Skip to main content

Data Scientist Jobs Roles, Salary: డిగ్రీ అవసరం లేకున్నా.. ఈ నైపుణ్యాలు తప్పనిసరి..

Data Scientist Job Roles, Salary, Skills In Telugu
Data Scientist Career path | Job Roles, Salary, Skills and more details here

ప్రపంచం నేడు టెక్నాలజీ జపం చేస్తోంది. కొత్త నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు అన్ని రంగాల్లో డేటాసైన్స్‌ దూసుకుపోతోంది! ఫలితంగా డేటా సైంటిస్ట్‌ హాట్‌ కెరీర్‌గా మారుతోంది!! ప్రస్తుతం అనేక సంస్థలు తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు డేటా అనలిస్టులను, డేటా సైంటిస్టులను నియమించుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో డేటాసైన్స్‌ విభాగంలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో.. డేటా సైన్స్‌ ప్రత్యేకతలు, డిమాండ్‌కు కారణాలు, ఉద్యోగాలు–విధులు, నైపుణ్యాలు, అందుకు నేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం..

  • డేటాసైన్స్‌ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌

డేటాసైన్స్‌ నిపుణులు.. పెద్ద మొత్తంలో డేటాను అర్థం చేసుకోవడం, డేటాలో ప్యాట్రన్స్‌ను గుర్తించడంతోపాటు ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత కొన్నేళ్ల డేటాను సేకరించి, పరిశీలించి.. ప్రస్తుత అవసరాలకు తగ్గుట్టు వినియోగించగలగాలి. డేటా సైంటిస్టులు అంటే.. గణిత శాస్త్రవేత్తలు(మ్యాథమెటీషియన్స్‌), గణాంక వేత్తలు(స్టాటిస్టిషియన్స్‌), కంప్యూటర్‌ సైంటిస్టుల కలయికగా చెప్పొచ్చు. వీరు బిజినెస్, ఐటీ రంగాల మధ్య వారధిగా పనిచేస్తారు.

చ‌ద‌వండి: Blockchain‌ Jobs: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్‌.. అవసరమైన నైపుణ్యాలు ఇవే...

భిన్నమైన కొలువు

డేటాసైన్స్‌ కొలువు సంప్రదాయ ఉద్యోగాలకు భిన్నంగా ఉంటుంది. ఇది ఓ సంస్థ లేదా కంపెనీ ప్రగతికి తోడ్పడే డేటాను క్రోడీకరించి, విశ్లేషిస్తుంది. డేటా సైంటిస్ట్‌లు సదరు సంస్థ ఉత్పత్తులు, వినియోగదారులు, మార్కెటింగ్, ఉద్యోగులు.. ఇలా అన్ని అంశాలను కూలంకుషంగా అధ్యయనం చేస్తారు. దాని ఆధారంగా భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకుంటే.. మార్కెట్‌లో విజయం సాధించే అవకాశం ఉందో అంచనావేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. డేటా ఆధారంగా భవిష్యత్‌ వ్యాపార నిర్ణయాలకు దిశానిర్దేశం చేస్తారు. 

స్కిల్స్‌ తప్పనిసరి

  • డేటాసైంటిస్ట్‌గా మారేందుకు టెక్నికల్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ అవసరం లేకున్నా.. సంబంధిత నైపుణ్యాలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. డేటాసైన్స్‌ రంగంలో కెరీర్‌ కోరుకునేవారికి కోడింగ్, ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, మెషిన్‌ లెర్నింగ్, హడూప్‌పై అవగాహన ఉండాలి. ముఖ్యంగా పైథాన్, ఆర్, ఎస్‌క్యూఎల్‌ ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాలి. వీటితోపాటు విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్స్‌ స్కిల్స్, వినడం, సమస్య పరిష్కార నైపుణ్యం, విజువలైజేషన్‌ చేయగలగాలి. 
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, స్టాటిస్టిక్స్, డేటా మేనేజ్‌మెంట్, బిగ్‌ డేటా వంటి వాటిపై పట్టు సాధిస్తే.. డేటాసైంటిస్ట్‌గా రాణించొచ్చు. పైథాన్, రిలేషనల్‌ డేటాబేస్‌లు, మెషిన్‌ లెర్నింగ్‌లో లోతైన పరిజ్ఞానంతోపాటు టెక్నికల్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. 
  • డేటాసైంటిస్టుల ఆలోచనా విధానం ఆర్గనైజింగ్‌గా ఉండాలి. కొత్త ప్రాజెక్టుల కోసం తమ పరిశోధన ఫలితాలను విశ్లేషించగలగాలి. 
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌: డేటాసైంటిస్టులు ప్రోగ్రామర్లు, బిజినెస్‌ మేనేజర్స్‌తో కలిసి పనిచేస్తారు. కాబట్టి తమ ఆలోచనలను వారితో స్పష్టంగా చెప్పగలగాలి. 
  • క్రిటికల్‌ అండ్‌ లాజికల్‌ థింకింగ్‌: వీరు సంక్లిష్ట సమస్యలపై పనిచేస్తారు. కాబట్టి, డేటా సైంటిస్టుల విజయానికి విమర్శనాత్మక ఆలోచన విధానం తప్పనిసరి. 
  • మ్యాథ్‌ స్కిల్స్‌: డేటా సైంటిస్టులకు గణిత భావనలు, టెక్నికల్‌ అంశాలపై పరిజ్ఞానం ఉండాలి. 
  • సృజనాత్మకత: ప్రాజెక్టులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి డేటాసైంటిస్ట్‌లు సృజనాత్మక మార్గాలను అన్వేషించగలగాలి.


