర్ణతతో వైద్య వృత్తి చేపట్టొచ్చు. ప్రస్తుతం పలు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ సైతం.. అలోపతి వైద్యం అందిస్తూనే వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేసి.. సహజ సిద్ధ ప్రక్రియలను రోగులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కాబట్టి బీఎన్‌వైఎస్‌ ఉత్తీర్ణులకు హాస్పిటల్స్‌లో సైతం వైద్యులుగా ఉపాధి లభిస్తుంది.
  • బీఎన్‌వైఎస్‌కు సంబంధించి ప్రవేశాలను నీట్‌–యూజీ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 200 సీట్లు, తెలంగాణలో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

సర్టిఫికేషన్స్‌

యోగ, నేచురోపతి విధానాలకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఈ విభాగంలో సర్టిఫికెట్‌ కోర్సులు(Certificate Courses in Yoga and Naturopathy) కూడా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యోగా టీచర్లను సర్టిఫై చేసేందుకు ‘స్కీమ్‌ ఫర్‌ వాలంటరీ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ యోగా ప్రొఫెషనల్స్‌’ను ప్రవేశపెట్టింది. ఇందులో యోగా ఇన్‌స్ట్రక్టర్‌ సర్టిఫికేషన్, యోగా టీచర్‌ సర్టిఫికేషన్, యోగా మాస్టర్‌ సర్టిఫికేషన్, యోగా ఆచార్య సర్టిఫికేషన్‌లుగా వర్గీకరించింది. దీనికి సంబంధించిన ప్రమాణాలను క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయిస్తుంది.

Degree Jobs In MNC Companies: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. ఐటీ కొలువు!

బ్యాచిలర్‌ కోర్సులు

యోగా, నేచురోపతిలకు సంబంధించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు యూనివర్సిటీలు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో కోర్సులను(Bachelor Degree Courses Yoga and Naturopathy) అందిస్తున్నాయి. బీఏ, బీఎస్సీ యోగా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు వీటిల్లో చేరేందుకు అర్హులు. బీఏ/బీఎస్సీ యోగా పూర్తిచేసిన వారికి ఎంఏ/ఎమ్మెస్సీ యోగా థెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా పలు పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సుల్లోనూ చేరి.. యోగాలో నైపుణ్యం సాధించొచ్చు.

పీజీ స్థాయిలోనూ

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) స్థాయిలోనూ.. యోగా, నేచురోపతి సంబంధిత స్పెషలైజ్డ్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో ఎంఏ యోగా అండ్‌ కాన్షియస్‌నెస్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఈ యూనివర్సిటీ పరిధిలో పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ యోగా, డిప్లొమా ఇన్‌ యోగా, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యోగా కూడా ఉన్నాయి. శ్రీకాకుళంలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ యూనివర్సిటీ కూడా పీజీ డిప్లొమా ఇన్‌ యోగా,డిప్లొమా ఇన్‌ యోగా కోర్సులను అందిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ..ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ యోగా కోర్సును ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది.

Tech Skills: జావాస్క్రిప్ట్‌.. అవకాశాల జోరు!

డిప్లొమా కోర్సులు

యోగాకు సంబంధించి ప్రస్తుతం డిప్లొమా కోర్సులు (Diploma Courses in Yoga and Naturopathy) కూడా అందుబాటులో ఉన్నాయి. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో ఉండే ఈ కోర్సుల్లో ఇంటర్మీడియెట్‌ అర్హతతో ప్రవేశం పొందొచ్చు. సర్టిఫికెట్‌ కోర్సులకు సంబంధించి పలు ఇన్‌స్టిట్యూట్‌లు పదో తరగతి అర్హతగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

లభించే ఉద్యోగాలు

  • ప్రస్తుతం యోగా, నేచురోపతిలలో సర్టిఫికెట్‌ నుంచి పీజీ వరకూ.. ఆయా స్థాయిలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా బోధన వృత్తి, రీసెర్చ్‌లు ముందంజలో నిలుస్తున్నాయి. వీటితోపాటు యోగా ఏరోబిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌; క్లినికల్‌ సైకాలజిస్ట్‌; యోగా థెరపిస్ట్‌; యోగా ఇన్‌స్ట్రక్టర్‌; థెరపిస్ట్‌/నేచురోపత్స్‌; ట్రైనర్‌/ఇన్‌స్ట్రక్టర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.
  • యోగాలో పొందిన శిక్షణ ఆధారంగా రీసెర్చ్, ట్రైనింగ్‌ విభాగాల్లో స్థిరపడొచ్చు. దీంతోపాటు యోగా థెరపిస్ట్‌(Yoga Therapists)గా కెరీర్‌ను ప్రారంభించొచ్చు. జిమ్స్, స్కూల్స్, హెల్త్‌ సెంటర్స్, హౌసింగ్‌ సొసైటీస్‌లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో కార్పొరేట్‌ కంపెనీలు సైతం తమ ఉద్యోగుల వెల్‌నెస్‌ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం యోగా ట్రైనింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో యోగాలో నిర్దిష్ట సర్టిఫికెట్, నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. కార్పొరేట్‌ రంగంలోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు.