చ‌ద‌వండి: Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక‌... రూ. 12 లక్షల వార్షిక వేతనం

జాబ్‌ ప్రొఫైల్స్‌

  • బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్ట్‌: వీరు మార్కెట్‌లో కంపెనీ ప్రస్తుత స్థానంతోపాటు మరింత ముందుకెళ్లడానికి అవసరమైన మార్గాలపై సమాచారం సేకరించి విశ్లేషిస్తారు.
  • డేటా మైనింగ్‌ ఇంజనీర్‌: తాము పనిచేస్తున్న కంపెనీ డేటా మాత్రమే కాకుండా.. అదనంగా థర్డ్‌ పార్టీ(మూడో పక్షం) డేటాను కూడా డేటా మైనింగ్‌ ఇంజనీర్‌ పరిశీలిస్తారు. దానికోసం లేటెస్ట్‌ అల్గారిథంను డెవలప్‌ చేస్తారు. 
  • డేటా ఆర్కిటెక్ట్‌: వీరు వినియోగదారులు, సిస్టమ్‌ డిజైనర్లు, డెవలపర్స్‌తో కలిసి పనిచేస్తారు. డేటా మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ను ఉపయోగించి.. డేటా వనరులను కేంద్రీకృతం చేయడం, ఇంటిగ్రేట్‌ చేయడం, మేనేజ్‌ చేయడంతోపాటు దాన్ని సంరక్షించడానికి ఉపయోగించే బ్లూప్రింట్స్‌ను రూపొందిస్తారు. 
  • డేటాసైంటిస్ట్‌: ప్రస్తుత వ్యాపార విధానాన్ని విశ్లేషించడం ద్వారా.. మార్కెట్‌లో అది ఏ మేరకు ప్రభావం చూపుతుందో డేటా ఆధారంగా విశ్లేషిస్తారు. సంస్థ అభివృద్ధికి దోహదపడే మార్గాలు చూపడంలో కీలకంగా వ్యవహరిస్తారు. కంపెనీ భవిష్యత్‌ అవసరాలను ఊహించి.. అందుకు అవసరమైన డేటాను సేకరిస్తారు. అత్యంత సంక్లిష్టమైన బిజినెస్‌ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తారు. 

జాబ్‌ మార్కెట్‌

డేటా సైంటిస్ట్‌ ఉద్యోగం ఈ దశాబ్దంలోనే అత్యంత హాట్‌ కెరీర్‌గా మారింది. ప్రస్తుతం అనేక సంస్థలు తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు డేటా అనలిస్టులను, డేటా సైంటిస్టులను నియమించుకుంటున్నాయి. తద్వారా ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఒరాకిల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్‌ వంటి పెద్ద కంపెనీలు డేటాసైంటిస్టుల నియామకాలు జరుపుతున్నాయి. ఇక మధ్య, చిన్న స్థాయి వ్యాపార సంస్థలు కూడా డేటాసైంటిస్టుల సేవలను ఫ్రీలాన్స్‌ విధానంలో పొందుతున్నాయి. 
 

చ‌ద‌వండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!


కెరీర్‌ స్కోప్‌

డేటాసైన్స్‌ రంగంలో అవకాశాలు భారీగా ఉంటాయని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ‘గ్లాస్‌ డోర్‌’ సంస్థ లెక్కల ప్రకారం–యూఎస్‌లో డేటా సైంటిస్ట్‌ సగటు వార్షిక వేతనం 108,224 డాలర్లుగా ఉంది. అంటే.. ఇది సాధారణ టెక్‌ ఉద్యోగి వేతనం కంటే దాదాపు రెట్టింపు. అనుభవం, నైపుణ్యాల ఆధారంగా డేటా సైన్స్‌ నిపుణులు సగటున 1.29 లక్షల డాలర్లు అందుకుంటున్నారని చెబుతున్నారు. మేనేజ్‌మెంట్‌ స్థాయిలో స్కిల్స్‌ ఉన్న డేటా సైంటిస్టులు 2.50 లక్ష డాలర్లకంటే ఎక్కువగా సంపాదించవచ్చు. అభ్యర్థి చదు వు, నైపుణ్యం, అనుభవం, కంపెనీ ఆధారంగా వేతనాలు లభిస్తున్నాయి. అర్హతలు, స్కిల్స్‌ ఉన్నవారికి డిమాండ్‌ నెలకొంది. సంబంధిత నైపుణ్యాలు,  చక్కటి పనితీరు ఉన్నవారికి వేతనాలు సైతం అధికంగానే ఉంటున్నాయి.

ఆన్‌లైన్‌లో కోర్సులు 

ఇంజనీరింగ్‌ విద్యార్థులతోపాటు ఐటీ ప్రొఫెషనల్స్‌ కూడా డేటాసైన్స్‌ నైపుణ్యాలు పెంచుకోవాలని కోరుకుంటున్నారు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల నేపథ్యం ఉన్న వారికి ఈ కెరీర్‌ అనువైనదిగా చెప్పొచ్చు. డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్‌ వంటి విభాగాల్లో పనిచేయాలని ఆసక్తి ఉంటే.. ప్రస్తుతం అకడెమిక్‌గా అందుబాటులోకి వస్తున్న రెగ్యులర్‌ కోర్సులతోపాటు మూక్స్‌ వంటి ఆన్‌లైన్‌ మార్గంలోనూ నైపుణ్యాలు పెంచుకునే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Computer Science

Published date : 05 Nov 2021 03:59PM

Photo Stories