స్వయం ఉపాధి

యోగా, నేచురోపతిలో బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీరు సొంతంగా వెల్‌నెస్‌ సెంటర్లను నెలకొల్పవచ్చు. ప్రముఖులకు పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్లుగానూ వ్యవహరించొచ్చు.

Tech Skills: పైథాన్‌.. కొలువుల కొండ! 

ఆకర్షణీయ ఆదాయం

  • యోగా, నేచురోపతిలతో కెరీర్‌ ప్రారంభించిన వారికి ఆదాయం కూడా బాగానే లభిస్తోంది. 
  • నేచురోపతి ఫిజిషియన్‌గా ఏటా రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అందుకోవచ్చు.
  • నేచురల్‌ థెరపిస్ట్‌గా సగటున ఆరు లక్షల వార్షికాదాయం పొందొచ్చు.
  • ట్రైనర్‌గా నెలకు రూ.50వేల వరకు ఆదాయం లభిస్తుంది.
  • రిహాబిలిటేషన్‌ స్పెషలిస్ట్‌గా ఏటా అయిదు లక్షల వరకు ఆదాయం సొంతం చేసుకునే అవకాశం ఉంది.
  •  స్వయం ఉపాధి కోణంలో నెలకు రూ.50 వేలకు పైగానే ఆర్జించొచ్చు.

పీజీ ఇన్‌స్టిట్యూట్స్‌

యోగాకు పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిపుణులను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ యోగా అండ్‌ నేచురోపతి పేరిట ఝజ్జర్‌(హర్యాన), నాగమంగళ(కర్నాటక)లో రెం డు క్యాంపస్‌లను నెలకొల్పింది. యోగా అండ్‌ నేచురోపతిలో రీసెర్చ్‌ సెంటర్స్‌..సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యోగా అండ్‌ నేచురోపతి నెలకొల్పింది. విజయవాడ, రాయ్‌పూర్, ఢిల్లీ, జార్ఖండ్, కసరగోడ్‌(కేరళ), భువనేశ్వర్, జైపూర్, కళ్యాణి (పశ్చిమబెంగాల్‌)లలో వీటిని ఏర్పాటు చేసింది.

Technology Jobs: బ్లాక్‌చైన్‌ డెవలపర్‌.. ఐబీఎం, అసెంచర్ వంటి కంపెనీల్లో ఉద్యోగం.. ల‌క్షల్లో వేత‌నం..

యోగా కోర్సులను అందిస్తున్న సంస్థలు

  • ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.
  • శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.
  • డా‘‘బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీ,శ్రీకాకుళం.
  • గాంధీ నేచురోపతిక్‌ మెడికల్‌ కాలేజ్,హైదరాబాద్‌.
  • శ్రీ పతంజలి మహర్షి నేచురోపతి అండ్‌ యోగా మెడికల్‌ కాలేజ్, గుంతకల్‌.
  • కేర్‌ యోగా,నేచురోపతి మెడికల్‌ కాలేజ్,బాపట్ల.
  • పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌.
  • ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్, ఉజిరే, కర్నాటక.
  • జేఎస్‌ఎస్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సెన్సైస్, ఉజైర్, కర్నాటక.
  • శివరాజ్‌ నేచురోపతి అండ్‌ యోగా మెడికల్‌ కాలేజ్, సేలం.
  • గవర్నమెంట్‌ నేచురోపతి అండ్‌ యోగా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్, చెన్నై.
  • గవర్న్‌మెంట్‌ నేచుర్‌క్యూర్‌ అండ్‌ యోగా కాలేజ్, మైసూర్‌.

యోగా అండ్‌ నేచురోపతి.. ముఖ్యాంశాలు

  • యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా స్థాయిలోనూ పలు కోర్సులు. 
  • యోగా, నేచురోపతి నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌.
  • సగటున రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు వార్షిక ఆదాయం.
  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటు.

Data Scientist Jobs Roles, Salary: డిగ్రీ అవసరం లేకున్నా.. ఈ నైపుణ్యాలు తప్పనిసరి..

విస్తృత అవకాశాలు
యోగా అనేది ఒక విశిష్టమైన ప్రక్రియ. ఇది శారీరక, మానసిక ఒత్తిడిని, ఆందోళనలను దూరం చేస్తుంది. వ్యక్తులు ఉల్లాసంగా ఉండేలా చూస్తుంది. అందుకే నేటి ఒత్తిళ్ల జీవన విధానంలో యోగా శిక్షకులకు డిమాండ్‌ నెలకొంది. హాస్పిటల్స్, వెల్‌నెస్‌ సెంటర్లు, రిహాబిలిటేషన్‌ సెంటర్లలో యోగా, నేచురోపతి నిపుణులకు అవకాశాలు లభిస్తున్నాయి. – శివ గణేశ్, సర్టిఫైడ్‌ యోగా ట్రైనర్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags